హార్మూజ్‌ మళ్లీ మూసివేత  | Iran Closes Strait Of Hormuz Again Over Israel Attacks On Lebanon | Sakshi
Sakshi News home page

హార్మూజ్‌ మళ్లీ మూసివేత 

Jun 21 2026 5:22 AM | Updated on Jun 21 2026 6:37 AM

Iran Closes Strait Of Hormuz Again Over Israel Attacks On Lebanon

లెబనాన్‌పై ఇజ్రాయెల్‌ దాడుల పట్ల ఇరాన్‌ ఆగ్రహం  

దురాక్రమణ కొనసాగితే తదుపరి 

చర్యలు తప్పవని హెచ్చరిక 

నేడు స్విట్జర్లాండ్‌లో అమెరికా–ఇరాన్‌ చర్చలు ప్రారంభం  

దుబాయ్‌:  లెబనాన్‌పై ఇజ్రాయెల్‌ భీకర దాడుల పట్ల ఇరాన్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. ఇజ్రాయెల్‌ దుశ్చర్యను ఖండిస్తూ హార్మూజ్‌ జలసంధిని మళ్లీ మూసివేసినట్లు శనివారం ప్రకటించింది. అవగాహనా ఒప్పందాన్ని అమలు చేయడంలో, లెబనాన్‌పై దాడులు ఆపడంలో అమెరికా దారుణంగా విఫలమైందని ఇరాన్‌కు చెందిన జాయింట్‌ మిలటరీ కమాండ్‌ ఆగ్రహం వ్యక్తంచేసింది. 

ఒప్పందంలోని షరతులు అమల్లోకి రాకపోవడంతో అందుకు ప్రతిస్పందనగా హార్మూజ్‌ తక్షణమే మూసివేస్తున్నామని ఒక ప్రకటనలో తేల్చిచెప్పింది. లెబనాన్‌పై దురాక్రమణ ఇలాగే కొనసాగితే, తదుపరి చర్యలు తీసుకోక తప్పదని, అందుకు ప్రణాళికలు సైతం సిద్ధం చేశామని హెచ్చరించింది. ఇప్పటివరకు ఇజ్రాయెల్‌ దాడుల్లో మరణించినవారి సంఖ్య 4 వేలు దాటిందని లెబనాన్‌ ఆరోగ్య శాఖ ప్రకటించింది.  

సాంకేతిక స్థాయి చర్చలే  
స్విట్జర్లాండ్‌లోని బర్గెన్‌స్టాక్‌లో ఆదివారం సాంకేతిక స్థాయి చర్చలు ప్రారంభమవుతాయని కీలక మధ్యవర్తి అయిన పాకిస్తాన్‌ తెలిపింది. ఖతార్‌ సహా ఇతర భాగస్వామ్య దేశాలు కూడా ఈ చర్చల్లో పాల్గొంటాయని వెల్లడించింది. ఇరాన్‌ ప్రతినిధి బృందం స్విట్జర్లాండ్‌కు పయనమైనట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. మధ్యవర్తుల సమక్షంలో అమెరికా, ఇరాన్‌ల మధ్య శుక్రవారం జరగాల్సిన చర్చలు లెబనాన్‌పై ఇజ్రాయెల్‌ దాడుల వల్ల వాయిదా పడిన సంగతి తెలిసిందే. అయితే, మధ్యంతర ఒప్పందానికి అమెరికా కట్టుబడి ఉందని తాము విశ్వసించేదాకా ఈ చర్చల్లో పెద్దగా పురోగతి ఉండకపోవచ్చని ఇరాన్‌ విదేశాంగ శాఖ ప్రతినిధి ఇస్మాయిల్‌ బగాహీ సంకేతాలిచ్చారు. 

అవతలి పక్షం(అమెరికా) కూడా బాధ్యతలను నెరవేర్చాలని డిమాండ్‌ చేయడమే ఈ పర్యటన ఉద్దేశమని అన్నారు. అవగాహనా ఒప్పందంలోని కీలకమైన హామీలను నెరవేర్చిన తర్వాతే తుది ఒప్పందం కోసం చర్చలు ముందుకు సాగుతాయని తేల్చిచెప్పారు. ఒకవేళ నెరవేర్చకపోతే అప్పుడు మొత్తం అవగాహన ఒప్పందమే ప్రమాదంలో పడుతుందని ఇస్మాయిల్‌ బగాహీ అభిప్రాయపడ్డారు. స్విట్జర్లాండ్‌ చర్చల్లో తమ బృందం పాల్గొంటుందని అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌ శనివారం ధ్రువీకరించారు. తమ ప్రతినిధులు జేర్డ్‌ కేష్నర్, స్వీట్‌ విట్కాఫ్‌ ఇప్పటికే స్విట్జర్లాండ్‌కు చేరుకున్నారని తెలిపారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement