ట్రంప్‌కు ఖమేనీ స్ట్రాంగ్‌ వార్నింగ్‌.. చైనా, రష్యా, భారత్‌ పరిస్థితేంటి? | Iran Ayatollah Ali Khamenei Says US made big mistake | Sakshi
Sakshi News home page

ట్రంప్‌కు ఖమేనీ స్ట్రాంగ్‌ వార్నింగ్‌.. చైనా, రష్యా, భారత్‌ పరిస్థితేంటి?

Jun 23 2025 9:09 AM | Updated on Jun 23 2025 9:43 AM

Iran Ayatollah Ali Khamenei Says US made big mistake

టెహ్రాన్‌: ఇరాన్‌, ఇజ్రాయెల్‌, అమెరికా మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ అణు కేంద్రాలపై అమెరికా దాడులను ఖమేనీ తీవ్రంగా ఖండించారు. ఇదే సమయంలో దాడులు చేసిన వారికి తప్పకుండా శిక్ష కొనసాగుతుంది అంటూ హెచ్చరించారు.

ఇరాన్‌లోని మూడు అణు కేంద్రాలపై అమెరికా దాడుల తర్వాత సుప్రీం లీడర్‌ ఖమేనీ మొదటిసారి ట్విట్టర్‌ వేదికగా స్పందించారు. ఈ క్రమంలో ఖమేనీ..‘ఇజ్రాయెల్, అమెరికాకు కఠినమైన, నిర్ణయాత్మక ప్రతిస్పందన ఉంటుంది. శిక్ష కొనసాగుతోంది. జియోనిస్ట్ శత్రువు పెద్ద తప్పు చేశాడు. పెద్ద నేరం చేశాడు. దానిని శిక్షించాల్సిందే.. తప్పకుండా శిక్ష ఉంటుంది అని హెచ్చరికలు జారీ చేశారు.

మరోవైపు.. ఐక్యరాజ్యసమితిలోని ఇరాన్‌ అంబాసిడర్‌ అమీర్‌ సయీద్‌ ఇరవానీ కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికా తమ దేశంలోని అణు స్థావరాలపై దాడి చేసి దౌత్యాన్ని నాశనం చేయాలని నిర్ణయించుకుందని విమర్శించారు. ఇరాన్‌ మిలిటరీ సరైన సమయంలో స్పందిస్తుందని అమెరికాను హెచ్చరించారు. దాడుల నేపథ్యంలో అవసరమైన మేరకు చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.

రష్యా, చైనా వైఖరేంటి?
ఇరాన్ మీద ఇజ్రాయెల్ వైమానిక దాడులు చేయగానే చైనా వేగంగా స్పందించింది. ఇజ్రాయెల్ ‘రెడ్ లైన్ దాటిందని’ చెప్పింది. ఇజ్రాయెల్ చర్యను తాము తీవ్రంగా పరిగణిస్తున్నామని బీజింగ్ వ్యాఖ్యానించింది. మరోవైపు.. రష్యా ఇజ్రాయెల్ దాడులను విమర్శించినప్పటికీ ఇరాన్‌కు మాస్కో ప్రత్యక్షంగా ఎలాంటి సైనిక, ఆయుధ సాయం చేయలేదు. ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా ఎలాంటి స్పష్టమైన నిర్ణయం తీసుకోలేదు. ఈ ఘర్షణలోకి అమెరికా ప్రవేశించడం, ఆ తర్వాత ఇది మరింత తీవ్రమైతే చైనా, రష్యా ఇరాన్‌కు సైనిక సాయం అందిస్తాయా అనే ప్రశ్న తలెత్తుతోంది. ‘రష్యా, చైనా ఇరాన్‌కు దౌత్యపరమైన మద్దతిస్తాయి. కానీ అవి సైనికంగా ఎలాంటి సాయం చేయవు. ఇరాన్ కోసం ఈ రెండు దేశాలు ఇజ్రాయెల్‌తో యుద్ధానికి దిగవు’ అని చైనాకు చెందిన కీలక నేత చెప్పుకొచ్చారు.

ఇస్లామిక్ దేశాలు ఎటువైపు?
ఇరాన్‌పై ఇజ్రాయెల్‌ దాడుల్ని ఖతార్, సౌదీ అరేబియా, ఒమన్ సహా అనేక పశ్చిమాసియా దేశాలు ఖండించాయి. ఇజ్రాయెల్ చర్యలు అంతర్జాతీయ శాంతి భద్రతలకు తీవ్రమైన విఘాతం అని ఖతార్ హెచ్చరించింది. ఈ దాడులు అంతర్జాతీయ చట్టాల ఉల్లంఘనకు నిదర్శనం అని సౌదీ అరేబియా ప్రకటించింది. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య ఘర్షణ మరింత తీవ్రమైతే, దాని ప్రభావం పశ్చిమాసియాపైనే కాకుండా మొత్తం ప్రపంచం మీద ప్రభావం చూపుతుందని ఈ దేశాలు భావిస్తున్నాయి. అయితే, అరబ్ దేశాల తాజా ప్రకటనలు చూస్తుంటే, ఈ ఘర్షణ మరింత పెద్దది కావడం వారికి ఏ మాత్రం ఇష్టం లేదని స్పష్టంగా తెలుస్తోంది.

ఆందోళనలో భారత్‌?
భారత్‌కు ఇజ్రాయెల్‌, ఇరాన్‌తో బలమైన సంబంధాలు ఉన్నాయి. భారత్‌, ఇరాన్‌ రెండు దేశాలవి ప్రాచీన నాగరికతలు. చమురు విషయంలో ఎక్కువగా దిగుమతుల మీద ఆధారపడిన భారత్‌కు ఇరాన్ బలమైన భాగస్వామి. రెండు దేశాల మధ్య చాలాకాలంగా వ్యూహాత్మక, ఆర్థిక, సాంస్కృతిక సంబంధాలున్నాయి. ఇక, ఇజ్రాయెల్‌ విషయానికి వస్తే.. నెల రోజుల క్రితం భారత్ పాకిస్తాన్‌లోని కొన్ని ప్రాంతాల మీద వైమానిక దాడులు చేసింది. ఈ విషయంలో భారత్‌కు ఇజ్రాయెల్ బహిరంగంగా మద్దతిచ్చింది. దీంతో, రెండు దేశాల మధ్య స్నేహ బంధం మరింత పెరిగింది. ఈ నేపథ్యంలో దీర్ఘకాలంలో తన ప్రయోజనాలకు హాని కలగకుండానే ఎవరి పక్షం వహించాలో నిర్ణయించుకోవడమనేది భారత్ ముందున్న అతి పెద్ద సవాల్‌. 

Advertisement
 
Advertisement
Advertisement