నిమిషా ప్రియకు ఉరిశిక్ష ఆగేనా? | Indian Nurse Nimisha Priya Set to Be Executed in Yemen | Sakshi
Sakshi News home page

నిమిషా ప్రియకు ఉరిశిక్ష ఆగేనా?

Jul 10 2025 5:58 AM | Updated on Jul 10 2025 4:07 PM

Indian Nurse Nimisha Priya Set to Be Executed in Yemen

కేరళ నర్సును ఈ నెల 16న ఉరితీయాలని యెమెన్‌ అధికారుల నిర్ణయం  

క్షమాభిక్ష కోసం పోరాడుతున్న సామాజిక కార్యకర్తలు  

బాధిత కుటుంబాన్ని ఒప్పించేందుకు ప్రయత్నాలు

సనా: అరబ్‌ దేశం యెమెన్‌లో మాజీ వ్యాపార భాగస్వామిని హత్య చేసిన కేసులో ఉరిశిక్ష పడిన భారతీయ నర్సు నిమిషా ప్రియను కాపాడేందుకు ప్రయత్నాలు ఉపందుకున్నాయి. ఆమెకు ఈ నెల 16న ఉరిశిక్ష అమలు చేయాలని యెమెన్‌ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ ప్రాసిక్యూషన్‌ ఇప్పటికే జైలు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. 

మరోవైపు ‘సేవ్‌ నిమిషా ప్రియ కౌన్సిల్‌’పేరిట స్వచ్ఛంద, సామాజిక కార్యకర్తలు ఆమెను ఉరిశిక్ష నుంచి తప్పించడానికి ఉద్యమిస్తున్నారు. ప్రజల మద్దతు కూడగడుతున్నారు. హత్యకు గురైన మెహదీ కుటుంబం క్షమాభిక్ష ప్రసాదిస్తే శిక్ష నుంచి ఆమె బయటపడే అవకాశం ఉంది. బాధిత కుటుంబానికి బ్లడ్‌మనీ కింద చెల్లించడానికి నిమిషా ప్రియ బంధువులు, మిత్రులు, మద్దతుదారులు రూ.7,35,000 సేకరించారు. 

మెహదీ కుటుంబం స్పందన కోసం ఎదురు చూస్తున్నామని ‘సేవ్‌ నిమిషా ప్రియ కౌన్సిల్‌’సభ్యుడు, సామాజిక కార్యకర్త బాబు జాన్‌ చెప్పారు. ఆమెను ఎలాగైనా రక్షించాలన్నదే తశ ఆశయమని అన్నారు. ఇప్పటికైనా క్షమాభిక్ష ప్రసాదించాలని, ఒక మహిళ ప్రాణాలు కాపాడాలని మెహదీ కుటుంబాన్ని కోరారు. నిమిషా ప్రియకు మద్దతు ప్రకటిస్తూ సోషల్‌ మీడియాలో చాలామంది పోస్టులు చేస్తున్నారు. ఉరిశిక్ష నుంచి బయటపడి ఆమె క్షేమంగా ఉండాలని ఆకాంక్షిస్తున్నారు.  

నర్సుకు ఎందుకు ఉరిశిక్ష?  
కేరళ రాష్ట్రం పాలక్కాడ్‌ జిల్లాలోని కొల్లెంగోడ్‌కు చెందిన నిమిషా ప్రియ నర్సింగ్‌ విద్య అభ్యసించింది. మెరుగైన జీవితం కోసం 2008లో యెమెన్‌ చేరుకుంది. వేర్వేరు ఆసుపత్రుల్లో పని చేసింది. కొంత అనుభవం గడించిన తర్వాత సొంతంగా ఆసుపత్రి నిర్వహించాలన్న ఆలోచనతో 2014లో తలాల్‌ అబ్దో మెహదీ అనే యెమెన్‌ పౌరుడిని వ్యాపార భాగస్వామిగా చేర్చుకుంది. సొంత క్లినిక్‌ ఏర్పాటు చేసింది. 

యెమెన్‌ చట్టాల ప్రకారం.. విదేశీయులు వ్యాపారం చేయాలంటే స్థానికులు అందులో తప్పనిసరిగా భాగస్వామిగా ఉండాలి. కొంతకాలం తర్వాత నిమిషా ప్రియ, మెహదీ మధ్య గొడవలు మొదలయ్యాయి. ఆమె ఫిర్యాదు మేరకు 2016లో మెహదీని పోలీసులు అరెస్టు చేశారు. జైలు నుంచి విడుదలైన తర్వాత ఆమెను బెదిరింపులకు గురిచేశాడు. ఆమె పాస్‌పోర్టు లాక్కున్నాడు. చంపేస్తానని పలుమార్లు హెచ్చరించాడు. 2017లో మెహదీ నీళ్ల ట్యాంక్‌లో శవమై కనిపించాడు. అతడి శరీరం ముక్కలు ముక్కలుగా నరికేసి ఉంది.

 విషపు ఇంజెక్షన్లు ఇచ్చిన మెహదీని హత్య చేసినట్లు నిమిషా ప్రియాపై పోలీసులు అభియోగాలు మోపారు. అరెస్టు చేసి యెమెన్‌ రాజధాని సనా సిటీలోని సెంట్రల్‌ జైలుకు తరలించారు. 2018లో ట్రయల్‌ కోర్టు ఆమెను దోషిగా తేల్చింది. ఉరిశిక్ష ఖరారు చేసింది. సుప్రీం జ్యుడీషియల్‌ కౌన్సిల్‌ సైతం 2023 నవంబర్‌లో ట్రయల్‌ కోర్టు తీర్పును సమరి్థంచింది. హౌతీ తిరుగుబాలుదారులు ఆమెకు ఉరిశిక్ష అమలు చేసేందుకు ఈ ఏడాది జనవరిలో అనుమతి ఇచ్చారు. యెమెన్‌లో చట్టాలు చాలా కఠినంగా ఉంటాయి. తమ పౌరుడిని హత్య చేస్తే కోర్టులు మరణశిక్ష విధిస్తాయి.  

నిమిష ప్రియ కేసుపై నమోదైన పిటిషన్‌ను విచారించేందుకు సుప్రీం అంగీకారం

శిక్ష తప్పే మార్గం ఉందా?  
బాధిత కుటుంబ సభ్యులు బ్లడ్‌మనీ(నష్టపరిహారం కింద నగదు) స్వీకరించి, క్షమాభిక్ష ప్రసాదిస్తే నిమిషా ప్రియకు ఉరిశిక్ష తప్పుతుంది. బ్లడ్‌మనీ ఎంత అనేది బాధిత కుటుంబమే నిర్ణయాల్సి ఉంటుంది. నిమిషా ప్రియ తల్లి కేరళలో ఉంటున్నారు. పనిమనిషిగా జీవనం సాగిస్తున్నారు. తన బిడ్డ ప్రాణాలు కాపాడుకొనేందుకు ఆమె ఇప్పటికే తన ఇల్లు అమ్మేశారు. 

మెహదీ కుటుంబాన్ని ఒప్పించేందుకు నిమిషా ప్రియ మద్దతుదారులు ప్రయత్నిస్తున్నారు. ఆమెకు ఉరిశిక్ష తప్పించేలా భారత ప్రభుత్వం వెంటనే చొరవ తీసుకోవాలని కోరుతూ సీపీఎం ఎంపీ జాన్‌ బ్రిట్టాస్‌ బుధవారం విదేశాంగ మంత్రి ఎస్‌.జైశంకర్‌కు లేఖ రాశారు. సనా సిటీ ప్రస్తుతం హౌతీ తిరుగుబాటుదారుల ఆ«దీనంలో ఉంది. వీరికి ఇరాన్‌ అండగా నిలుస్తున్న సంగతి తెలిసిందే. ఇరాన్‌ను ఒప్పించి హౌతీ తిరుగుబాటుదారులపై ఒత్తిడి పెంచితే ఉరిశిక్ష ఆగిపోయే అవకాశం ఉందని విదేశాంగ నిపుణులు సూచిస్తున్నారు.   
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement