భారతీయ అమెరికన్ బిలియనీర్ సీఈఓ, సైబర్ సెక్యూరిటీ దిగ్గజం 'పాలో ఆల్టో నెట్‌వర్క్స్' (Palo Alto Networks) సీఈఓ నికేష్ అరోరా AI (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్)పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏఐ టెక్నాలజీ వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో, రాబోయే మూడేళ్లలో కార్పొరేట్ కంపెనీల్లోని కొన్ని కీలక విభాగాల్లో ఉద్యోగుల సంఖ్య సగానికి పడిపోయే అవకాశం ఉందన్నారు. ముఖ్యంగా మార్కెటింగ్, హెచ్‌ఆర్ (HR), ఫైనాన్స్ విభాగాలపై ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు.అదే సమయంలో ఏఐ పరిజ్ఞానం ఉన్న ఉద్యోగులకు డిమాండ్ పెరుగుతోందని అన్నారు.
సగానికిపైగా ఆ ఉద్యోగాలు మాయం
ఒక పాడ్‌కాస్ట్‌లో నికేష్ అరోరా మాట్లాడుతూ మార్కెటింగ్, ఫైనాన్స్, హెచ్‌ఆర్ వంటి జనరల్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ (G&A) విభాగాలలో ప్రాసెస్ మేనేజ్‌మెంట్ (నిర్వహణ ప్రక్రియలు) ఎక్కువగా ఉంటుందన్నారు. భవిష్యత్తులో రాబోయే అధునాతన ఏఐ అప్లికేషన్ల ద్వారా ఈ పనులను మరింత తెలివిగా, సులువుగా చేయవచ్చని పేర్కొన్నారు.
ప్రస్తుతం కంపెనీలు వాడుతున్న సాస్ (SaaS - సాఫ్ట్‌వేర్ యాజ్ ఎ సర్వీస్) అప్లికేషన్లకు సొంత అభిప్రాయాలు ఉండవు. కానీ రాబోయే ఏఐ అప్లికేషన్లు స్వతంత్రంగా (Autonomous) వ్యవహరిస్తాయి. ఉదాహరణకు, ఒక మార్కెటింగ్ కాపీని చూసి అది బాగోలేదని చెప్తూ, బ్రాండ్‌కు తగినట్లుగా ఎలా మార్చాలో ఏఐ స్వయంగా సూచించగలదు. దీనివల్ల సగటు ఉద్యోగి మరింత స్మార్ట్‌గా పనిచేయగలుగుతాడు. ఫలితంగా, ఎక్కువ మంది ఉద్యోగుల అవసరం ఉండదు. ప్రస్తుతం తమ కంపెనీ మార్కెటింగ్ విభాగంలో ఉన్న 600 మంది సిబ్బందిని ఏఐ సహాయంతో సగానికి తగ్గించే యోచనలో ఉన్నట్లు ఆయన తెలిపారు.
ఇదీ చదవండి: నాడు డెలివరీ బాయ్.. నేడు రెండు AI స్టార్టప్స్‌కు ఫౌండర్!
డిమాండ్ ఉండే ఉద్యోగాలు ఏవి?
ఏఐ యుగంలో కొన్ని ఉద్యోగాలు కోల్పోయినప్పటికీ, టెక్నికల్ , సేల్స్ లాంటి మరికొన్ని విభాగాలకు డిమాండ్ పెరుగుతుందని కూడా అరోరా చెప్పుకొచ్చారు. కంపెనీ ప్రొడక్ట్స్ చాలా బాగున్నప్పుడు, వాటిని ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మందికి చేరవేయడానికి సేల్స్, టెక్నికల్ సిబ్బంది అవసరం పెరుగుతుందన్నారు. అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను సమర్థవంతంగా ఉపయోగించగలిగే (AI Savvy) ఉద్యోగులకు మార్కెట్లో విపరీతమైన డిమాండ్ ఉంటుంది.
ఇదీ చదవండి: రూ. 10 లక్షలకు ముంచేశారు, రోజంతా స్టేషన్‌లోనే : నటి ఆవేదన
ఉద్యోగులకు హెచ్చరిక
ప్రస్తుతం కార్పొరేట్ సంస్థల్లోని 90శాతం మంది ఉద్యోగులకు AIపై సరైన అవగాహన/పరిజ్ఞానం లేకపోవడమే అతిపెద్ద సవాలని నికేష్ అరోరా అభిప్రాయపడ్డారు. ఇది డార్విన్ సిద్ధాంతం లాంటి సమయం. ఇక్కడ ఎవరు అత్యుత్తమంగా రాణిస్తారో వారే నిలబడతారు. కాబట్టి ఉద్యోగులు స్వయంగా ఏఐ సాంకేతికతను నేర్చుకుని అప్‌డేట్ అవ్వాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు.
ఇదీ చదవండి: రూ. 10 లక్షలకు ముంచేశారు, రోజంతా స్టేషన్‌లోనే : నటి ఆవేదన
ఒకప్పుడు గూగుల్ సంస్థలో అత్యధిక జీతం తీసుకునే ఉద్యోగిగా రికార్డు సృష్టించిన నికేష్ అరోరా, ఐఐటీ (BHU) వారణాసి పూర్వ విద్యార్థి. ప్రస్తుతం ఆయన నేతృత్వం వహిస్తున్న పాలో ఆల్టో నెట్‌వర్క్స్ మార్కెట్ విలువ దాదాపు 287 బిలియన్ డాలర్లుగా ఉంది. కాగా గత రెండేళ్లుగా ఏఐ పునర్నిర్మాణం కారణంగా మెటా (Meta), అమెజాన్ (Amazon), ఒరాకిల్ (Oracle), కాగ్నిజెంట్ లాంటి వంటి దిగ్గజ సంస్థలు వేలాది మంది ఉద్యోగులను తొలగించిన సంగతి తెలిసిందే.
ఇదీ చదవండి: అయోధ్యరాముడి విరాళాల గోల్‌మాల్ : స్పందించిన ఆర్‌ఎస్‌ఎస్


