12 ఏళ్ల కుర్రాడితో అభ్యంతరకర సంభాషణ! | Grok's inappropriate response to a 12-year-old | Sakshi
Sakshi News home page

అడగకూడనిది అడిగిందా ఛాట్‌బోట్‌!

Nov 7 2025 12:49 PM | Updated on Nov 7 2025 1:20 PM

Grok Tesla

మధ్య కాలంలో ఎటు చూసిన ఏఐ ఛాట్‌బోట్లే. స్మార్ట్‌ఫోన్‌లో, బ్యాంకింగ్‌, వాహనాలు... ఛాట్‌బోట్లు లేని రంగం అంటూ లేకుండా పోయింది. మంచిదే కదా? మన పనులు సులభం చేసేస్తాయి కదా? అనుకుంటున్నారా? ఇది సగం వాస్తవం. మిగిలిన సగం చాలా ఇబ్బందికరమైంది. ఎలాగంటారా? కెనడాలో గత నెల జరిగిన ఒక ఘటన చెబుతంది ఆ విషయాన్ని. 

ఫరా నాసర్‌ కెనెడాలో ఒక జర్నలిస్ట్‌. పన్నెండేళ్ల కుమారుడితో కలిసి టెస్లా కారులో ఎక్కడికో వెళుతోంది. పిల్లాడు కారులోని ఛాట్‌బోట్‌తో సరదాగా మాట్లాడుతున్నాడు. రకరకాల ఐస్‌క్రీమ్స్‌, డెజర్ట్స్‌లో చక్కెర ఎంతెంత ఉంటుందని కుర్రాడు అడగడం.. టెస్లా ఛాట్‌బోట్‌ గ్రోక్‌ దానికి సమాధానం ఇవ్వడం నాసర్‌ విన్నారు. సంభాషణంతా మామూలుగానే గడిచిపోయింది. మరుసటి రోజు కుర్రాడు ఇంకో ప్రశ్న వేశాడు. ఫుట్‌బాల్‌ గురించి గ్రోక్‌తో మాట్లాడుతూ.. ‘‘క్రిస్లియానో రొనాల్డో, లయొనిల్‌ మెస్సీల్లో ఎవరు గొప్ప’’ అని అడిగాడు. అదే సమయంలో ఆ కుర్రాడు గ్రోక్‌ వ్యక్తిత్వాన్ని కాస్త ‘గోర్క్‌’కు మార్చేశాడు. సోమరిపోతైన పురుషుడిలా సమాధానాలిస్తుందన్న మాట ఈ పర్సనాలిటీ మోడ్‌లో చర్చ ఇలా నడుస్తూండగానే సడన్‌గా గోర్క్‌ అడిగిన ప్రశ్నకు నాసర్‌ బిత్తరపోయింది. ఎందుకంటే.. పన్నెండేళ్ల కుర్రాడిని అడగకూడనిది అడిగిందా ఛాట్‌బోట్‌. ‘‘నగ్ర చిత్రాలు పంపు’’ అని!! ఇదే విషయాన్ని వివరిస్తూ నాసర్‌ తాజాగా ‘ఎక్స్‌’లో ఒక ట్వీట్‌ చేశారు. 

ఏమిటీ గోర్క్‌?
ఎలాన్‌ మస్క్‌కు చెందిన టెస్లా విద్యుత్తుతో నడిచే కార్ల తయారీలో పేరెన్నిక గన్న విషయం తెలిసిందే. ఎక్స్‌తోపాటు టెస్లా కార్లలోనూ గ్రోక్‌ పేరుతో ఒక ఏఐ ఆధారిత ఛాట్‌బోట్‌ను ఏర్పాటు చేశారు. ఫ్యాక్ట్‌చెక్‌లతోపాటు ఏదైనా అంశానికి సంబంధించిన అనుమానాలు అడిగి తెలుసుకునే అవకాశం ఉంటుంది దీంతో. అయితే కో-పైలట్‌, పర్‌ప్లెక్సిటీ, జెమిని, ఛాట్‌జీపీటీ వంటి అనేక ఏఐ ఆధారిత బోట్లతో పోలిస్తే ఇది కొంచెం భిన్నం. మనం ప్రశ్న అడిగిన తీరును బట్టి సమాధానం మారిపోతుంది. తెలివైన ప్రశ్న వేస్తే.. అంతే తెలివిగా, తుంటరి ప్రశ్న వేస్తే అంతకంటే తుంటరిగా జవాబిస్తుంది. వెటకారమాడితే.. తన కూడా అదే తీరులో సమాధానమిస్తుంది. 

అయితే.. నాసర్‌ కుమారుడు అడిగిన ప్రశ్నకు, గోర్క్‌ (గ్రోక్‌ తాలూకూ ఒక వ్యక్తిత్వం) సమాధానానికి అస్సలు పొంతన లేకపోవడం గమనార్హం. పైగా 12 ఏళ్ల కుర్రాడితో అలా మాట్లాడటం ఎంత మాత్రం సరికాదని నాసర్‌ అంటున్నారు. ఆ సమాధానం విని.. ‘‘నాకు ఏం మాట్లాడాలో అర్థం కాలేదు’’ అని తన ట్వీట్‌లో పేర్కొన్నారు. మాట్లాడే వ్యక్తి వయసుకు తగ్గట్టు ఏఐ తన సమాధానాలను మార్చుకునేలా ఏర్పాట్లు చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఈ వ్యవహారమంతా మరోసారి ఏఐ, నైతిక విలువలు, కార్పొరేట్‌ సంస్థల బాధ్యత అన్న అంశాలపై చర్చకు జీవం పోసింది. ఈ అంశంపై టెస్లా కూడా స్పందించింది. అక్టోబరు 17న ఈ ఘటన జరిగిందని, పిల్లల భద్రతకు కంపెనీ అత్యధిక ప్రాధాన్యమిస్తుందని స్పష్టం చేసింది. ఇలాంటి పరిణామాలు పునరావృతం కాకుండా ఏఐ ఛాట్‌బోట్లలో మార్పులు చేస్తున్నట్లు తెలిపింది. ఫరా నాసర్‌ ట్వీట్‌ ఇప్పుడు ఎక్స్‌ వేదికపై లేకపోవడం కొసమెరుపు!

 

సీబీసీలో తన అనుభవాన్ని వివరిస్తున్న ఫరా నాసర్‌ వీడియో.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement