భారత నావికుల భద్రతే ముఖ్యం | G7 Summit: Trump Meets Modi in France Amid Trade Deal and Security Discussions | Sakshi
Sakshi News home page

భారత నావికుల భద్రతే ముఖ్యం

Jun 18 2026 4:04 AM | Updated on Jun 18 2026 7:03 AM

G7 Summit: Trump Meets Modi in France Amid Trade Deal and Security Discussions

జీ7 శిఖరాగ్ర సమావేశంలో మోదీ, ట్రంప్‌ కరచాలనం

ఈ అంశాన్ని అమెరికా, ఇరాన్‌ శాంతి ఒప్పందంలో చేర్చాలి

అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు ప్రధాని మోదీ విజ్ఞప్తి  

ఫ్రాన్స్‌లో జీ7 శిఖరాగ్ర భేటీ సందర్భంగా సమావేశమైన ఇరువురు నేతలు  

హార్మూజ్‌ జలసంధిని తెరిచి ఉంచాలన్న ప్రధాని మోదీ  

పశ్చిమాసియా సంఘర్షణ ముగింపునకు  ట్రంప్‌ కృషి చేస్తున్నారని ప్రశంసలు  

వాణిజ్య చర్చల్లో మోదీ చాలా కఠినంగా ఉంటారన్న ట్రంప్‌... భారత్‌ ఒక పెద్ద పాత్రను పోషించబోతోందని స్పషీ్టకరణ  

వాణిజ్య ఒప్పందంపై చాలా సమీపంలోకి వచ్చేశామని ప్రకటన  

ఒమన్‌ తీరంలో ముగ్గురు భారతీయుల మృతి పట్ల ట్రంప్‌ సంతాపం  

ప్రపంచవ్యాప్తంగా సముద్ర వాణిజ్య మార్గాల్లో లక్షలాది మంది భారతీయ నావికులు పనిచేస్తున్నారు. అమెరికా, ఇరాన్‌ ఒప్పందంతో వారి భద్రతకు కచ్చితమైన హామీ 
లభిస్తుందని ఆశిస్తున్నా.       – మోదీ

నా దృష్టిలో మోదీ  చాలా కఠినమైన వ్యక్తి, ఒక కిల్లర్‌.  నా మిత్రుడు మోదీ ప్రధానిగా ఉండగా ఎవరైనా భారత్‌పై దాడి చేయడానికి సాహసిస్తే వెంటనే వారి అంతు చూస్తాం.      – ట్రంప్‌

ఎవియన్‌–లెస్‌–బెయిన్స్‌: హార్మూజ్‌ జలసంధి సహా అంతర్జాతీయ సముద్ర రవాణా మార్గాల్లో భారత నావికుల భద్రతకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టంచేశారు. బుధవారం ఫ్రాన్స్‌లో జీ7 శిఖరాగ్ర సమావేశం సందర్భంగా మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా నావికుల భద్రత అంశాన్ని మోదీ ప్రస్తావించారు. పశ్చిమాసియా సంక్షోభం వల్ల ఆ ప్రాంతంలో భారత నావికులకు ఎదురవుతున్న ఇబ్బందులను ట్రంప్‌ దృష్టికి తీసుకెళ్లారు.

వారికి భద్రత కల్పించే అంశాన్ని ఇరాన్‌తో ప్రతిపాదించిన శాంతి ఒప్పందంలో చేర్చాలని కోరారు. ఇటీవల ఒమన్‌ తీరంలో వాణిజ్య నౌకలపై అమెరికా సైన్యం వైమానిక దాడులకు పాల్పడడంతో ముగ్గురు భారతీయులు మరణించిన సంగతి తెలిసిందే. దీనిపై దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. అమెరికా దుశ్చర్యను ప్రజలు ముక్తకంఠంతో ఖండించారు.

అమెరికా దాడుల్లో ముగ్గురు భారతీయులు మృతి చెందితే మోదీ ప్రభుత్వం సరిగ్గా స్పందించలేదన్న ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే భారత నావికుల భద్రత గురించి ట్రంప్‌తో భేటీలో మోదీ ప్రధానంగా ప్రస్తావించినట్లు తెలుస్తోంది. వారిద్దరూ భారత్, అమెరికా సంబంధాలు, ద్వైపాక్షిక అంశాలపై చర్చించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.  

హార్మూజ్‌ జలసంధిని తెరవాల్సిందే  
పశ్చిమాసియా సంఘర్షణను ముగించడానికి డొనాల్డ్‌ ట్రంప్‌ చేస్తున్న కృషిని ప్రధాని మోదీ అభినందించారు. అమెరికా, ఇరాన్‌ మధ్య కుదిరే శాంతి ఒప్పందంలో భారత నావికుల భద్రతకు సంబంధించిన నిబంధనలు ఉంటాయని ఆశిస్తున్నట్లు చెప్పారు. హార్మూజ్‌ జలసంధిని తెరిచి ఉంచడం ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు అత్యంత కీలకమని స్పష్టంచేశారు. అక్కడ ఎల్లప్పుడూ స్వేచ్ఛాయుత నౌకాయానికి అనుకూల పరిస్థితులు ఉండాలని చెప్పారు.

ప్రపంచవ్యాప్తంగా సముద్ర వాణిజ్య మార్గాల్లో లక్షలాది మంది భారతీయ నావికులు పనిచేస్తున్నారని, వారి భద్రత తమ అత్యంత కీలకమని వివరించారు. అమెరికా, ఇరాన్‌ ఒప్పందంతో వారి భద్రతకు కచ్చితమైన హామీ లభిస్తుందని ఆశిస్తున్నట్లు మోదీ తెలిపారు. వాణిజ్యం, ఇంధనం, రక్షణ, సాంకేతికత, ప్రజల మధ్య సంబంధాల వంటి అంశాల్లో ద్వైపాక్షిక సహకారం విషయంలో సాధించిన పురోగతిని తాము సమీక్షించామని వెల్లడించారు.  

మోదీ చాలా కఠినమైన వ్యక్తి, కిల్లర్‌  
భారత ప్రధాని మోదీతో అద్భుతమైన సమావేశం జరిగిందని డొనాల్డ్‌ ట్రంప్‌ ఉద్ఘాటించారు. మోదీపై ప్రశంసల జల్లు కురిపించారు. సమీప భవిష్యత్తులో భారత్‌లో పర్యటిస్తానని చెప్పారు. ‘‘మోదీ చాలా మంచి మనిíÙ, సౌమ్యుడు, నెమ్మదస్తుడు అని అంటుంటారు. మోదీ అత్యంత అందమైన వ్యక్తి. చూడ్డానికి చాలా బాగుంటారు. అచ్చం దేవదూతలా కనిపిస్తారు. మోదీని చూసి అందరూ ఆశ్చర్యపోతుంటారు. కానీ, నిజానికి నా దృష్టిలో ఆయన చాలా కఠినమైన వ్యక్తి, ఒక కిల్లర్‌. వ్యాపారం, వాణిజ్య చర్చల్లో మోదీ చాలా కఠినంగా, నిక్కచ్చిగా వ్యవహరిస్తారు.

ఆయనకు భారతీయ ప్రజలంటే ఇష్టం, అలాగే అమెరికా అంటే కూడా ఇష్టమే’’అని ట్రంప్‌ వ్యాఖ్యానించారు. భారతదేశాన్ని ఒక ప్రధాన ప్రపంచ శక్తిగా అభివరి్ణంచారు. ‘‘మోదీ ప్రధానమంత్రిగా ఉన్నంత కాలం ప్రతి విషయంలోనూ భారత్‌ కీలక పాత్ర పోషిస్తుందని నేను భావిస్తున్నా. భారత్‌ ఒక పెద్ద పాత్రను పోషించబోతోంది. నేను వైట్‌హౌస్‌లో ఉన్నంత కాలం అమెరికాలో భారత్‌కు ఒక మంచి మిత్రుడు(ట్రంప్‌) ఉంటారు. ఒమన్‌ తీరంలో జరిగిన దాడుల్లో ముగ్గురు భారత నావికులు మరణించిన విషయం నాకు తెలిసింది. వారికి నా సంతాపం తెలియజేస్తున్నా.

అది చాలా కఠినమైన వృత్తి, అందులో ఎలాంటి సందేహం లేదు. భారత్‌తో మేము కలిసి పనిచేస్తాం. ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం విషయంలో మేము చాలా సమీపంలోకి వచ్చేశాం. ఉద్యోగాలు, ఉపాధి విషయంలోనూ రెండు దేశాలు చక్కగా సహకరించుకుంటున్నాయి’’అని ట్రంప్‌ వివరించారు. 2020లో భారత్‌లోని అహ్మదాబాద్‌లో తనకు లభించిన గౌరవాన్ని ఆయన గుర్తుచేసుకున్నారు. తనను చూసేందుకు భారీగా జనం తరలివచ్చారని, అది తనకు ‘గొప్ప సమయం’అని చెప్పారు.

వచ్చే నెల అమల్లోకి ట్రేడ్‌ డీల్‌ మోదీ, స్టార్మర్‌ ప్రకటన  
ఎవియన్‌–లెస్‌–బెయిన్స్‌:  భారత్, యునైటెడ్‌ కింగ్‌డమ్‌ (యూకే) మధ్య కుదిరిన సమగ్ర ఆర్థిక, వాణిజ్య ఒప్పందం జూలై 15వ తేదీ నుంచి అమల్లోకి వస్తుందని భారత ప్రధాని నరేంద్ర మోదీ, బ్రిటిష్‌ ప్రధానమంత్రి కీర్‌ స్టార్మర్‌ బుధవారం ప్రకటించారు. వారు ఫ్రాన్స్‌లో జీ7 భేటీ సందర్భంగా సమావేశమయ్యారు. రెండు దేశాల మధ్య సంబంధాలతోపాటు ఒప్పందం అమలుపై చర్చించారు. ఈ ట్రేడ్‌ డీల్‌ భారత్‌–యూకే సంబంధాల్లో ఒక చారిత్రాత్మక మైలురాయి అని మోదీ అభివరి్ణంచారు. ఇది వచ్చే నెల 15న అమల్లోకి రానుండటం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ఈమేరకు ‘ఎక్స్‌’లో పోస్టుచేశారు.  

ఫ్రెడరిక్‌ మెర్జ్‌తో భేటీ  
ప్రధాని మోదీ జర్మన్‌ చాన్స్‌లర్‌ ఫ్రెడరిక్‌ మెర్జ్‌తో సమావేశమయ్యారు. వాణిజ్యం, పెట్టుబడులు, రక్షణ రంగాల్లో ద్వైపాక్షిక సహకారాన్ని బలోపేతం చేయడంపై చర్చలు జరిపారు. పశ్చిమాసియాలోని పరిస్థితులు, రష్యా–ఉక్రెయిన్‌ సంఘర్షణపై కూడా ఇద్దరు నాయకులు అభిప్రాయాలను పంచుకున్నారు. భారత్, జర్మనీలు కేవలం వాణిజ్య రంగంలోనే కాకుండా, భవిష్యత్తుకు సంబంధించిన వివిధ అత్యాధునిక సాంకేతిక రంగాల్లో కూడా సన్నిహితంగా సహకరించుకుంటున్నాయని మోదీ వివరించారు.  

ఈ ఏడాది ఆఖరు నాటికి ఎఫ్‌టీఏపై సంతకాలు  
యూరోపియన్‌ యూనియన్‌ అగ్రనేత ఉర్సులా వాన్‌ డెర్‌ లేయెన్, ప్రధాని మోదీ కూడా సమావేశమయ్యారు. రక్షణ, సాంకేతిక రంగాల్లో సహకారాన్ని మరింత బలోపేతం చేసుకోవాలని ఇరువురు నాయకులు నిర్ణయించుకున్నారు. ఈ ఏడాది ఆఖరి నాటికి భారత్, యూరోపియన్‌ యూనియన్‌లు ప్రతిష్టాత్మక స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం(ఎఫ్‌టీఏ)పై సంతకం చేయనున్నాయని లేయెన్‌ తెలిపారు.  

ఎల్లప్పుడూ శాంతి పక్షాన భారత్‌  
ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీతో మోదీ భేటీ అయ్యారు. మానవతా విలువలకు భారత్‌ ప్రా ధాన్యం ఇస్తోందని మోదీ చెప్పారు. తాము శాంతి పక్షాన నిలుస్తామని స్పష్టం చేశారు. రెండు దేశాల మధ్య సహకారానికి సంబంధించిన అంశాలను తాము సమీక్షించామని పేర్కొన్నారు.  

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement