టెహ్రాన్‌లో దారుణ పరిస్థితులు.. భారత విద్యార్థుల తిరుగుముఖం | Every Minute Getting Worse Indian Students in Tehran | Sakshi
Sakshi News home page

టెహ్రాన్‌లో దారుణ పరిస్థితులు.. భారత విద్యార్థుల తిరుగుముఖం

Jun 17 2025 8:34 AM | Updated on Jun 17 2025 9:56 AM

Every Minute Getting Worse Indian Students in Tehran

టెహ్రాన్: పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతలు మరింతగా పెరుగుతున్న తరుణంలో టెహ్రాన్‌(ఇరాన్‌)లోని భారతీయ విద్యార్థులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని కాలం గడుపుతున్నారు. ఇజ్రాయెల్ సైనిక చర్య ప్రారంభించిన తొలి రోజున టెహ్రాన్ యూనివర్సిటీ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లో 140 మంది భారతీయ విద్యార్థులు ఉన్నారు. వారిని వర్శిటీ నుంచి సురక్షితంగా వెళ్లిపోవాలని అక్కడి సీనియర్‌ అధికారులు విజ్ఞప్తి చేశారు.

టెహ్రాన్ యూనివర్సిటీ ఆఫ్ మెడికల్ సైన్సెస్, ఇస్లామిక్ ఆజాద్ యూనివర్సిటీలో  ఎంబీబీఎస్‌ చదువుతున్న విద్యార్థులు  మీడియాతో మాట్లాడుతూ ఇక్కడ పరిస్థితులు క్షణక్షణానికి దిగజారుతున్నాయని అన్నారు. శుక్రవారం తెల్లవారుజామున 3:20 గంటల ప్రాంతంలో తమకు భారీ పేలుడు శబ్దం వినిపించిందని, తాము కిటికీల నుండి బయటకు చూడగా, నల్లటి పొగ ఆవరించి ఉందన్నారు. ఆ తరువాత మరిన్ని పేలుళ్ల శబ్ధాలు వినిపించాయని అన్నారు.

తాము ఫైటర్ జెట్ల శబ్దం కూడా విన్నామని, ఆకాశం డ్రోన్లతో నిండిపోయిందని, శుక్రవారం సాయంత్రం నుండి మరుసటి రోజు ఉదయం వరకు నిరంతరం శబ్దాలు వినిపించాయన్నారు. ఆ సమయంలో బ్లాక్అవుట్ కావడంతో డార్మిటరీ కింద కూర్చున్నామన్నారు. విశ్వవిద్యాలయ అధికారులు ఆ సమయంలో తమకు సహకారం అందించారన్నారు. పేలుళ్లు జరిగిన వెంటనే తమ వైస్-డీన్  వచ్చి, ఏమీ జరగదని  హామీ ఇచ్చారన్నారు.  అయితే ఇటువంటి పరిస్థితులను ఎదుర్కొనే ధైర్యం తమకు లేదన్నారు. భారత రాయబార కార్యాలయాన్ని సంప్రదించి, వీలైనంత త్వరగా టెహ్రాన్‌ను ఖాళీ చేయాలనుకుంటున్నట్లు వైద్య విద్యార్థులు చెప్పారు. గతంలో రష్యా-ఉక్రెయిన్ ఘర్షణ సమయంలో భారత విద్యార్థులను తీసుకురావడానికి ప్రభుత్వం చేసిన ప్రయత్నాలను వారు గుర్తు చేశారు.

ఇది కూడా చదవండి: టెహ్రాన్‌ను తక్షణం ఖాళీ చేయాలి: ట్రంప్‌ హెచ్చరిక

Advertisement
 
Advertisement
Advertisement