డబుల్‌ ట్రబుల్‌లో ట్రంప్‌! | Double Trouble for Trump: Party Revolt and Public Backlash | Sakshi
Sakshi News home page

డబుల్‌ ట్రబుల్‌లో ట్రంప్‌!

Jun 25 2026 6:53 AM | Updated on Jun 25 2026 10:56 AM

Double Trouble for Trump: Party Revolt and Public Backlash

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఇరాన్‌ యుద్ధ వ్యవహారంలో.. తన సొంత పార్టీ నుంచే తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు. యుద్ధం సాగుతున్న తీరు, దాని వ్యయం, వ్యూహాత్మక లక్ష్యాలపై పెరుగుతున్న అసంతృప్తి మధ్య బుధవారం రిపబ్లికన్‌ పార్టీ ఎంపీలతో జరిగిన క్లోజ్డ్‌-డోర్‌ సమావేశంలో ట్రంప్‌, రిపబ్లికన్‌ సెనేటర్‌ బిల్‌ క్యాసిడీ Bill Cassidy మధ్య తీవ్ర వాగ్వాదం జరిగినట్లు సమాచారం.

సమావేశంలో క్యాసిడీ.. ఇరాన్‌తో కుదిరిన తాజా ఫ్రేమ్‌వర్క్‌ ఒప్పందంపై ప్రశ్నలు లేవనెత్తారు. అమెరికా ప్రకటించిన లక్ష్యాలు నెరవేరకుండానే ఇరాన్‌కు ఆర్థిక ప్రయోజనాలు కల్పిస్తున్నారనే ఆందోళన వ్యక్తం చేశారు. ‘‘ప్రజలకు ఇప్పటివరకు చెప్పిన దానికంటే ఎక్కువ సమాచారం తెలుసుకునే హక్కు ఉంది’’ అని సమావేశం అనంతరం ఆయన వ్యాఖ్యానించారు. యుద్ధ వ్యూహం మొదట ప్రకటించిన ప్రణాళిక ప్రకారమే కొనసాగుతోందా? లేదా? అన్నది స్పష్టంగా లేదని కూడా అన్నారు.

ఒకవైపు.. ఈ ఘటన రిపబ్లికన్‌ పార్టీలో పెరుగుతున్న విభేదాలకు నిదర్శనంగా కనిపిస్తోంది. ముఖ్యంగా అమెరికన్‌ కాంగ్రెస్‌ నియంత్రణను నిర్ణయించే కీలక ఎన్నికలు(మధ్యంతర) సమీపిస్తున్న సమయంలో ఇరాన్‌ యుద్ధం ట్రంప్‌కు రాజకీయ భారం అవుతున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.

బిల్‌ క్యాసిడీ.. అమెరికాలోని లూసియానా రాష్ట్రానికి చెందిన రిపబ్లికన్‌ పార్టీ సెనేటర్‌. వృత్తిరీత్యా వైద్యుడు అయిన ఆయన.. 2015 నుంచి అమెరికా సెనెట్‌లో ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 2021లో ట్రంప్‌పై జరిగిన రెండో ఇంపీచ్‌మెంట్‌ విచారణలో ఆయన దోషిగా తేల్చాలని ఓటు వేసిన కొద్దిమంది రిపబ్లికన్‌ సెనేటర్లలో ఒకరు. మితవాద (Moderate) రిపబ్లికన్‌గా పేరున్న క్యాసిడీ, అవసరమైతే తన పార్టీ నాయకత్వాన్నీ బహిరంగంగా ప్రశ్నించే నేతగా గుర్తింపు పొందారు.

ఇదిలా ఉండగా.. అమెరికా ప్రజల్లోనూ యుద్ధంపై అసంతృప్తి పెరుగుతున్నట్లు తాజా సర్వేలు సూచిస్తున్నాయి. యుద్ధం వల్ల వచ్చిన ఖర్చుకు తగిన ఫలితం లభించిందని కేవలం నలుగురిలో ఒకరు మాత్రమే భావిస్తున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. ఇదే సమయంలో ట్రంప్‌ ప్రజాదరణ రేటింగ్‌ కూడా ఆయన మళ్లీ అధికారంలోకి వచ్చిన తర్వాత కనిష్ఠ స్థాయికి పడిపోయినట్లు తెలుస్తోంది.

ఇంకోవైపు అమెరికా సెనెట్‌ ఆమోదించిన ఒక తీర్మానం కూడా ట్రంప్‌పై ఒత్తిడిని పెంచింది. ఇరాన్‌ యుద్ధాన్ని ముగించాలని కోరుతూ తీసుకొచ్చిన ఆ తీర్మానానికి కొంతమంది రిపబ్లికన్‌ సభ్యులు కూడా మద్దతు ఇవ్వగా, వారిలో క్యాసిడీ కూడా ఒకరు. అయితే ఆ తీర్మానాన్ని ట్రంప్‌ “ప్రతీకాత్మక చర్య మాత్రమే” అంటూ కొట్టిపారేశారు. అలాంటి సందేశాలు ఇరాన్‌కు అమెరికా బలహీనంగా కనిపించేలా చేస్తాయని వ్యాఖ్యానించారు.

మరోవైపు, ఈ అంతర్గత రాజకీయ ఉద్రిక్తతల మధ్యే ట్రంప్‌ ప్రభుత్వం కాంగ్రెస్‌కు అదనంగా 70 బిలియన్‌ డాలర్ల యుద్ధ నిధుల కోసం విజ్ఞప్తి చేసింది. ఇప్పటికే ఉన్న 867 బిలియన్‌ డాలర్ల రక్షణ బడ్జెట్‌కు ఇది అదనంగా కావడం గమనార్హం. దీంతో యుద్ధ ఖర్చులు, వ్యూహాత్మక దిశ, రాజకీయ ప్రభావంపై అమెరికాలో చర్చ మరింత వేడెక్కుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement