
త్వరలోనే కుదుర్చుకుంటాం
ఇండియాతో కలిసి పని చేయబోతున్నాం
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటన
వాషింగ్టన్: భారత్‌తో త్వరలో భారీ వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోనున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం కోసం చాలారోజులుగా కొనసాగుతున్న చర్చల్లో గణనీయమైన పురోగతి సాధించామని ఆయన స్పష్టమైన సంకేతాలిచ్చారు. ట్రంప్ గురువారం శ్వేతసౌధంలో ఓ కార్యక్రమంలో మాట్లాడారు. త్వరలో గొప్ప ఒప్పందాలు పట్టాలెక్కబోతున్నాయని, వాటిలో ఒక ఒప్పందం బహుశా ఇండియాతోనే కావొచ్చని పేర్కొన్నారు.
అది భారీగానే ఉంటుందని ఉద్ఘాటించారు. వ్యాపారం, వాణిజ్యం విషయంలో ఇండియాతో కలిసి పని చేయబోతున్నామని వివరించారు. ప్రతి దేశంతోనూ తమకు చక్కటి సంబంధాలు ఉన్నాయని చెప్పారు. అమెరికాతో ట్రేడ్ డీల్ ప్రతి దేశం ఆసక్తి చూపుతోందని అన్నారు. ఇతర దేశాలతో ఒప్పందాలు కుదుర్చుకొనే పనిలో తమ ప్రభుత్వ యంత్రాంగం నిమగ్నమైందని తెలిపారు. అయితే, ప్రతి ఒక్కరితో ఒప్పందాలకు రావాలన్న ఉద్దేశం తమకు లేదన్నారు.
2030 నాటికి 500 బిలియన్ డాలర్లకు వాణిజ్యం
అమెరికాతో తదుపరి వాణిజ్య చర్చల కోసం భారత వాణిజ్య శాఖ ప్రత్యేక కార్యదర్శి రాజేశ్ అగర్వాల్ బృందం గురువారం వాషింగ్టన్‌కు చేరుకుంది. మధ్యంతర ట్రేడ్ డీల్‌ను వచ్చే నెల 9వ తేదీ కల్లా ఖరారు చేసుకొనేందుకు ఇరుదేశాలు ప్రయతి్నస్తున్నాయి. ఇండియా ఉత్పత్తులపై ఏప్రిల్ 2న విధించిన అధిక టారిఫ్‌లను జూలై 9 దాకా ట్రంప్ ప్రభుత్వం రద్దు చేసింది. గడువులోగా వాణిజ్య ఒప్పందంపై సంతకాలు జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
మరోవైపు వ్యవసాయం, పాడి పరిశ్రమకు సంబంధించిన ఉత్పత్తులపై సుంకాలను చాలావరకు మినహాయించాలని అమెరికా కోరుతుండడం భారత్‌కు ఇబ్బందికరంగా మారింది. ఎలక్ట్రిక్ వాహనాలు, మద్యం, పెట్రోకెమికల్ ఉత్పత్తులు, కొన్ని రకాల పండ్లు, జన్యుమారి్పడి పంటలపై సుంకాలు భారీగా తగ్గించాలని అమెరికా డిమాండ్ చేస్తోంది.
వ్రస్తాలు, వజ్రాలు, బంగారు అభరణాలు, తోలు ఉత్పత్తులు, ప్లాస్టిక్, రసాయనాలు, రొయ్యలు, నూనె గింజలు, ద్రాక్ష, ఆరటి పండ్లపై సుంకాల్లో కోత విధించాలని అమెరికాను భారత్ కోరుతోంది. వాణిజ్య ఒప్పందంలో ఇరుదేశాల డిమాండ్లకు ఏమేరకు ప్రాధాన్యం ఇస్తారన్నది ఆసక్తికరంగా మారింది. భారత్, అమెరికా మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం విలువ ప్రస్తుతం 191 బిలియన్ డాలర్లుగా ఉంది. 2030 నాటికి దీన్ని ఏకంగా 500 బిలియన్ డాలర్లకు చేర్చాలని ఇరుదేశాలు పట్టుదలతో ఉన్నాయి.
#WATCH | "...We just signed (trade deal) with China. We're not going to make deals with everybody... But we're having some great deals. We have one coming up, maybe with India, a very big one. We're going to open up India. In the China deal, we're starting to open up China.… pic.twitter.com/fJwmz1wK44
— ANI (@ANI) June 26, 2025
చైనాతో వాణిజ్య ఒప్పందం కుదుర్చుకున్నాం
అమెరికా, చైనా మధ్య కీలకమైన వాణిజ్య ఒప్పందం కుదిరింది. ఒప్పందంపై ఇరుదేశాలు సంతకాలు చేశాయి. ఈ విషయాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్వయంగా ప్రకటించారు. అయితే, ఈ ఒప్పందం వివరాలు బహిర్గతం చేయలేదు. రెండు రోజుల క్రితమే ఈ ఒప్పందంపై సంతకాలు జరిగాయని అమెరికా వాణిజ్య శాఖ మంత్రి హోవర్డ్ లుట్నిక్ తాజాగా స్పష్టంచేశారు. అమెరికాతో ఒప్పందం కుదిరిన మాట నిజమేనని చైనా వాణిజ్య శాఖ సైతం ధ్రువీకరించింది.
చైనాలోని అరుదైన ఖనిజాలను అమెరికా కంపెనీలు సులభంగా పొందడానికి వీలుగా ఒప్పందానికి రాబోతున్నట్లు రెండు వారాల క్రితం ట్రంప్ ప్రకటించిన సంగతి తెలిసిందే. కానీ, తాజా ఒప్పందంలో ఈ అంశాన్ని చేర్చారా? లేదా? అనేది బయటపెట్టలేదు. అమెరికా కాలేజీల్లో చదువుకుంటున్న చైనా విద్యార్థుల వీసాలను రద్దుచేసే ప్రక్రియను నిలిపివేస్తామని అమెరికా ఇప్పటికే హామీ ఇచ్చింది. ఈ నేపథ్యంలో రెండు దేశాల నడుమ వాణిజ్య ఒప్పందం కుదిరినట్లు తెలుస్తోంది.
