
వాషింగ్టన్: అమెరికా- భారత్ మధ్య వాణిజ్య సుంకాల యుద్ధం నడుస్తోంది. ఈ నేపధ్యంలో ట్రంప్ వ్యవహరిస్తున్న తీరుపై అమెరికా మాజీ జాతీయ భద్రతా సలహాదారు జాన్ బోల్టన్ మండిపడ్డారు. ట్రంప్ చర్యతో భారత్.. చైనా-రష్యా కూటమికి దగ్గరవుతుందని, ఇది అమెరికా అధ్యక్షుని వ్యూహాత్మక తప్పిదంగా పరిణమిస్తుందని జాన్ బోల్టన్ పేర్కొన్నారు.
రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నందుకు భారతదేశంపై అమెరికా అదనపు సుంకాలు విధించడాన్ని జాన్ బోల్టన్ తప్పుబట్టారు. అలాస్కాలోని యాంకరేజ్‌లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్- రష్యా కౌంటర్ వ్లాదిమిర్ పుతిన్‌ల సమావేశ సమయంలో జాన్ బోల్టన్ ఈ వ్యాఖ్యలు చేశారు. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నందుకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారతదేశంపై సుంకాలు విధించారని అయితే ఇదేవిధంగా రష్యా నుండి అత్యధిక మొత్తంలో చమురు కొనుగోలు చేస్తున్న చైనాపై అదనపు సుంకాలను విధించలేదన్నారు. ఈ చర్య భారతదేశాన్ని చైనా-రష్యా కూటమి వైపు ఆకర్షితమయ్యేలా చేయవచ్చని బోల్టన్ ‘ఎక్స్’లో పేర్కొన్నారు.
‘Unforced error’: John Bolton calls Trump’s anti-India pitch lack of strategic thinking https://t.co/CVDLrD07ll
— Financial Express (@FinancialXpress) August 15, 2025
సీఎన్‌ఎన్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో బోల్టన్ మాట్లాడుతూ, రష్యా నుండి చమురు, గ్యాస్ కొనుగోలు చేస్తున్న భారతదేశం లాంటి దేశాలపై వైట్ హౌస్ ద్వితీయ సుంకాలను విధించిందని అన్నారు. భారతదేశంపై 25 శాతం సుంకం విధించిందని. అయితే ఇది ఇంకా అమలు కాలేదన్నారు. దీనిపై భారత్ చాలా ఆగ్రహంతో ఉన్నదని, రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్న చైనాపై అలాంటి సుంకం విధించకుండా భారత్‌పైననే విధించడమేమిటని బోల్టన్ ప్రశ్నించారు. మాస్కో, బీజింగ్, ఢిల్లీ(మూడు దేశాల రాజధానులు) ఒక్కటైతే అమెరికాపై ప్రతికూల పరిణామాలు తలెత్తవచ్చని హెచ్చరించారు.
2018 తర్వాత పుతిన్ భారత్ పర్యటన, భారత ప్రధాని నరేంద్ర మోడీ చైనా పర్యటనలు అమెరికాపై ప్రతికూల పరిణామాలకు ఉదాహరణలు కావచ్చని బోల్టన్ అన్నారు. ట్రంప్ ఎటువంటి సంప్రదింపులు లేకుండా సుంకాల విషయంలో నిర్ణయం తీసుకున్నారని బోల్టన్ ఆరోపించారు. ఇటీవల ప్రధాని మోదీ రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో ఫోన్‌లో మాట్లాడారు. ఈ ఏడాది చివర్లో భారతదేశాన్ని సందర్శించాలని ఆహ్వానించారు. ఈ పర్యటన 23వ ఇండియా-రష్యా వార్షిక శిఖరాగ్ర సమావేశంలో భాగంగా జరుగనుంది. మరోవైపు ఈ నెల చివరిలో ప్రధాని మోదీ చైనాను సందర్శించే అవకాశం ఉంది. ఆగస్టు 31- సెప్టెంబర్ ఒకటి మధ్య టియాంజిన్‌లో జరగనున్న షాంఘై సహకార సంస్థ శిఖరాగ్ర సమావేశానికి ప్రధాని మోదీ హాజరుకానున్నారు.