
గత 24 గంటలుగా పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్(PoK) ప్రాంతాలను ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. కుండపోత వర్షాలు కారణంగా భారీ ప్రాణ నష్టం సంభవించినట్లు ఆ దేశ జాతీయ, ప్రాంతీయ విపత్తు నిర్వహణ అధికారులు వెల్లడించారు. వర్ష బీభత్సంతో 154 మంది మృతి చెందారని... పలువురు తీవ్రంగా గాయపడినట్లు అధికారులు తెలిపారు. ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్ ప్రాంతం వర్షాలకు తీవ్రంగా దెబ్బతిందని.. భారీ సంఖ్యలో మరణాలు సంభవించినట్లు అధికారులు పేర్కొన్నారు.
పీవోకేలోని గిల్గిత్-బాల్టిస్తాన్‌లో ఆకస్మిక వరదలు విధ్వంసం సృష్టించాయి. పలు భవనాలు ధ్వంసం కాగా.. ఎనిమిది మంది మరణించారు. ఘైజర్ జిల్లాలో ఇద్దరు గల్లంతైనట్లు అధికారులు తెలిపారు. బునేర్ జిల్లాలో 75 మంది, మాన్సెహ్రా జిల్లాలో 17 మంది, బాజౌర్, బాటాగ్రామ్ జిల్లాల్లో 18 మంది మృతి చెందినట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు, ఆకస్మిక వరదల ప్రభావంతో పలువురు చిన్నారులు సహా 125 మంది ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు తెలిపారు.
Breaking News: Fllods in North West Pakistan wreak havoc as death toll in KP nears 100 in a single day so far. Only Buner death toll has reached to 75, 56 dead bodies have been recovered so far says Dy Commissioner. pic.twitter.com/iCbrIMcvwV
— Fakhar Ur Rehman (@Fakharrehman01) August 15, 2025
కారకోరం, బాల్టిస్తాన్ జాతీయ రహదారులపై రాకపోకలు నిలిచిపోయాయి. రవాణా, సహాయక చర్యలు పూర్తిగా నిలిచిపోయాయి. నీలం లోయలో లింక్ రోడ్డు కొట్టుకుపోయింది. దీంతో వందలాది మంది పర్యాటకులు రట్టి గలి సరస్సు బేస్ క్యాంప్ వద్ద చిక్కుకుపోయారు. కుండల్ షాహిలోని ఒక ప్రధాన వంతెనతో పాటు ఇళ్ళు, నది తీరంలోని రెస్టారెంట్‌ను వరద తుడిచిపెట్టేసింది. ముజఫరాబాద్‌లోని సర్లి సచాలో కొండచరియలు విరిగిపడి ఒక ఇల్లు కుప్పకూలి ఆరుగురు కుటుంబ సభ్యులు చనిపోయినట్లు సమాచారం.