
శాంతికి చొరవ చూపాలని వినతి
రష్యా చమురుపైనా చర్చ
న్యూఢిల్లీ: ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ సోమ వారం భారత ప్రధాని నరేంద్ర మోదీతో ఫోన్‌లో మాట్లాడారు. ఉక్రెయిన్‌లోని నగరాలు, గ్రామాలపై జరుగుతున్న రష్యా సైన్యం దాడుల గురించి వివరించారు. కాల్పుల విరమణకు రష్యా సిద్ధంగా లేనట్లు కనిపిస్తోందని అన్నారు. ఉక్రెయిన్–రష్యా మధ్య శాంతికి చొరవ చూపాలని మోదీకి విజ్ఞప్తి చేశారు. ఈ ఏడాది సెప్టెంబర్‌లో ఐక్యరాజ్యసమితి సాధారణ సభ సమావేశం సందర్భంగా వ్యక్తిగతం భేటీ కావాలని జెలెన్‌స్కీ, మోదీ నిర్ణయించుకున్నారు.
నరేంద్ర మోదీతో సంభాషణ అనంతరం జెలెన్‌స్కీ ‘ఎక్స్’లో పోస్టు చేశారు. భారత్, ఉక్రెయిన్ మధ్య ద్వైపాకిక్ష సహకా రంతోపాటు దౌత్య సంబంధాల్లో పురోగతిపై చర్చించామని తెలిపారు. ఉక్రెయిన్–రష్యా మధ్య ఘర్షణకు తెరప డాలని, సాధ్యమైనంత త్వరగా శాంతి నెలకొనాలని ఆశిస్తున్నట్లు చెప్పారు. అందుకు భారత్ సహకారం అవసరమని పునరుద్ఘాటించారు. ఉక్రెయిన్‌కు అన్నివిధాలుగా అండగా నిలుస్తున్నందుకు ప్రధాని మోదీకి జెలెన్‌స్కీ కృతజ్ఞతలు తెలియజేశారు.
మరోవైపు రష్యా నుంచి చమురు కొనుగోలు చేయొ ద్దంటూ భారత్‌కు అమెరికా చేసిన హెచ్చరికల అంశం కూడా జెలెన్‌స్కీ, మోదీ మధ్య చర్చకు వచ్చింది. భారత్ చెల్లిస్తున్న డబ్బులతో రష్యా సైన్యం తమపై దాడులు చేస్తోందని జెలెన్‌స్కీ పేర్కొన్నారు. అందుకే రష్యా నుంచి చమురు కొనుగోళ్లు తగ్గించుకోవాలని విజ్ఞప్తి చేశారు. మోదీ సైతం ‘ఎక్స్’లో ప్రతిస్పందించారు. ఉక్రెయిన్– రష్యా మధ్య శాంతికి తమ సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని స్పష్టంచేశారు. ఉక్రెయిన్‌తో ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసుకుంటామన్నారు.