ట్రంప్‌, పుతిన్‌ మధ్య ముగిసిన భేటీ.. యుద్ధంపై ట్విస్ట్‌! | Trump And Putin Meeting End with No Results | Sakshi
Sakshi News home page

ట్రంప్‌, పుతిన్‌ మధ్య ముగిసిన భేటీ.. యుద్ధంపై ట్విస్ట్‌!

Aug 16 2025 7:12 AM | Updated on Aug 16 2025 8:11 AM

Trump And Putin Meeting End with No Results

అలాస్కా: అమెరికాలోని అలాస్కా వేదికగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌, రష్యా అధ్యక్షుడు పుతిన్‌ మధ్య జరిగిన కీలక భేటీ ముగిసింది. దాదాపు మూడు గంటల పాటు సాగిన ఈ భేటీ.. ఉక్రెయిన్‌ యుద్ధానికి సంబంధించి ఎలాంటి ఒప్పందం కుదరకుండానే ముగిసింది. వీరి భేటీపై ప్రపంచ దేశాలన్నీ ఉత్కంఠగా ఎదురుచూసినప్పటికీ అనుకున్న ఫలితం మాత్రం దక్కలేదు. అయితే, వీరి మధ్య మరో సమావేశం రష్యాలో జరగనుందని పుతిన్‌ చివరలో ట్విస్ట్‌ ఇచ్చారు. 

కీలక సమావేశం అనంతరం ఇద్దరు నేతలు భేటీకి సంబంధించిన వివరాలను వెల్లడించారు. ఈ సందర్భంగా ట్రంప్‌ మాట్లాడుతూ.. సమావేశంలో అనేక విషయాలు చర్చకు వచ్చాయి. కానీ, యుద్ధానికి సంబంధించిన తుది ఒప్పందం మాత్రం కుదరలేదన్నారు. ఈ చర్చల్లో ఎంతో పురోగతి ఉందన్నారు. అయితే కొన్ని సమస్యలను పరిష్కరించుకోవాల్సి ఉందని వెల్లడించారు. చాలా అంశాలను ఇద్దరం అంగీకరించాం. అయితే, కొన్ని ఇంకా మిగిలే ఉన్నాయన్నారు. అన్ని విషయాలను పరిష్కరించుకొని అధికారికంగా అగ్రిమెంట్‌పై సంతకం చేసే వరకు ఒప్పందం కుదరనట్టే అవుతుంది. త్వరలో తాను ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ, యురోపియన్‌ యూనియన్‌ నేతలతో మాట్లాడతానని ట్రంప్‌ తెలిపారు. తాను మళ్లీ పుతిన్‌ను కలుస్తానని చెప్పుకొచ్చారు.

ఇదే సమయంలో డీల్‌ పూర్తికావడంపై నిర్ణయం ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ చేతుల్లోనే ఉంది. ఒప్పందం చేసుకోవాలని జెలెన్‌స్కీకి సూచిస్తా. కానీ, వాళ్లు అందుకు నిరాకరించే అవకాశం ఉంది. రష్యా చాలా శక్తిమంతమైన దేశం. పుతిన్‌-జెలెన్‌స్కీల సమావేశం జరుగుతుందని ఆశిస్తున్నా. అందులో నేను కూడా చేరే అవకాశం ఉందన్నారు. పుతిన్‌తో ఏయే విషయాలు చర్చించారు..? ఇంకా మిగిలి ఉన్న అంశాలు ఏంటనే విషయంపై వివరించేందుకు ట్రంప్‌ నిరాకరించారు. 

అనంతరం, పుతిన్‌ మాట్లాడుతూ.. అధ్యక్షుడు ట్రంప్‌తో సమావేశం చాలా నిర్మాణాత్మకంగా జరిగింది. ఈ సందర్భంగా ట్రంప్‌నకు ధన్యవాదాలు తెలిపారు. ఉక్రెయిన్‌తో యుద్ధం ముగించేందుకు తాను నిజాయితీగా ఉన్నట్లు తెలిపారు. గతంలో ట్రంప్‌ అధికారంలో ఉండి ఉంటే ఉక్రెయిన్‌తో రష్యాకు యుద్ధం వచ్చి ఉండేది కాదని పుతిన్‌ మరో మారు పేర్కొన్నారు. ఈ సమావేశం వివాదానికి ముగింపు పలకడానికి ప్రారంభ స్థానంగా అభివర్ణించారు. ట్రంప్‌తో తనకున్న సంబంధం వ్యాపారం లాంటిదని పేర్కొన్నారు. ఇరుదేశాల మధ్య సంబంధాల విషయాలలో క్లిష్టకాలంలో అధ్యక్షుడు ట్రంప్‌తో మాస్కో మంత్రి సంబంధాలు ఏర్పరచుకుందని పుతిన్‌ వెల్లడించారు. కాగా, తదుపరి సమావేశం మాస్కోలో అని పుతిన్‌ పేర్కొన్నారు.

 పుతిన్‌కు ఘన స్వాగతం..
ఇదిలా ఉండగా.. అమెరికాలోని అలస్కా ఈ సమావేశానికి వేదికైంది. అమెరికా తరఫున అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌, విదేశాంగ శాఖ మంత్రి మైక్రో రూబియో, ప్రత్యేక రాయబారి స్టీవ్‌ విట్కాఫ్‌, రష్యా తరఫున విదేశాంగ శాఖ మంత్రి సర్గెయ్‌ లావ్రోవ్‌, విదేశాంగ విధాన సలహాదారు యురి యుషకోవ్‌ పాల్గొన్నారు. ఇరు దేశాల నుంచి ముగ్గురు చొప్పున పాల్గొన్నారు. తొలుత ట్రంప్‌, పుతిన్‌ మధ్యే చర్చలు జరుగుతాయని వార్తలు వచ్చినప్పటికీ ఇరుదేశాల ప్రతినిధుల బృందం ఈ భేటీలో పాల్గొంది. వీరి భేటీ ముగిసినట్లు వైట్‌హౌస్‌, క్రెమ్లిన్‌లు ప్రకటించాయి.

 

అంతకు ముందు తొలుత ఇద్దరు నేతలు అలాస్కాలోని యాంకరేజ్‌కు చేరుకున్నారు. అక్కడ పుతిన్‌కు ట్రంప్‌ స్వాగతం పలికారు. ఇరువురు నేతలు ట్రంప్‌కు చెందిన వాహనంలో సమావేశాని భవనానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా విమానాశ్రయంలో ఇరువురు నేతలను మీడియా పలు ప్రశ్నలు అడిగినప్పటికీ సమాధానం చెప్పకుండానే వెళ్లారు. ప్రపంచ దేశాలన్నీ ఈ భేటీని అత్యంత ఆసక్తిగా గమనించాయి. ఈ నేపథ్యంలో ఎలాంటి ప్రకటన వెలువడకపోవడంతో కథ మళ్లీ ముందుకే వచ్చింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement