
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్-రష్యా అధ్యక్షుడు పుతిన్‌ల మధ్య అలస్కాలో జరిగిన సమ్మిట్‌ను భారత్ స్వాగతించింది. ఇరు దేశాల అధ్యక్షుల మధ్య సుదీర్ఘంగా సాగిన సమావేశాన్ని భారత్ అభినందించింది.
రష్యా-ఉక్రెయిన్‌ల మధ్య జరుగుతున్న దీర్ఘ కాలిక యుద్ధానికి ఈ సమ్మిట్ ఉపయోగపడుతుందని భారత్ ఆశాభావం వ్యక్తం చేసింది. ఎక్కడైనా శాంతికి తొలి అడుగు పడాలంటే అది చర్చల ద్వారానే సాధ్యమవుతుందన్నారు భారత విదేశాంగ అధికార ప్రతినిధి రణ్‌ధీర్ జైశ్వాల్ ఆశాభావం వ్యక్తం చేశారు.
‘అమెరికా-రష్యా అధ్యక్షుల మధ్య జరిగిన సమావేశం పురోగతిని భారత్ అభినందిస్తుంది. చర్చలు, దౌత్యం ద్వారా మాత్రమే ముందుకు వెళ్లడం మంచి పరిణామం. ఉక్రెయిన్ దీర్ఘకాలంగా ఎదుర్కొంటున్న యుద్ధానికి సాధ్యమైనంత త్వరగా ముగింపు కోసం ప్రపంచం ఎదురుచూస్తోంది’ అని ఆయన పేర్కొన్నారు.
కాగా, అమెరికాలోని అలాస్కా వేదికగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్, రష్యా అధ్యక్షుడు పుతిన్ మధ్య జరిగిన కీలక భేటీ ముగిసింది. భారత కాలమాన ప్రకారం శుక్రవారం(ఆగస్టు 15వ తేదీ) అర్థరాత్రి గం. 12.30 ని.లు దాటాకా ఇరువురి అధ్యక్షుల మధ్య దాదాపు మూడు గంటల పాటు సాగిన ఈ భేటీ.. ఉక్రెయిన్ యుద్ధానికి సంబంధించి ఎలాంటి ఒప్పందం కుదరకుండానే ముగిసిపోయింది వీరి భేటీపై ప్రపంచ దేశాలన్నీ ఉత్కంఠగా ఎదురుచూసినప్పటికీ అనుకున్న ఫలితం మాత్రం దక్కలేదు. అయితే, వీరి మధ్య మరో సమావేశం రష్యాలో జరగనుందని పుతిన్ చివరలో ట్విస్ట్ ఇచ్చారు.
కీలక సమావేశం అనంతరం ఇద్దరు నేతలు భేటీకి సంబంధించిన వివరాలను వెల్లడించారు. ఈ సందర్భంగా ట్రంప్ మాట్లాడుతూ.. సమావేశంలో అనేక విషయాలు చర్చకు వచ్చాయి. కానీ, యుద్ధానికి సంబంధించిన తుది ఒప్పందం మాత్రం కుదరలేదన్నారు. ఈ చర్చల్లో ఎంతో పురోగతి ఉందన్నారు. అయితే కొన్ని సమస్యలను పరిష్కరించుకోవాల్సి ఉందని వెల్లడించారు. చాలా అంశాలను ఇద్దరం అంగీకరించాం. అయితే, కొన్ని ఇంకా మిగిలే ఉన్నాయన్నారు. అన్ని విషయాలను పరిష్కరించుకొని అధికారికంగా అగ్రిమెంట్‌పై సంతకం చేసే వరకు ఒప్పందం కుదరనట్టే అవుతుంది. త్వరలో తాను ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ, యురోపియన్ యూనియన్ నేతలతో మాట్లాడతానని ట్రంప్ తెలిపారు. తాను మళ్లీ పుతిన్‌ను కలుస్తానని చెప్పుకొచ్చారు.
మరొకవైపు ఒప్పందం చేసుకోవాలని జెలెన్‌స్కీకి సూచిస్తానని ట్రంప్ తెలిపారు. కానీ ఏం జరుగుతుందో తెలియదన్నారు. ‘రష్యా చాలా శక్తిమంతమైన దేశం. పుతిన్-జెలెన్‌స్కీల సమావేశం జరుగుతుందని ఆశిస్తున్నా. అందులో నేను కూడా చేరే అవకాశం ఉందన్నారు ట్రంప్.