
వాషింగ్టన్: భారత్ విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ద్వంద్వ వైఖరి అవలంబిస్తున్నారు. ఒకవైపు ప్రధాని మోదీ తనకు మిత్రుడు.. అమెరికా, భారత్ మధ్య వాణిజ్య అడ్డంకులను పరిష్కరించడానికి చర్చలు కొనసాగిస్తున్నట్టు తెలిపారు. మరోవైపు.. రష్యాపై ఆర్థిక ఒత్తిడి తీసుకువచ్చేందుకు భారత్‌పై 100 శాతం సుంకం విధించాలని ఈయూ దేశాలకు సూచించినట్లు తెలుస్తోంది.
కాగా, రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం ముగింపునకు డొనాల్డ్ ట్రంప్ అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగానే రష్యా నుంచి వాణిజ్యం చేస్తున్న పలు దేశాలను ట్రంప్ చేశారు. భారత్, చైనాలపై సుంకాల భారాన్ని పెంచి రష్యాపై ఒత్తిడి తీసుకురావాలని యోచిస్తున్నారు. రష్యాపై ఆంక్షలు విధించే అంశంపై సీనియర్ అమెరికన్, ఈయూ అధికారులు వాషింగ్టన్‌లో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఈయూ అధికారులతో ట్రంప్ కాన్ఫరెన్స్ కాల్‌లో మాట్లాడారు. రష్యాపై ఆర్థిక ఒత్తిడి తీసుకువచ్చేందుకు భారత్, చైనాలపై 100 శాతం సుంకం విధించాలని సూచించినట్లు తెలుస్తోంది. చమురు కొనుగోలు చేయడం ఆపేస్తామనే వరకు ఈ టారిఫ్‌లను కొనసాగించాలన్నారు. ‘మేము ఇలా చేసేందుకు సిద్ధంగా ఉన్నాం. కానీ, యూరోపియన్ భాగస్వాములతో కలిసి ముందుకువస్తేనే దీన్ని అమలుచేద్దాం’ అని యూఎస్ అధికారి ఒకరు తెలిపారు. అమెరికా సూచనలు అమలుచేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా ఈయూ అధికారులు పేర్కొన్నట్లు సమాచారం.
ఇదిలా ఉండగా.. ఉక్రెయిన్‌లో త్వరగా శాంతి నెలకొల్పాలని ఈయూ కూడా భావిస్తుంది. ఈ క్రమంలో రష్యాపై ఒత్తిడి తెస్తేనే అది సాధ్యమవుతుందని ట్రంప్ పేర్కొన్నారు. దీంతో యూరోపియన్ నేతలు కూడా ఆ దిశగా ఆలోచన మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. అయితే భారత్, చైనా వంటి దేశాలపై ద్వితీయ ఆంక్షలు విధిస్తే నెలకొనే పరిణామాలపై వారు చర్చలు జరుపుతున్నారు.
మరోవైపు.. అమెరికా, భారత్ మధ్య వాణిజ్య అడ్డంకులను పరిష్కరించడానికి తన పరిపాలన విభాగం ఇండియాతో చర్చలు కొనసాగిస్తోందని ట్రంప్ పేర్కొన్నారు. ఈ అంశంపై తన మిత్రుడైన భారత ప్రధాని మోదీతో వచ్చే కొన్ని వారాల్లోనే మాట్లాడేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు తెలిపారు. ఈ చర్చలు రెండు గొప్పదేశాలకు మంచి ఫలితాలు ఇస్తాయని ఆశిస్తున్నట్లు వెల్లడించారు.