పాల్ఘార్: స్కూలుకు ఆలస్యంగా వచ్చిందనే కారణంతో టీచర్లు ఆరో తరగతి బాలికతో వంద గుంజిళ్లు తీయించారు. తీవ్ర అనారోగ్యానికి గురైన బాలిక వారం తర్వాత చనిపోయింది. మహారాష్ట్రలోని పాల్ఘార్ జిల్లాలో చోటుచేసుకున్న ఈ దారుణంపై అధికారులు దర్యాప్తు చేపట్టారు. వసాయ్ ప్రాంతంలోని సతివలికి చెందిన అన్షిక గౌడ్, మరో నలుగురు ఈ నెల 8న స్కూలుకు ఆలస్యంగా వెళ్లారు.
ఇందుకు శిక్షగా స్కూల్ టీచర్, బ్యాగు సహా తలా 100 గుంజీలు తీయించింది. తీవ్ర అనారోగ్యానికి గురైన అన్షిక ముంబైలోని ఓ ఆస్పత్రిలో శుక్రవారం రాత్రి తుదిశ్వాస విడిచింది. టీచర్ విధించిన అమానవీయ శక్షే తన బిడ్డ ప్రాణాలు తీసిందని ఆమె తల్లి ఆరోపించింది. తీవ్రమైన మెడ, వీపు నొప్పితో ఆమె అల్లాడిందని ఆవేదన చెందింది. ఘటనపై తమకెలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు. టీచర్ విధించిన శిక్ష బాలిక ప్రాణాలు తీసిందా అనే కోణంలో దర్యాప్తు చేపట్టామని, బాధ్యులని తేలితే చర్యలు తీప్పవని బీడీవో పాండురంగ్ తెలిపారు.


