బిహార్ ప్రజలు బుద్ధి చెప్పారు
కుల రాజకీయాలను తిప్పికొట్టారు
దేశానికి ఇది శుభసూచకం
ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడి
సూరత్: ముస్లింలీగ్–మావోయిస్టు కాంగ్రెస్ గా మారిన కాంగ్రెస్ పార్టీని బిహార్ ప్రజలు పూర్తిగా తిరస్కరించారని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టంచేశారు. ఆ పార్టీకి గట్టిగా బుద్ధి చెప్పారని అన్నా రు. కులవాదం అనే విషాన్ని చిమ్మిన ప్రతిపక్షా నికి కర్రుకాల్చి వాత పెట్టారని వ్యాఖ్యానించారు. గుజరాత్‌లోని సూరత్‌లో శనివారం బిహారీలు నిర్వహించిన కార్యక్రమంలో మోదీ పాల్గొన్నారు. బిహార్ ఎన్నికల్లో అసెంబ్లీ ఎన్డీయే విజయం సాధించినందుకు బిహారీలు మోదీని ఘనంగా సత్కరించారు.
కాంగ్రెస్ యువరాజు (రాహుల్ గాంధీ) చర్యలను చూసి ఆ పార్టీలోని సీనియర్ నాయకులు బాధపడుతున్నారని చెప్పారు. కాంగ్రెస్‌కు దశాబ్దకాలంగా ఎన్నికల్లో వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయని, ఇకనైనా ఆత్మపరిశీలన చేసుకోవాలని ఆ పార్టీ నాయకత్వానికి సూచించారు. కాంగ్రెస్‌ను కాపాడుకోవడం ఇక కష్టమేనని పార్టీ నాయకులే అంటున్నారని గుర్తుచేశారు. దాదాపు 60 ఏళ్లు దేశాన్ని పాలించిన పార్టీకి ఈ దుస్థితి ఎందుకు వచ్చిందో ఆలోచించాలని చెప్పారు.
అక్రమాలను అడ్డుకోవడానికే వక్ఫ్ చట్టం
బిహార్‌లో ఎన్డీయే ఘన విజయానికి ఎం.వై.(మహిళలు, యువత) అంశమే కారణమని ప్రధానమంత్రి పునరుద్ఘాటించారు. నేరాలు చేసి, జైలుకు వెళ్లి బయటకు వచ్చిన కొందరు నేతలు కుల రాజకీయాలతో ఎన్నికల్లో నెగ్గాలని ఆరాటపడ్డారని విమర్శించారు. వారి ఆటలు సాగలేదని, జనం వారి కుట్రలను తిప్పికొట్టారని ప్రశంసించారు. దేశానికి ఇదొక శుభసూచకమని పేర్కొన్నారు. బిహార్‌లో అన్ని వర్గాల ప్రజలూ ఎన్డీయేకు అండగా నిలిచారని తెలిపారు. అధికార, విపక్ష కూటముల మధ్య 10 శాతం ఓట్ల తేడా ఉందన్నారు. బిహార్‌లో 38 నియెజకవర్గాల్లో దళితుల ప్రాబల్యం అధికంగా ఉండగా, అందులో 34 స్థానాలు ఎన్డీయే గెల్చుకుందని వివరించారు.
దళితులు విపక్షాన్ని తిరస్కరించారని చెప్పారు. బిహార్‌లో భూములను, ఇళ్లను చట్టవిరుద్ధంగా ఆక్రమించి అవి వక్ఫ్ ఆస్తులు అంటున్నారని ప్రధానమంత్రి ఆగ్రహం వ్యక్తంచేశారు. తమిళనాడులో వేలాది సంవత్సరాల చరిత్ర కలిగిన గ్రామాలు వక్ఫ్ ఆస్తులు ఎలా అవుతాయో చెప్పాలని ప్రశ్నించారు. ఇలాంటి అక్రమాలకు అడ్డుకట్ట వేయడానికే వక్ఫ్ చట్టం తీసుకొచ్చామని వివరించారు. అధికారంలోకి వస్తే వక్ఫ్ చట్టాన్ని అమలు కానివ్వబోమని ప్రతిపక్షాలు ప్రకటించాయని, అయినా బిహార్ ఓటర్లు పట్టించుకోలేదని అన్నారు. బిహార్‌లో ఓటమికి కారణాలు చెప్పలేకపోతున్న కాంగ్రెస్ పార్టీ ఈవీఎంలపై, ఎన్నికల సంఘంపై నిందలు వేస్తోందని ధ్వజమెత్తారు. ఇలాంటి నిందలతో ఎక్కువ రోజులు కార్యకర్తలను మభ్యపెట్టలేరని హితవు పలికారు.


