భారత్‌కు ‘ఎలాన్‌ మస్క్’‌ మద్దతు.. నవారో అనుచిత వ్యాఖ్యలకు కౌంటర్‌ | X Fact Check Counter To Trump Adviser Peter Navarro Over His Post Targeting India, Check Post Inside | Sakshi
Sakshi News home page

భారత్‌కు ‘ఎలాన్‌ మస్క్’‌ మద్దతు.. నవారో అనుచిత వ్యాఖ్యలకు కౌంటర్‌

Sep 7 2025 11:25 AM | Updated on Sep 7 2025 12:09 PM

X Fact Check Counter To Trump Adviser Peter Navarro

వాష్టింగన్‌: ఇటీవలి కాలంలో భారత్‌ను టార్గెట్‌ చేసి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌, ఆయన మద్దతుదారులు, యూఎస్‌కు చెందిన పలువురు నేతలు సంచలన ఆరోపణలు చేస్తున్నారు. రష్యా చమురు కొనుగోలు విషయంలో అడ్డగోలుగా మాట్లాడుతున్నారు. ఇలాంటి మాట్లాడుతున్న వారి లిస్టులో ట్రంప్ వాణిజ్య సలహాదారు పీటర్‌ నవారో మొదటి స్థానంలో ఉన్నారు. భారత్‌పై నవాలో పదే పదే నోరుపారేసుకుంటున్నారు. అయితే.. తాజాగా ఆయనకు బిగ్‌ షాక్‌ తగిలింది. నవారో ఆరోపణలు అబద్ధమని ‘ఎక్స్‌’ తన ఫ్యాక్ట్‌ చెక్‌ చేసి తిప్పికొట్టింది. దీంతో, నవారోకు గట్టి ఎదురుదెబ్బ తగిలినట్టు అ‍య్యింది.

ర‍ష్యా నుంచి భారత్‌ చమురు కొనుగోలు చేస్తున్న నేపథ్యంలో ట్రంప్ వాణిజ్య సలహాదారు పీటర్‌ నవారో ఓవరాక్షన్ కామెంట్స్‌ చేశారు. కొద్దిరోజుల క్రితమ నవారో ట్విట్టర్‌(ఎక్స్‌) వేదికగా..‘భారత్‌ అత్యధిక సుంకాలు విధించడం వల్ల అమెరికా ఉద్యోగాలు దెబ్బతింటున్నాయి. లాభం కోసమే రష్యా నుంచి భారత్‌ చమురు కొనుగోలు చేస్తోంది. ఉక్రెయిన్‌తో మాస్కో చేస్తున్న యుద్ధాన్ని పోషిస్తోంది. యుద్ధంలో ఇరుదేశాల ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు’ అని పోస్టు పెట్టారు. అంతటితో ఆగకుండా.. ‘రష్యాకు భారత్‌ లాండ్రోమ్యాట్‌లా పనిచేస్తోంది. మీకు తెలుసా.. ఓ వర్గం లబ్ధి పొందేందుకు భారత ప్రజలను పణంగా పెడుతోంది. మనం దానిని అడ్డుకోవాలి. అది ఉక్రెయిన్‌ వాసులను చంపుతోంది. మనం (అమెరికన్లు) చెల్లింపుదారులుగా ఏం చేయాలో అది చేయాలి’ అంటూ ఇష్టానుసారం ఆరోపణలు గుప్పించారు.

ఈ నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలపై ‘ఎక్స్‌’ ఫ్యాక్ట్‌ చెక్‌ చేసి.. ఆ వ్యాఖ్యలను కొట్టిపారేసింది. రష్యా నుంచి భారత్‌ చమురు కొనుగోలు చేస్తోంది ఇంధన భద్రత కోసమేనని పేర్కొంది. ఆ దేశం ఎలాంటి ఆంక్షలను ఉల్లంఘించడంలేదని స్పష్టం చేసింది. అమెరికా కూడా రష్యా నుంచి వస్తువులు దిగుమతి చేసుకుంటున్న విషయాన్నీ ప్రస్తావించింది. నవారో వ్యాఖ్యలు పూర్తిగా అబద్దమని తేల్చింది. అనంతరం, ఈ ఫ్యాక్ట్‌ చెక్‌పై నవారో భగ్గుమన్నారు. ఎక్స్‌ అధినేత ఎలాన్‌ మస్క్‌పై కూడా ఆయన విరుచుకుపడ్డారు. ‘ఎక్స్’ నిర్వహించిన ఫ్యాక్ట్‌ చెక్‌ ఒక చెత్తగా అభివర్ణించారు. భారత్‌ లాభపేక్ష కోసమే రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తుందంటూ తన ఆరోపణలను సమర్థించుకున్నారు. ఉక్రెయిన్‌ భూభాగాన్ని మాస్కో ఆక్రమించక ముందు.. ఈ కొనుగోళ్లు జరగలేదన్నారు.

ఈ సందర్భంగా ఉక్రెయిన్‌ ప్రజలను చంపడం, అమెరికన్ల ఉద్యోగాలు తీసుకోవడం ఆపాలంటూ పిచ్చి ప్రేలాపణలు చేశారు. దీనిపై కూడా ‘ఎక్స్‌’ ఫ్యాక్ట్‌ చెక్ చేసింది. రష్యా నుంచి చమురు కొనుగోలు చేయడం భారత్‌ సొంత నిర్ణయమని, అది ఎలాంటి చట్టాలను ఉల్లంఘించలేదని పేర్కొంది. చమురు కొనుగోలు చేయొద్దంటూ భారత్‌పై ఒత్తిడి తెస్తూనే.. అమెరికా రష్యా నుంచి యురేనియం వంటి వాటిని దిగుమతి చేసుకుంటోందని తెలిపింది. యూఎస్ ద్వంద్వ ప్రమాణాలకు ఇది అద్దంపడుతోందని మండిపడింది. ఇక, భారత ఉత్పత్తుల దిగుమతులపై అమెరికా 50 శాతం సుంకాలు విధించిన సంగతి తెలిసిందే. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement