అంతర్జాతీయ ప్రతిభ అమెరికాకు అత్యావశ్యకం
అయితే ఉద్యోగాలన్నీహెచ్–1బీలతో నింపకూడదు
విదేశీయుల ప్రతిభను అమెరికన్లు అందిపుచ్చుకోవాలి
హెచ్–1బీపై తొలిసారిగా కాస్తంత సానుకూల ధోరణిలో మాట్లాడిన ట్రంప్
న్యూయార్క్: విదేశీయులన్నా, హెచ్–1బీ వీసాలపై అమెరికాలో ఉద్యోగాలు చేసేవాళ్లన్నా అంతెత్తున లేచి గోలచేసే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తొలిసారిగా హెచ్–1బీ వీసాదారుల ప్రాధాన్యతను గుర్తించారు. అమెరికా ఆర్థికాభివృద్ధికి చోదకశక్తి అయిన పరిశ్రమలు, సాంకేతిక రంగంలో విదేశీ ప్రతిభావంతుల కీలకపాత్రను ఆయన తొలిసారిగా కొనియాడారు.
విదేశీయుల ప్రతిభ ఖచ్చితంగా అమెరికాకు అవసరమని, హెచ్–1బీ వీసా ఉన్న విదేశీ వృత్తినిపుణులు అమెరికాకు అత్యావశ్యకమని ఆయన కుండబద్దలు కొట్టారు. అయితే అమెరికాలోని నైపుణ్యసంబంధ ఉద్యోగాలన్నీ హెచ్–1బీ వీసాదారులకే కేటాయించకుండా స్థానిక అమెరికన్లకు తగు ప్రాధాన్యతనివ్వాలని ఆయన వెనువెంటనే తనదైన శైలిలో మాట్లాడారు. బుధవారం ఫాక్స్‌న్యూస్ వార్తసంస్థ వ్యాఖ్యాత లారా ఇన్‌గ్రహామ్‌తో ప్రత్యేక ఇంటర్వ్యూలో డొనాల్డ్ ట్రంప్ పలు అంశాలపై సుదీర్ఘంగా మాట్లాడారు.
లక్షలాది మంది విదేశీ కార్మీకులు వద్దు
‘‘ కేవలం స్థానిక అమెరికన్ కార్మీకులతో పని ముందుకు సాగదని నాకూ ఇప్పుడిప్పుడే బోధపడుతోంది. అమెరికాలోకి విదేశీ ప్రతిభ రావాల్సిందే. అలాఅని ఉద్యోగాలన్నీ లక్షలాది మంది విదేశీ కార్మికులతో నింపేస్తామంటే కుదరదు. స్థానికుల్లోనూ ఎంతో మంది ప్రతిభావంతులు ఉన్నారు. అయితే విదేశీయులకే ప్రత్యేకమైన అదనపు వృత్తి నైపుణ్యాలుంటే వాటిని స్థానిక అమెరికన్లు నేర్చుకోవాల్సిందే. స్థానికులకు నైపుణ్యం తప్పనిసరి.
సెపె్టంబర్‌లో జార్జియా రాష్ట్రంలో దక్షిణకొరియాకు సంబంధించిన హ్యాందాయ్ ఫ్యాక్టరీల్లో అక్రమంగా అమెరికాకు వచ్చిన వలసదారులు కార్మీకులుగా పనిచేస్తున్నారు. వాళ్లను గుర్తించి అమెరికా ఇమిగ్రేషన్, కస్టమ్స్ అధికారులు బహిష్కరించి స్వదేశానికి పంపేశారు.
అయితే ఇక్కడ పెద్ద సమస్య వచ్చిపడింది. మేం పంపేసిన కార్మికులు బ్యాటరీలను తయారుచేయడంలో సిద్ధహస్తులు. బ్యాటరీల తయారీ అనేది అత్యంత సంక్లిష్టమైన, సమస్యాత్మకమైన ప్రక్రియ. అది అంత తేలికైన పని కానేకాదు. ఏమైనా తేడాలొస్తే పేలుళ్లు జరుగుతాయి. సమస్యలు మరింత పెద్దవవుతాయి. మేం బహిష్కరించిన బ్యాటరీ తయారీ కార్మికులు ఒక ఐదారు వందల మంది ఉంటారేమో. అలాంటి వాళ్ల నుంచి స్థానిక అమెరికన్లు వృత్తి మెళకువలను నేర్చుకోవాల్సిందే. ప్రతి రంగంలోనూ విదేశీ ప్రతిభావంతుల నుంచి స్థానిక అమెరికన్లు నైపుణ్యాలను నేర్చుకోవాలి’’ అని ట్రంప్ వ్యాఖ్యానించారు.
నిరుద్యోగులతో క్షిపణులు అసాధ్యం
నిరుద్యోగులుగా ఖాళీగా ఉన్న వాళ్లను హఠాత్తుగా ఉద్యోగాల్లోకి తీసుకుంటే సానుకూల ఫలితాల కంటే తీవ్ర ప్రతికూల ఫలితాలే వస్తాయి. ఉదాహరణకు అమెరికాపై ఆసక్తితో ఏదైనా విదేశీ కంపెనీ 10 బిలియన్ డాలర్ల పెట్టుబడితో ఒక రక్షణరంగ కర్మాగారం స్థాపించేందుకు ఆసక్తి కనబరచిందనుకుందాం. అలాంటప్పుడు వెంటనే మేం ఖాళీగా ఉన్న నిరుద్యోగ అమెరికన్లను ఆ కొత్త ఫ్యాక్టరీలో కొలువుల్లో కూర్చోబెట్టలేం. ఐదేళ్లుగా ఎలాంటి ఉద్యోగం చేయని వ్యక్తులను కార్మీకులుగా మార్చేసి ఏకంగా క్షిపణులను తయారుచేయించలేం’’అని ట్రంప్ వ్యాఖ్యానించారు. కొత్త హెచ్–1బీ వీసా ఫీజును అనూహ్యంగా ఒకేసారి 1,00,000 డాలర్లకు పెంచేసి అమెరికాకు విదేశీ వృత్తినిపుణులు రాకుండా పరోక్షంగా కట్టడి చర్యలను ఆరంభించిన ట్రంప్ రెండు నెలలు తిరక్కుండానే హెచ్1బీ అనుకూల వ్యాఖ్యలు చేయడం గమనార్హం.


