
నేడే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యా అధినేత పుతిన్ భేటీ
ఉక్రెయిన్–రష్యా యుద్ధానికి ముగింపు పలికి, శాంతి దూతగా పేరు సంపాదించాలన్నదే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పంతం. యుద్ధంలో ఆక్రమించిన ఉక్రెయిన్ భూభాగాలను తమదేశంలో సంపూర్ణంగా విలీనం చేసుకొని, చట్టబద్ధత కల్పించుకోవాలన్నదే రష్యా అధినేత పుతిన్ ఆశయం. రెండు భిన్నమైన లక్ష్యాల సాధన కోసం ట్రంప్, పుతిన్ శుక్రవారం అలస్కాలో సమావేశం కాబోతున్నారు.
ఇరువురు నేతల భేటీకి ఏర్పాట్లు పూర్తయ్యాయి. ప్రధానంగా ఉక్రెయిన్–రష్యా యుద్ధాన్ని ముగించడంపైనే చర్చలు జరుగుతాయని పైకి చెబుతున్నా.. తెరవెనుక ఇతర అంశాలూ ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు తమ అధీనంలో ఉన్న ఉక్రెయిన్ భూభాగాల విషయంలో పుతిన్ పట్టుదలతో వ్యవహరిస్తున్నారు. అలస్కా భేటీతో ఇరువురు నేతలు ఆశిస్తున్నదేమిటో చూద్దాం..
అందుకే అలస్కా వేదిక
ఉక్రెయిన్‌పై దండయాత్ర కొనసాగిస్తున్న పుతిన్‌ను ప్రపంచంలో ఏకాకిగా మార్చేందుకు పశ్చిమ దేశాలు చేసిన ప్రయత్నాలు చాలావరకు విఫలమయ్యాయి. అమెరికా నుంచి రష్యాను దూరం చేసేందుకు కూడా ప్రయత్నాలు జరిగాయి. అమెరికా వద్ద తన ప్రతిష్ట స్థిరంగా చెక్కుచెదరకుండా ఉందని నిరూపించుకోవాలని పుతిన్ భావిస్తున్నారు.
ఇందుకోసం అలస్కా సమావేశాన్ని అవకాశంగా వాడుకోవాలని నిర్ణయించారు. అంతర్జాతీయ రాజకీయాల్లో తన పట్టు ఏమాత్రం సడలలేదని ట్రంప్‌తో భేటీ ద్వారా పుతిన్ సంకేతం ఇవ్వబోతున్నారు. సమావేశానికి వేదికగా అలస్కాను ఎంచుకోవడం వెనుక ఒక వ్యూహం ఉంది. అలస్కాకు చేరుకోవాలంటే ఇతర దేశాల గగనతలం గుండా ప్రయాణించాల్సిన అసవరం లేదు.
ఎవరినో అనుమతి కోరాల్సిన పనిలేదు. రష్యా నుంచి నేరుగా అలస్కాకు చేరుకోగలరు. అలస్కాను 19వ శతాబ్దంలో రష్యా పాలకులు అమెరికాకు విక్రయించారు. 21వ శతాబ్దంలో కొన్ని సరిహద్దుల్లో బలవంతంగా చేసిన మార్పులను సమర్థించుకోవడానికి అలస్కాను వేదికగా పుతిన్ ఎంచుకున్నారు. దేశాల సరిహద్దులు మార్చడం, భూభాగాల యజమానులు మారడం సాధారణ విషయమేనని ఆయన చెప్పదలిచారు.
అలాగైతేనే కాల్పుల విరమణ
ఉక్రెయిన్‌తోపాటు యూరోపియన్ దేశాల అధినేతలను పుతిన్ పక్కనపెట్టారు. ప్రత్యక్షంగా అమెరికాతోనే చర్చలకు సిద్ధమయ్యారు. ఇతర దేశాల పరిగణనలోకి తీసుకోవడం లేదు. చర్చలైనా, ఒప్పందమైనా అమెరికాతోనే అంటున్నారు. ఈ విషయంలో ఉక్రెయిన్ అభ్యంతరాలు వ్యక్తం చేసినా పుతిన్ పట్టించుకోలేదు. తాము ఆక్రమించిన ఉక్రెయిన్ భూభాగాలను రష్యాలో అంతర్భాగంగా అంతర్జాతీయ సమాజం గుర్తించాలని పుతిన్ డిమాండ్ చేస్తున్నారు. అలాగైతేనే ఉక్రెయిన్‌తో కాల్పుల విరమణకు సిద్ధమని చెబుతున్నారు.
అయితే, పుతిన్ డిమాండ్‌ను ఉక్రెయిన్ వ్యతిరేకిస్తోంది. కబ్జాదారులకు తమ భూమి ఇవ్వబోమని ఉక్రెయిన్ అధినేత జెలెన్‌స్కీ తెగేసి చెప్పారు. ఆక్రమిత ప్రాంతాలను రష్యాలో భాగంగా అధికారికంగా గుర్తించేలా ట్రంప్‌పై ఒత్తిడి పెంచాలన్నదే పుతిన్ వ్యూహంగా కనిపిస్తోంది. మొదట అమెరికా గుర్తిస్తే తర్వాత ఇతర దేశాలపైనా ఒత్తిడి పెంచే అవకాశం ఉంటుంది. ఆక్రమిత ప్రాంతాలను వదులుకోకుంటే ఆర్థిక సాయం నిలిపివేస్తామంటూ అమెరికా బెదిరిస్తే ఉక్రెయిన్ దారికి రావడం ఖాయమని పుతిన్ వాదిస్తున్నారు.
ఆర్థిక బంధం బలపడుతుందా?
అమెరికా–రష్యా మధ్య ఆర్థిక, ద్వైపాక్షిక సంబంధాలపైనా ట్రంప్, పుతిన్ చర్చించబోతున్నారు. ఉక్రెయిన్‌పై యుద్ధం ప్రారంభించిన రష్యాపై అమెరికా కఠిన ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. ఈ ఆంక్షలను సడలించి, ఆర్థిక బంధాన్ని బలోపేతం చేసుకొనే దిశగా ఇరువురు నేతలు ఏదైనా ఒప్పందానికి వచ్చే అవకాశం లేకపోలేదు. ప్రస్తుతం రష్యా ఆర్థిక వ్యవస్థ తీవ్ర ఒత్తిళ్లు ఎదుర్కొంటోంది. అమెరికా సాయంతో గట్టెక్కాలన్న ఆలోచనలో పుతిన్ ఉన్నట్లు తెలుస్తోంది.
ఉక్రెయిన్‌పై యుద్ధాన్ని ఆపడానికి పుతిన్ అంగీకరిస్తే రష్యాకు ఆర్థికంగా అండగా ఉండడానికి ట్రంప్ ముందుకు రావొచ్చు. యుద్ధానికి ఫుల్‌స్టాప్ పెట్టకపోతే తీవ్ర పరిణామాల ఉంటాయని ట్రంప్ తాజాగా రష్యాను హెచ్చరించడం గమనార్హం. అంటే ఈ విషయంలో ట్రంప్ గట్టి పట్టుదలతో ఉన్నట్లు స్పష్టమవుతోంది. శుక్రవారం జరిగే భేటీలో పుతిన్‌ను ఆయన ఒప్పించడం ఖాయమని పరిశీలకులు అంచనా వేస్తున్నారు. యుద్ధాన్ని ఆపేసి శాంతి దూతగా నోబెల్ శాంతి బహుమతి స్వీకరించాలని ట్రంప్ ఆరాపడుతున్నారు.
– సాక్షి, నేషనల్ డెస్క్