బీజింగ్: చైనాలోని ఓ గ్రామం ఇటీవల తీసుకున్న నిర్ణయం ఆ దేశవ్యాప్తంగా, సోషల్ మీడియాలో చర్చాంశనీయంగా మారింది. గ్రామ కమిటీ ప్రత్యేకంగా రూపొందించిన నియమావళి ప్రకారం.. ఆ ఊరి గ్రామస్తులు ఆలస్యంగా వివాహం చేసుకోవడం, గర్భధారణకు సంబంధించిన నియమాలు పాటించని వారికి, అలాగే పిల్లల పెంపకం విధానాల్లో మార్పులు చేసిన వారికి జరిమానాలు విధిస్తూ ఆ ఊరి పెద్దలు తీర్మానించారు.
జరిమానా వివరాలు
• పెళ్లి కాకముందే గర్భం దాల్చితే 3,000 యువాన్ (సుమారు రూ.35,000).
• పెళ్లి కాకముందే కలిసి నివసిస్తే సంవత్సరానికి 500 యువాన్ (సుమారు రూ.6,000).
• బయటి ప్రావిన్స్ వ్యక్తిని పెళ్లి చేసుకుంటే 1,500 యువాన్ (సుమారు రూ.18,000).
• అసత్య వదంతులు వ్యాప్తి చేస్తే 500 నుంచి 1,000 యువాన్ జరిమానా.
ఈ వార్త వెలుగులోకి రావడంతో నెటిజన్లు ఊరు పెద్దలు తీసుకున్న నిర్ణయంపై ప్రశ్నల వర్షం కురిపించారు. చాలా మంది నెటిజన్లు ఈ నియమాలను వ్యక్తిగత స్వేచ్ఛపై దాడిగా అభివర్ణించారు. వివాహం ఎప్పుడు చేసుకోవాలి? పిల్లల్ని ఎప్పుడు కనాలి? అనేది వ్యక్తిగత నిర్ణయం. దానిపై గ్రామ కమిటీకి హక్కు ఎలా వస్తుంది?’ అని ప్రశ్నిస్తున్నారు. మరోవైపు, కొందరు మాత్రం గ్రామంలో జనాభా నియంత్రణ కోసం తీసుకున్న చర్యలుగా సమర్థిస్తున్నారు.
నిపుణుల అభిప్రాయం ప్రకారం, చైనాలో ప్రస్తుతం జనన రేటు తగ్గుదల (Demographic Winter) ఒక పెద్ద సమస్యగా మారింది. ప్రభుత్వం జనన రేటు పెంచాలని ప్రయత్నిస్తున్న సమయంలో, గ్రామ స్థాయిలో ఇలాంటి జరిమానాలు విధించడం వ్యతిరేక ధోరణిగా కనిపిస్తోంది. ఇది దేశవ్యాప్తంగా ఉన్న విధానాలకు విరుద్ధమని విశ్లేషకులు చెబుతున్నారు.
ఈ సంఘటనతో చైనా గ్రామీణ ప్రాంతాల్లో సామాజిక నియంత్రణ ఎంత కఠినంగా అమలవుతోందో బయటపడింది. ఒకవైపు ఆధునికీకరణ, ఆర్థికాభివృద్ధి దిశగా చైనా దూసుకెళ్తుంటే, మరోవైపు గ్రామాల్లో ఇలాంటి నియమాలు వ్యక్తిగత స్వేచ్ఛను ప్రశ్నార్థకంగా మార్చుతున్నాయి. మొత్తానికి, ఈ గ్రామం తీసుకున్న నిర్ణయాలు స్థానిక సమస్యగానే కాకుండా, జాతీయ స్థాయిలో చర్చకు దారితీశాయి.


