
ఏథెన్స్: గ్రీస్ దేశంలోని తనగ్రాలో రఫేల్ యుద్ధ విమానాలను ఫొటోలు తీసినందుకు నలుగురు చైనా జాతీయులను పోలీసులు అరెస్టు చేశారు. వీరిలో ఒక మహిళ ఉన్నట్లు తెలిసింది. తనగ్రాలో గ్రీస్ వైమానిక, సైనిక స్థావరాలు ఉన్నాయి.
హెలినిక్ ఏరోస్పేస్ ఇండస్ట్రీ(హెచ్‌ఏఐ) ఇక్కడే ఉంది. తాజాగా చైనా పౌరులు ఈ ప్రాంతంలో రఫేల్ యుద్ధ విమానాలతోపాటు ఇతర రక్షణ సదుపాయాలను కెమెరాల్లో బందిస్తున్నట్లు హెలినిక్ ఎయిర్‌ఫోర్స్ పోలీసులు గుర్తించారు. దూరంగా వెళ్లిపోవాలని ఆ నలుగురిని హెచ్చరించారు. దాంతో వారు కొంతదూరం వెళ్లి మళ్లీ ఫొటోలు తీస్తుండడంతో అనుమానం వచ్చి వెంటనే అదుపులోకి తీసుకొని, స్థానిక లా అండ్ ఆర్డర్ పోలీసులకు అప్పగించారు. రక్షణపరంగా తనగ్రా చాలా సున్నితమైన ప్రాంతం కావడంతో ఈ ఫొటోల వ్యవహారాన్ని అధికారులు తీవ్రంగా పరిగణించారు. స్థానికంగా హైఅలర్ట్ ప్రకటించారు.
చైనా జాతీయుల ప్రవర్తన అనుమానాస్పదంగా ఉందని, వారు గూఢచారులు కావొచ్చన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు. రక్షణపరంగా భారత్–గ్రీస్ మధ్య సన్నిహిత సంబంధాలున్నాయి. ఇరు దేశాలు కలిసి తరచుగా సైనిక విన్యాసాలు నిర్వహిస్తున్నాయి. భారత వైమానిక దళం ఇటీవల ఆపరేషన్ సిందూర్‌లో రఫేల్ ఫైటర్ జెట్లతో పాకిస్తాన్‌పై దాడి చేసింది. ఈ ఫైటర్ జెట్ల గుట్టుమట్లు తెలుసుకోవడానికే చైనా పౌరులు వాటిని ఫొటోలు తీశారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.