ఒక్క పొరపాటు.. అపార్ట్‌మెంట్లు కూలిపోతాయని దడుసుకున్నారు.. | Chinese institute apologises for issuing 7 7magnitude alert for much smaller earthquake | Sakshi
Sakshi News home page

ఒక్క పొరపాటు.. అపార్ట్‌మెంట్లు కూలిపోతాయని దడుసుకున్నారు..

Aug 24 2026 7:18 PM | Updated on Aug 24 2026 7:20 PM

Chinese institute apologises for issuing 7 7magnitude alert for much smaller earthquake

బీజింగ్‌: చిన్న భూకంపం వస్తే ఏకంగా 7.7 తీవ్రత (రిక్టర్‌ స్కేలుపై)తో భారీ భూకంపం వచ్చిందంటూ హెచ్చరిక చేసింది ఓ సంస్థ. దీంతో జనాలు బెంబేలెత్తిపోయారు. చైనాలోని నైరుతి ప్రాంతంలోని చెంగ్డూ మహానగరంలో ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కేర్ లైఫ్.. భూకంపం సంభవించిన 5 సెకన్లకే 7.7 తీవ్రతతో భూకంప హెచ్చరికను జారీ చేసింది. ఇతర భూకంప పర్యవేక్షణ సంస్థలు తెలిపిన తీవ్రత కంటే చాలా ఎక్కువ తీవ్రతతో భూకంప హెచ్చరికను ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కేర్ లైఫ్ జారీ చేయడంతో ప్రజల్లో భయాందోళనలు నెలకొన్నాయి. తమ అపార్ట్‌మెంట్లు కుప్పకూలిపోతాయేమోనని భయపడ్డారు.

చైనా భూకంప నెట్‌వర్క్స్ కేంద్రం ప్రకారం.. నైరుతి చైనాలోని సిచువాన్ ప్రావిన్స్‌లో యిబిన్ ప్రాంతంలో సోమవారం ఉదయం 8.26 గంటలకు 4.7 తీవ్రతతో భూకంపం సంభవించింది. భూకంప హెచ్చరిక వ్యవస్థ అయిన "చైనా భూకంప ముందస్తు హెచ్చరిక నెట్‌వర్క్" పేరును కేర్-లైఫ్ అనుమతి లేకుండా ఉపయోగించి.. హానర్, వివో స్మార్ట్‌ఫోన్లతో పాటు షియావోటియాన్‌కాయ్ స్మార్ట్‌వాచ్‌ల ద్వారా ప్రజలకు 7.7 తీవ్రతతో హెచ్చరికను పంపినట్లు గ్లోబల్ టైమ్స్ పత్రిక తెలిపింది.

తీవ్రత అంచనాలో భారీ వ్యత్యాసంపై స్పందిస్తూ.. నెట్‌వర్క్ 6వ సెకనులో అంచనాను 6.4కు, 7వ సెకనులో 3.7కు, 8వ సెకనులో 4.1కు, 16వ సెకనులో 3.9కు తగ్గించినట్లు తెలిపింది. సేవలను మెరుగుపరిచేందుకు ఈ వ్యత్యాసానికి కారణాన్ని సాధ్యమైనంత త్వరగా దర్యాప్తు చేస్తామని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కేర్-లైఫ్ తెలిపింది.

గతంలో వరసగా భూకంపాలు 
జూలైలో చైనాలోని ఓ మారుమూల ప్రావిన్స్‌లో 5.7 తీవ్రతతో భూకంపం సంభవించగా, కేవలం 18 నిమిషాల తర్వాత 5.8 తీవ్రతతో మరో భూకంపం సంభవించింది. వాయవ్య చైనాలోని క్వింగ్‌హై ప్రావిన్స్‌లోని జింగ్‌హై కౌంటీలో ఉదయం 11.16 గంటలకు, 11.34 గంటలకు ఈ భూకంపాలు సంభవించాయి. 10 కిలోమీటర్ల లోతులో సంభవించిన ఈ భూకంపాల కేంద్రం, క్వింగ్‌హై రాజధాని షినింగ్‌కు సుమారు 244 కిలోమీటర్ల దూరంలో ఉన్న తక్కువ జనాభా కలిగిన ఎత్తైన ప్రాంతంలో ఉంది.

మే నెలలో దక్షిణ గ్వాంగ్‌సీ ప్రాంతంలో 5.2 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఈ ఘటనలో ఇద్దరు మరణించారు. భవనాలు కూలిపోయాయి. వేలాది మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. మరో నలుగురు గాయపడగా, లియుజౌ నగరం నుంచి 7,000 మందికి పైగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement