ప్రముఖ కార్ల తయారీ సంస్థ టెస్లా (Tesla) ఏకంగా 40 లక్షల కార్లకు రీకాల్ ప్రకటించింది. ఈ విషయాన్ని చైనా అధికారులు వెల్లడించారు. కంపెనీ రీకాల్ ప్రకటించడానికి కారణం ఏమిటనే విషయాన్ని ఈ కథనంలో చూసేద్దాం.
డోర్ హ్యాండిల్ భద్రతకు సంబంధించిన సమస్య కారణంగా.. అమెరికా కార్ల తయారీ సంస్థ మోడల్ 3, మోడల్ వై, మోడల్ ఎక్స్, మోడల్ ఎస్ సహా చైనాలో తయారైన, దిగుమతి చేసుకున్న సుమారు 29.8 లక్షల ఎలక్ట్రిక్ వాహనాలను రీకాల్ చేస్తోందని చైనా స్టేట్ అడ్మినిస్ట్రేషన్ ఫర్ మార్కెట్ రెగ్యులేషన్ తెలిపింది.
చైనా మీడియా ప్రకారం.. ఈ సంవత్సరంలో ఇదే అతిపెద్దదైన ఈ రీకాల్. టెస్లా ఎలక్ట్రిక్ వాహనాలు, అనేక చైనీస్ ఈవీ మోడళ్లలో సాధారణంగా కనిపించే లోపలికి ఉన్న కార్ డోర్ హ్యాండిల్స్‌ను వచ్చే ఏడాది నుంచి నిషేధిస్తామని చైనా అధికారులు ఫిబ్రవరిలో ప్రకటించిన తర్వాత ఈ భారీ రీకాల్ ప్రకటన వెల్లడైంది.
దేశంలో అనేక చోట్ల జరిగిన ఈవీల ప్రమాదాల నేపథ్యంలో.. చైనా ఇటీవల ఫ్లష్ కార్ డోర్ హ్యాండిల్స్‌పై నిఘాను ముమ్మరం చేసింది. ఈ ప్రమాదాలలో కార్లలోని ఎలక్ట్రానిక్ డోర్లు విఫలమై, ప్రజలు లోపల చిక్కుకుపోయారు.
చైనా నియంత్రణ సంస్థ వెబ్‌సైట్‌లోని ఒక ప్రకటనలో.. భద్రతకు సంబంధించిన ప్రమాదాన్ని ప్రస్తావించింది. ఎలక్ట్రిక్ వ్యవస్థ వైఫల్యానికి కారణమయ్యే తీవ్రమైన ప్రమాదం వంటి తీవ్రమైన పరిస్థితులలో.. కారు హ్యాండిల్స్, కారు వినియోగదారులు తప్పించుకోవడానికి తలుపులు త్వరగా ఓపెన్ కాకుండా అడ్డుకోవచ్చని, లేదా కారు బయట ఉన్న సహాయక సిబ్బంది లోపలికి ప్రవేశించకుండా నిరోధించవచ్చని ఆ ప్రకటన పేర్కొంది. పరిశ్రమలోని కొంతమంది నిపుణులు వాహన తయారీదారులు డిజైన్ కంటే భద్రతకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు.
చైనా ప్యాసింజర్ కార్ అసోసియేషన్ అధిపతి కుయ్ డోంగ్షు, ఎలక్ట్రిక్ వాహన పరిశ్రమ అభివృద్ధిలో ఈ రీకాల్‌ను 'ఒక అనివార్యమైన అడుగు' అని అభివర్ణించారు. వాహన తయారీదారులు మరింత విశ్వసనీయమైన, భద్రతకు ప్రాధాన్యతనిచ్చే విధానం వైపు పయనిస్తూ.. బాధ్యతాయుతంగా వ్యవహరిస్తున్నారని అన్నారు.
ప్రమాదాలను తగ్గించడానికి టెస్లా వాహనాలకు సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌లను నిర్వహిస్తుంది. ఇదే సమయంలో బీజింగ్‌కు చెందిన చైనా టెక్నాలజీ దిగ్గజం షియోమీ, 3,90,000కు పైగా వాహనాలను రీకాల్ చేస్తోంది. హాంగ్‌జౌకు చెందిన లీప్‌మోటార్ 3,70,000కు పైగా కార్లను రీకాల్ చేస్తోంది. గీలీ, ఎక్స్‌పెంగ్ సహా ఇతర చైనా కార్ల తయారీ సంస్థలు కూడా కొన్ని వాహనాలను రీకాల్ చేస్తున్నాయి. ఈ కంపెనీలన్నీ రీకాల్ ప్రకటించడానికి కారణం కారు డోర్ హ్యాండిల్స్‌కు సంబంధించిన సమస్యలే అని తెలుస్తోంది.


