బంగ్లా‌తో చైనా ఒప్పందాలు.. భారత్‌ ఆందోళన ఏంటి? చైనా ఏమంది? | China Says Teesta Cooperation With Bangladesh Is A Development Initiative, Not A Strategic Move | Sakshi
Sakshi News home page

బంగ్లా‌తో చైనా ఒప్పందాలు.. భారత్‌ ఆందోళన ఏంటి? చైనా ఏమంది?

Jun 29 2026 4:39 PM | Updated on Jun 29 2026 5:32 PM

 China Responds To Indias Concerns

చైనా, బంగ్లాదేశ్‌ ఇటీవల 13 ఒప్పందాలపై సంతకాలు చేసుకున్న విషయం తెలిసిందే. తీస్తా సహా తదితర నదుల నిర్వహణలో పరస్పర సహకారం కోసం ఈ ఒప్పందాలు జరిగాయి. దీనిపై భారత్‌ ఆందోళన వ్యక్తం చేసింది.

ఈ నేపథ్యంలో దీని గురించి చైనా స్పందించింది. తీస్తా నది నిర్వహణ, పునరుద్ధరణ ప్రాజెక్టు (టీఆర్‌సీఎంఆర్‌పీ) విషయంలో బంగ్లాదేశ్‌కు తమ మద్దతు ఉంటుందని చైనా మరోసారి స్పష్టం చేసింది. బంగ్లాదేశ్‌తో చేసుకున్న తమ ఒప్పందం ఏ మూడో దేశాన్ని లక్ష్యంగా చేసుకున్నది కాదని చైనా తెలిపింది.

బీజింగ్‌లో మీడియాతో చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి గువో జియాకున్‌ మాట్లాడుతూ.. "చైనా-బంగ్లాదేశ్‌ సహకారం ఏ మూడో దేశాన్నీ లక్ష్యంగా చేసుకోదు. చైనా-బంగ్లాదేశ్‌ సహకారంలో ఏ మూడో దేశం జోక్యం ఉండకూడదు" అని చెప్పారు.

ఈశాన్య ప్రాంతానికి సమీపంలో నది
తీస్తా నది పరివాహక ప్రాంతం భారత్‌ ఈశాన్య ప్రాంతానికి అత్యంత సమీపంలో ఉంది. ఇదే భారత్‌ ఆందోళన వ్యక్తం చేయడానికి కారణం. తీస్తా నదికి సమీపంలో వ్యూహాత్మకంగా అత్యంత కీలకమైన సిలిగురి కారిడార్‌, అంటే చికెన్‌ నెక్‌ ప్రాంతం ఉండటమే భారత్‌ ఆందోళనకు ప్రధాన కారణం.

ఆ ప్రాంతంలో, ముఖ్యంగా చైనా ఉనికి పెరగడం, భారత్‌ భద్రతా ఆందోళనలను పెంచే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. దేశ ఈశాన్య ప్రాంతాన్ని మిగతా భారతదేశంతో కలిపే ఈ కారిడార్‌ విషయంతో సమస్యలు ఏర్పడే అవకాశం కూడా ఉందని అంచనా వేస్తున్నారు.

ఆ నదీ ప్రాజెక్టు బంగ్లాదేశ్‌ ప్రజల జీవనోపాధికి ఉపయోగపడే ప్రాజెక్టు అని చైనా పేర్కొంటోంది. "తీస్తా నది సమగ్ర నిర్వహణ, పునరుద్ధర ప్రాజెక్టు అనేది బంగ్లాదేశ్‌ అత్యంత ప్రాధాన్యం ఇస్తున్న ప్రజల జీవనోపాధి ప్రాజెక్టు. దీనికి సాధ్యమైనంత సాయం అందించడానికి చైనా సిద్ధంగా ఉంది" అని జియాకున్‌ చెప్పారు.

"అభివృద్ధి వ్యూహాల్లో బంగ్లాదేశ్‌తో మరింత సమన్వయం సాధించడానికి, ఆర్థికం, వాణిజ్యం, జల సంరక్షణ, ప్రజల జీవనోపాధి వంటి రంగాల్లో పరస్పర చర్చలు, సహకారాన్ని మరింత పెంచడానికి చైనా సిద్ధంగా ఉంది" అని ఆయన అన్నారు.

ఈ ప్రాజెక్టుపై ఇరు దేశాల నిపుణులు తొలిసారిగా సాంకేతిక సాధ్యాసాధ్యాల అధ్యయనం నిర్వహిస్తారని బంగ్లాదేశ్‌ విదేశాంగ మంత్రి ఖలీలుర్‌ రహ్మాన్‌ తెలిపారు. "ఇందుకు ఇరు దేశాలు అంగీకరించాయి. సాధ్యాసాధ్యాలపై జరిపే అధ్యయనం అనుకూలంగా ఉంటే ఈ ప్రాజెక్టుకు సాధ్యమైనంత మద్దతు ఇస్తామని చైనా తెలిపింది" అని మంత్రి అన్నారు.

బంగ్లాదేశ్‌లోని నదుల నిర్వహణలో సహకారాన్ని పెంచుకోవడానికి బంగ్లాదేశ్‌, చైనా ఒప్పందాలు చేసుకున్నాయి. తీస్తా ప్రణాళికపై వచ్చే ప్రకటనలను భారత్‌ నిశితంగా గమనించనుంది.

ఈ ఏడాది జనవరిలో బంగ్లాదేశ్‌ వాటర్‌ డెవలప్‌మెంట్‌ బోర్డు (బీడబ్ల్యూఢీబీ), చైనా ప్రభుత్వ అధీన సంస్థ పవర్‌ చైనా అవగాహన ఒప్పందం గడువును పొడిగిస్తూ సంతకాలు చేశాయి. దీనితో తీస్తా ప్రాజెక్టు ముందుకు సాగింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement