
బీజింగ్: అగ్రరాజ్యం అమెరికా, డ్రాగన్ చైనా మధ్య టారిఫ్‌ల యుద్ధం కొనసాగుతోంది. ఇరు దేశాల పన్నులు విధించు కోవడంలో తగ్గేదేలే అంటూ దూసుకెళ్తున్నాయి. ఈ నేపథ్యంలో తన దేశ పౌరులకు చైనా హెచ్చరికలు జారీ చేసింది. చైనా విద్యార్థులు, పర్యాటకులు.. అమెరికా వెళ్లే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించి.. ప్లాన్ చేసుకోవాలని సూచనలు చేసింది. అమెరికాలో ఎదురయ్యే ముప్పులను ముందుగానే అంచనా వేసుకోవాలని కోరింది.
అమెరికా-చైనా మధ్య టారిఫ్‌ల యుద్ధం కొనసాగుతున్న సందర్భంగా చైనా పర్యటక శాఖ కీలక ప్రకటన చేసింది. అమెరికా వెళ్లే చైనీయులకు అక్కడ ఎదురయ్యే ముప్పులను ముందుగానే అంచనా వేసుకోవాలని, జాగ్రత్త అంటూ చైనా టూరిజం శాఖ సూచించింది. దీంతోపాటు అమెరికా రాష్ట్రాల్లో చదువుకోవాలనుకునే విద్యార్థులు కూడా అయా ప్రాంతాల్లో భద్రతా ముప్పును అంచనా వేసుకొని వెళ్లాలని కోరింది. భద్రతా పరిస్థితుల కారణంగా ప్రస్తుత పరిస్థితుల్లో అమెరికాకు వెళ్లకపోవడమే మంచిదని సూచనలు చేసింది.
ఇదే సమయంలో.. ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్లాలనుకునే చైనీయుల కోసం విద్యాశాఖ మరో హెచ్చరిక జారీ చేసింది. కొన్ని రాష్ట్రాల్లో చైనీయులకు సంబంధించి ప్రతికూల నిబంధనలు ఉన్నాయని తెలిపింది. భవిష్యత్తులో అక్కడ చదవాలనుకునే వారు స్థానికంగా ఎదురయ్యే సమస్యలను తెలుసుకోవాలని సూచించింది.
ఇదిలా ఉండగా.. ప్రపంచవ్యాప్త ఆర్థిక ప్రకంపనల నేపథ్యంలో ట్రంప్ వెనక్కు తగ్గారు. భారత్‌తో పాటు 75 పై చిలుకు దేశాలపై విధించిన ప్రతీకార సుంకాలను తాత్కాలికంగా పక్కన పెట్టారు. వాటి అమలును 90 రోజుల పాటు వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు. దాంతో అదనపు సుంకాలు అమల్లోకి వచ్చిన ఒక్క రోజులోనే అటకెక్కాయి. కానీ చైనాతో మాత్రం అమెరికా టారిఫ్‌ల పోరు బుధవారం మరింత తీవ్రరూపు దాల్చింది. ఈ దిశగా రోజంతా శరవేగంగా నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. 50 శాతం అదనపు సుంకాలు విధిస్తున్నట్టు ట్రంప్ ప్రకటించిన గంటల వ్యవధిలోనే అమెరికాపైనా చైనా అంతే మొత్తం బాదింది.
అమెరికా ఉత్పత్తులపై 84 శాతం సుంకాలు గురువారం నుంచే అమల్లోకి వస్తాయని స్పష్టం చేసింది. దీనిపై ట్రంప్ తీవ్రంగా కన్నెర్రజేశారు. చైనా ఉత్పత్తులపై ఇప్పటికే 104 శాతానికి చేరిన సుంకాలను ఏకంగా 125 శాతానికి పెంచేశారు. అవి తక్షణం అమల్లోకి వస్తాయని కుండబద్దలు కొట్టారు. మరోవైపు యూరోపియన్ యూనియన్ కూడా అమెరికాపై మళ్లీ సుంకాల కత్తి ఝుళిపించింది. 23 బిలియన్ల విలువైన యూఎస్ ఉత్పత్తులపై దశలవారీగా అదనపు టారిఫ్‌లు విధిస్తున్నట్టు ప్రకటించింది. కెనడా కూడా అమెరికా ఆటో ఉత్పత్తులపై 25 శాతం అదనపు సుంకాలు విధిస్తున్నట్టు పేర్కొంది.