ట్రంప్‌కు ఎదురుదెబ్బ  | Boston judge critical of Trump mail-in voting executive order | Sakshi
Sakshi News home page

ట్రంప్‌కు ఎదురుదెబ్బ 

Jun 25 2026 1:21 AM | Updated on Jun 25 2026 1:21 AM

Boston judge critical of Trump mail-in voting executive order

‘పౌరసత్వ నిరూపణ’ నిబంధన చెల్లదన్న ఫెడరల్‌ జడ్జి 

బోస్టన్‌: ఎన్నికల నిబంధనలను సమూలంగా మార్చేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తీసుకొచ్చిన వివాదాస్పద ఎగ్జిక్యూటివ్‌ ఆర్డర్‌కు బ్రేక్‌ పడింది. ఓటరుగా నమోదు చేసుకునే సమయంలో పౌరసత్వ ఆధారాలను తప్పనిసరిగా చూపించాలనే నిబంధనతో కూడిన ట్రంప్‌ ఆదేశాల అమలును బోస్టన్‌లోని ఫెడరల్‌ కోర్టు బుధవారం శాశ్వతంగా నిషేధించింది. ట్రంప్‌ తెచ్చిన ఈ ఎన్నికల సంస్కరణలను తాత్కాలికంగా అడ్డుకుంటూ ఏడాది క్రితం ఇచ్చిన ఉత్తర్వులను.. యూఎస్‌ డిస్ట్రిక్ట్‌ కోర్ట్‌ జడ్జి డెనిస్‌ కాస్పర్‌ ఇప్పుడు శాశ్వత నిషేధంగా మారుస్తూ తుది తీర్పునిచ్చారు.

ట్రంప్‌ మార్పులను సవాలు చేస్తూ డెమొక్రటిక్‌ పార్టీకి చెందిన స్టేట్‌ అటార్నీ జనరల్స్‌ దాఖలు చేసిన పిటిషన్‌ సమంజసమేనని కోర్టు అంగీకరించింది. నిబంధనలు ఇంకా అమల్లోకి రాలేదు కాబట్టి ఈ వ్యాజ్యం ముందస్తుదేనన్న ట్రంప్‌ ప్రభుత్వ వాదనను జడ్జి తిరస్కరించారు. అమెరికా రాజ్యాంగం ప్రకారం ఎన్నికలను క్రమబద్ధీకరించే పూర్తి అధికారం రాష్ట్రాలకు, కాంగ్రెస్‌ (పార్లమెంట్‌)కు మాత్రమే ఉంటుందని, ట్రంప్‌ విధించిన షరతులు ‘అధికారాల విభజన’సూత్రాన్ని ఉల్లంఘించడమేనని జడ్జి స్పష్టం చేశారు. ‘రాజ్యాంగం అధ్యక్షుడికి ఎన్నికలపై ఎలాంటి ప్రత్యేక అధికారాలను ఇవ్వలేదు’అని ఆమె తీర్పులో పేర్కొన్నారు.  

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement