ట్రంప్‌లా కనిపించిన గేదె.. పాపం! | Bangladesh viral Trump Buffalo faces its final Eid al Adha Sacrifice | Sakshi
Sakshi News home page

ట్రంప్‌లా కనిపించిన గేదె.. పాపం!

May 23 2026 9:00 AM | Updated on May 23 2026 11:33 AM

Bangladesh viral Trump Buffalo faces its final Eid al Adha Sacrifice

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ను పోలి ఉందంటూ సోషల్‌ మీడియాలో  ఓ అరుదైన తెల్లగేదె సంచలనం సృష్టించింది. అయితే ఇప్పుడు మరో కారణంతో వార్తల్లో నిలిచింది. వేలాది మంది సెల్ఫీలు దిగిన ఆ “ట్రంప్‌ బఫెలో”కథ.. మరికొన్ని రోజుల్లో ముగియబోతోంది. 

బంగ్లాదేశ్‌ రాజధాని ఢాకా సమీపంలోని నారాయణ్‌గంజ్‌లో ఉన్న ఓ ఫారంలో పెంచుతున్న ఈ నాలుగేళ్ల ఆల్బినో గేదె బరువు దాదాపు 700 కిలోలు. నుదుటిపై వేలాడే బంగారు రంగు జుట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ హెయిర్‌స్టైల్‌ను పోలి ఉండటంతో దీనికి “ట్రంప్‌” అనే పేరు ముద్రపడింది. ఆ తర్వాత ఈ గేదె ఫొటోలు, వీడియోలు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి. అయితే.. 

బక్రీద్‌ సందర్భంగా ట్రంప్‌ గేదెను బలి ఇవ్వబోతున్నారట. ఈ గేదెను పెంచుతున్న ఫారం యజమాని జియౌద్దీన్‌ మృధా మాట్లాడుతూ.. ఈద్‌ అల్‌ అదా(Eid al-Adha) సందర్భంగా బలిచేయడానికి ఇప్పటికే ఓ వ్యక్తి దీనిని కొనుగోలు చేశాడని తెలిపారు. ‘‘ట్రంప్‌ బఫెలోను మిస్‌ అవుతాను. కానీ త్యాగమే ఈద్‌ అసలు స్ఫూర్తి” అని జియౌద్దీన్‌ చెబుతున్నారు.

తెల్లని చర్మం, గులాబీ రంగు ముక్కు, లేత రంగు జుట్టుతో కనిపించే ఈ గేదెను చూసేందుకు ప్రతిరోజూ జనాలు పెద్ద ఎత్తున ఫారంకు వచ్చేవారని.. పిల్లలు, యువత సెల్ఫీలు తీసుకోవడానికి పోటీపడేవారని తెలిపారు. కొందరు దూర ప్రాంతాల నుంచి ప్రత్యేకంగా వచ్చి చూసి వెళ్లేవారట. మరోవైపు.. 

ఆల్బినో జంతువులు చాలా అరుదుగా కనిపిస్తాయని పశుసంవర్ధక శాఖ అధికారులు చెబుతున్నారు. శరీరంలో మెలానిన్‌ లోపం వల్లే వీటికి తెల్లటి రంగు వస్తుందని వివరించారు. ఈ గేదె ఆరోగ్యంగా ఉండేందుకు రోజుకు నాలుగు సార్లు స్నానం చేయించడంతో పాటు ప్రత్యేక ఆహారం కూడా ఇచ్చేవారని యజమాని చెప్పాడు. అయితే జనసందోహం ఎక్కువ కావడంతో గేదె ఒత్తిడికి గురై బరువు తగ్గిందని, అందుకే చివర్లో ప్రజల ప్రవేశాన్ని పరిమితం చేశాడట. వైరల్‌ స్టార్‌గా మారిన ఆ గేదెకు ఇదే చివరి పండుగ కానుండటం స్థానికంగా భావోద్వేగాన్ని రేకెత్తిస్తోంది.

ఇదిలా ఉంటే.. ఈ నెల చివర్లో జరగనున్న ఈద్‌ అల్‌ అదా కోసం భారీ సంఖ్యలో పశువులను సిద్ధం అవుతున్నాయి. భారీ సైజులో ఉండడమో లేదంటే ప్రత్యేక లక్షణాల కారణంగా పలు పశువులు సోషల్‌మీడియాలో వైరల్‌ అవడం సాధారణమైపోయింది. అయితే ట్రంప్‌ రెండోసారి అధ్యక్షుడు కావడం.. సంచలన నిర్ణయాలతో పలు దేశాలను షేక్‌ చేస్తుండడంతో.. ఈ గేదె తన ప్రత్యేక రూపంతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement