బంగ్లాదేశ్‌ అతలాకుతలం.. హసీనాకు మరణశిక్ష? | Bangladesh erupted in unrest ICT verdict Sheikh Hasina | Sakshi
Sakshi News home page

బంగ్లాదేశ్‌ అతలాకుతలం.. హసీనాకు మరణశిక్ష?

Nov 17 2025 7:56 AM | Updated on Nov 17 2025 8:58 AM

Bangladesh erupted in unrest ICT verdict Sheikh Hasina

ఢాకా: బంగ్లాదేశ్‌లో మరోసారి అతలాకుతలమైంది. బంగ్లాదేశ్ మాజీ ప్రధానమంత్రి షేక్ హసీనాపై అంతర్జాతీయ నేరాల ట్రిబ్యునల్ (ICT) తీర్పు వెలువడనున్న నేపథ్యంలో ఆదివారం అర్థరాత్రి ఉద్రిక్తత చోటుచేసుకుంది. రాజధాని ఢాకా సహా పలు చోట్ల హింసాత్మక ఘటనలు జరిగాయి. ఈ నేపథ్యంలోనే బంగ్లాదేశ్​ అంతటా భద్రతను కట్టుదిట్టం చేశారు. యూనస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా భారీ నిరసనలు జరిగాయి. నిరసనకారులు రోడ్ల మీదకు రావడంతో కనిపిస్తే కాల్చివేతకు ఆదేశాలు జారీ అయ్యాయి.

బంగ్లాదేశ్‌ మాజీ ప్రధాని షేక్ హసీనాపై కేసులో బంగ్లాదేశ్ ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రిబ్యునల్ (ఐసీటీ) నేడు తీర్పు వెలువరించనుంది. గతేడాది విద్యార్థుల నిరసనల అణచివేత కేసులో ఆమె అమానుష చర్యలకు పాల్పడినట్టు ఆరోపణలు ఉన్నాయి. హసీనా, ఆమె ప్రభుత్వంలో మాజీ హోంమంత్రి అసదుజ్జమాన్ ఖాన్ ఖమాల్‌‎ను నేరాలకు పాల్పడి దేశం విడిచి పారిపోయిన వ్యక్తులుగా ప్రకటించి విచారణ జరిపారు. ఈ క్రమంలో భారత్‌లో ఉన్న హసీనాకు మరణశిక్ష విధించాలని ప్రాసిక్యూటర్లు కోరారు.

మరోవైపు.. ఐసీటీ తీర్పు నేపథ్యంలో షేక్‌ హసీనా అవామీ లీగ్‌ ఫేస్‌బుక్‌ పేజీలో ఓ భావోద్వేగ వీడియోను షేర్‌ చేశారు. ఈ సందర్భంగా ఆమె..‘ఈ దాడులు, కేసులు కొత్తవి కావు. నాకు శిక్ష వేసినా భయపడవద్దు. వాళ్లు నన్ను విచారిస్తే చేసుకోండి. నాకు ఫర్వాలేదు. ఇది దేవుడు ఇచ్చిన జీవితం. ఏదొక రోజు మరణించాల్సిందే. కానీ నేను ప్రజల కోసం పనిచేస్తున్నా. అలాగే చేస్తూనే ఉంటా. పథకం ప్రకారం నన్ను అధికారంలో నుంచి తొలగించినట్లు యూనస్​ స్వయంగా చెప్పారు. ఆయన అధికార దాహి. మన రాజ్యాంగంలోని ఆర్టికల్ 7(B) ప్రకారం, ఎవరైనా బలవంతంగా ఎన్నికైన ప్రభుత్వాన్ని తొలగిస్తే శిక్షార్హులు. యూనస్ అదే చేశారు. నా మీద పెట్టిన కేసులు పూర్తిగా తప్పుడు కేసులే. కోర్టులో ఎవరైనా తప్పుడు ఫిర్యాదు చేస్తే వాళ్లపై కూడా శిక్ష ఉంటుంది. ఒక రోజు అది జరుగుతుంది. భయపడటానికి ఏమీ లేదు. నేను బతికే ఉన్నాను. నేను బతుకుతాను. దేశ ప్రజలకు నేను మద్దతు ఇస్తాను. యూనస్‌ ప్రభుత్వం బంగ్లాదేశ్‌ను మిలిటెంట్ రాజ్యంగా మారుస్తోంది. బంగ్లాదేశ్‌లో ప్రజలకు రక్షణ కరువైంది అని ఘాటు విమర్శలు చేశారు. ఇక, తీర్పు వెలువడుతున్న నేపథ్యంలో నిరసనగా అవామీ లీగ్ నవంబర్ 17న దేశవ్యాప్తంగా బంద్‌ ప్రకటించింది.

హసీనా వీడియో సందేశం తర్వాత.. బంగ్లాదేశ్‌ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఆందోళనకారులు కార్లకు నిప్పంటించారు. చెట్లను అడ్డుగా పెట్టి, ఓ జాతీయ రహదారిపై రాకపోకలకు ఆటంకం కలిగించారు. రోడ్లపైకి పెద్ద ఎత్తు చేరి ఆందోళనలు చేశారు. ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్‌లోని యూనస్‌ ప్రభుత్వం సైన్యం, పోలీసులతోపాటు బోర్డర్ గార్డులను రంగంలోకి దించింది. ఎవరైనా ప్రాణహాని తలపెట్టేలా ఆందోళనలు చేస్తే వారిపై కాల్పులు జరపొచ్చని పోలీసులను ఆదేశించింది. ముఖ్యంగా తీర్పును వెలువరించే ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రైబ్యునల్ (ICT) చుట్టూ సెక్యూరిటీని కట్టుదిట్టం చేశారు.

మా అమ్మకు మరణశిక్ష విధిస్తారేమో: హసీనా కుమారుడు
ఇదిలా ఉండగా.. తీర్పు నేపథ్యంలో షేక్‌ హసీనా కుమారుడు సజీబ్ వాజెద్ స్పందిస్తూ.. మా అమ్మకు మరణశిక్ష విధిస్తారేమో. తీర్పు ఏమిటో మాకు ఖచ్చితంగా తెలుసు. యూనస్‌ ప్రభుత్వం ఆమెను దోషిగా నిర్ధారించబోతున్నారు. నా తల్లిని ఏం చేయగలరు?. ఆమె భారత్‌లో సురక్షితంగా ఉంది. ఆమెకు భారత్‌ పూర్తి భద్రతను ఇస్తోంది అని చెప్పుకొచ్చారు. ఇదే సమయంలో అవామీ లీగ్‌ పార్టీపై నిషేధాన్ని ఎత్తివేయకపోతే వచ్చే ఏడాది ఎన్నికలను అడ్డుకుంటామని హెచ్చరించారు. 

తీర్పు ప్రత్యక్ష ప్రసారం.. 
తీర్పులోని కొన్ని అంశాలను ప్రభుత్వ యాజమాన్యంలోని బీటీవీలో ప్రత్యక్ష ప్రసారం చేస్తామని ప్రాసిక్యూటర్లు తెలిపారు. ICT-BD అధికారిక ఫేస్‌బుక్ పేజీలో ప్రసారం చేస్తామని పేర్కొన్నారు. హసీనాను అరెస్టు చేయకపోతే లేదా 30 రోజుల్లోపు లొంగిపోకపోతే ఆమె అప్పీల్ చేయడాన్ని ICT-BD చట్టం నిషేధిస్తుందని చెప్పారు. తీర్పు ఎలా ఉన్నా అమలు చేస్తామని అని ప్రభుత్వ తాత్కాలిక సలహాదారు జహంగీర్ ఆలం చౌదరి అన్నారు. దేశవ్యాప్తంగా భద్రతా దళాలు హై అలర్ట్‌లో ఉన్నాయి.

యూనస్‌ పరిస్థితి అంతే..
షేక్ హసీనా ప్రభుత్వం పతనమై.. యూనస్ నేతృత్వంలో తాత్కాలిక ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా కూడా.. నిరసనలు, అశాంతి కొనసాగుతున్నాయి. హసీనా కూడా.. తాను బంగ్లాదేశ్‌కు తిరిగి రావాలంటే.. ముందుగా భాగస్వామ్య ప్రజాస్వామ్యం పునరుద్ధరించాలని, అవామీ లీగ్ పార్టీపై నిషేధం ఎత్తేయాలని కోరుతున్నారు. అంతేకాదు.. స్వేచ్ఛాయుతమైన, పారదర్శకమైన ఎన్నికలు నిర్వహించాలని కోరారు. యూనస్ ప్రభుత్వం.. మితవాదుల మద్దతుపై ఆధారపడుతోందని ఆరోపించారు. బంగ్లా ప్రభుత్వం తన మూర్ఖపు, ఆత్మహత్యా చర్యలతో.. భారత్‌తో ముఖ్యమైన సంబంధాలను ప్రమాదంలో పడేస్తోందని ఆరోపించారు. బంగ్లాదేశ్‌లో జరుగుతున్న నిరసనలు, యూనస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న ఈ తిరుగుబాటు.. కేవలం రాజీనామా కోసం జరిగిన గత ఉద్యమానికి కొనసాగింపు మాత్రమే కాదు. అనేక ఘర్షణల మధ్య జరుగుతున్న పోరాటం. హసీనాను గద్దె దించిన తర్వాత కూడా, తాత్కాలిక ప్రభుత్వంలో.. పారదర్శకత, జవాబుదారీతనం లేకపోవడంతో, దేశం పూర్తిగా విచ్ఛిన్నమైన రాజకీయ వ్యవస్థను ఎదుర్కొంటోంది. ఈ నిరసనలు, బంగ్లాదేశ్ నిజమైన, సమ్మిళిత ప్రజాస్వామ్య వ్యవస్థ వైపు పయనించాలనే ప్రజల ఆకాంక్షను ప్రతిబింబిస్తున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement