అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వలస కార్మికులపై తొలిసారిగా పాజిటివ్‌గా స్పందించారు. అమెరికా పారిశ్రామిక, రక్షణ రంగాలలో అభివృద్ధి సాధించాలంటే ఇతర దేశాల నుంచి నైపుణ్యత గల కార్మికులను తమ దేశానికి తీసుకురావాలన్నారు. అయితే, అది పరిమిత స్థాయిలో ఉండాలని ట్రంప్ స్పష్టం చేశారు.
డొనాల్ట్ ట్రంప్ ఈ పేరు వింటే చాలు ప్రపంచ దేశాలన్ని తలపట్టుకుంటున్నాయి. ఎప్పుడు ఏ నిర్ణయంతో ఎవరిని ఇబ్బందిపెడతారో అని ఆలోచిస్తున్నాయి. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి తన తొందరపాటు నిర్ణయాలతో ప్రపంచ దేశాలను ఇబ్బందిపెట్టిన ట్రంప్.. హెచ్-1బీ వీసాలపై కూడా తన మార్క్ చూపించారు. హెచ్-1బీ వీసా దరఖాస్తు రుసుమును లక్ష డాలర్లు (రూ.88లక్షలు)కు పెంచి అమెరికాలో స్థిరపడాలనుకొనే ఉద్యోగస్థుల ఆశలపై నీళ్లు చల్లారు. వీసాల విషయంలో కఠిన నిబంధనలను కూడా తెరపైకి తెచ్చారు.
అయితే, తాజాగా ఫాక్స్ న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్యూలో మాత్రం వలస కార్మికులపై ట్రంప్ పాజిటివ్‌గా మాట్లాడారు. మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్‌తోపాటు, రక్షణ రంగంలో నైపుణ్యత గలిగిన వలస కార్మికులను నియమించుకోవాలని తెలిపారు. ఆ రంగాలలో అమెరికన్లకు నైపుణ్యత లేదన్నారు. తమ దేశంలో ఎంతో ప్రతిభ గల యువకులనున్నారని తమ ప్రభుత్వ విధానాలతో అమెరికన్లకు వేతనాలు పెరిగే అవకాశముందని ట్రంప్ తన చర్యలను సమర్థించారు. దేశ యువత స్కిల్స్ నేర్చుకొవాలని అలా చేస్తే వారితో మిస్సైల్స్ తయారు చేయిస్తానని, దేశంలో నిరుద్యోగం లేకుండా చేయవచ్చని అధ్యక్షుడు ట్రంప్ తేల్చిచెప్పారు.
ఇదిలా ఉండగా.. ట్రంప్ తీసుకున్న నిర్ణయాలతో అమెరికా మ్యాను ఫ్యాక్చరింగ్ సెక్టార్ తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటుంది. నైపుణ్యత గల కార్మికులను అక్రమ వలసలు పేరుతో తొలగించడం ద్వారా తయరీ రంగంలో కార్మికుల కొరత ఏర్పడిందని పలు నివేదికలు తెలుపుతున్నాయి. ఈ కారణంగా పరిస్థితులు మరింత దిగజారగ ముందే ట్రంప్ ఇలా మాట్లాడినట్టు సమాచారం.


