Africa: 2,800 ఏళ్ల క్రితమే 20 అంతస్తుల భవనాలా? | Africans build 20 storey skyscrapers 2800 years ago | Sakshi
Sakshi News home page

Africa: 2,800 ఏళ్ల క్రితమే 20 అంతస్తుల భవనాలా?

Oct 7 2026 8:46 AM | Updated on Oct 7 2026 8:46 AM

Africans build 20 storey skyscrapers 2800 years ago

సుమారు 2,800 ఏళ్ల క్రితమే తూర్పు ఆఫ్రికాలోని ఇథియోపియాలో భారీ బహుళ అంతస్తుల భవనాలు నిర్మించేవారని జర్మన్ పురావస్తు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అప్పట్లో ప్రస్తుత కాలంలో ఉపయోగించే ఇనుము ఉక్కు దూలాలు, బలమైన కాంక్రీట్ వంటి సాంకేతికతలు లేకపోయినా.. 19 అంతస్తుల వరకు భవనాలు నిర్మించడం సాధ్యమేనని తాజా అధ్యయనం వెల్లడించింది.

800 క్రీ.పూ. నాటి రాజభవనం
ఉత్తర ఇథియోపియాలోని టైగ్రే ప్రాంతంలో ఉన్న గ్రాట్ బీల్ గిబ్రి అనే పురాతన రాజభవనంపై పరిశోధకులు మరోసారి అధ్యయనం చేశారు. సుమారు 800 క్రీ.పూ. కాలంలో నిర్మించిన ఈ రాజభవనం ప్రస్తుతం శిథిలావస్థలో ఉంది. అప్పట్లో ఇది యెహా నగరానికి కేంద్రంగా ఉండేదని భావిస్తున్నారు. ఆ కాలానికి అసాధారణంగా భారీ, బహుళ అంతస్తుల నిర్మాణంగా ఇది ఉండేదని పరిశోధకులు చెబుతున్నారు.

196 అడుగుల విస్తీర్ణంలో నిర్మాణం
గ్రాట్ బీల్ గిబ్రి రాజభవనం సుమారు 196 అడుగుల పొడవు, 196 అడుగుల వెడల్పుతో విస్తరించి ఉండేదని అంచనా. ఆ కాలంలో ఈ ప్రాంతంలో ఇదే అతిపెద్ద రాజభవనంగా భావిస్తున్నారు. ప్రవేశద్వారం వద్ద ఉన్న ఒక స్తంభం సుమారు 33 అడుగుల ఎత్తు ఉండేదని అవశేషాల ఆధారంగా అంచనా వేశారు. అక్కడ లభించిన మెట్ల అవశేషాలను పరిశీలిస్తే భవనం కనీసం మూడు అంతస్తుల ఎత్తులో ఉండే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.

ఆ కాలంలోనే భారీ నిర్మాణాలు
ఆ కాలంలో తూర్పు ఆఫ్రికాలో ఎత్తైన భవనాలు ఉండేవనడానికి ఆధారాలు ఉన్నాయని పరిశోధకులు తెలిపారు. పురాతన గ్రంథాలు, చిత్రాల్లో 20 అంతస్తుల వరకు ఉన్న నిర్మాణాల ప్రస్తావనలు కనిపిస్తాయని పేర్కొన్నారు. దక్షిణ అరేబియాలో లభించిన రాతి కళా చిత్రాల్లో కనీసం తొమ్మిది అంతస్తుల భారీ నిర్మాణాలను పోలిన చిత్రాలు కూడా కనిపించాయి. అయితే అప్పట్లో బలమైన కాంక్రీట్, నిర్మాణ ఉక్కు వంటి ఆధునిక పదార్థాలు అందుబాటులో లేవు.

రాళ్లు, కలపతో ప్రత్యేక నిర్మాణ పద్ధతి
పురాతన నిర్మాణకారులు రాళ్లు, కలపను కలిపి ప్రత్యేక పద్ధతిలో గోడలను నిర్మించినట్లు అధ్యయనం వెల్లడించింది. రాళ్లతో నిర్మించిన గోడల మధ్య అడ్డంగా కలప దూలలను అమర్చేవారు. ఇది గోడలకు అదనపు బలాన్ని అందించేది. ఈ పద్ధతిని ‘టింబర్-లేస్డ్ మేసన్రీ’గా పిలుస్తారు. దక్షిణ అరేబియా, ఈశాన్య ఆఫ్రికాలోని కొన్ని ప్రాంతాల్లో ఆ కాలంలో ఈ నిర్మాణ పద్ధతి ఉపయోగించినట్లు ఆధారాలు ఉన్నాయి. ఆధునిక కాలంలోనూ ఎత్తైన భవనాల నిర్మాణంలో కలప ఆధారిత మిశ్రమ నిర్మాణ పద్ధతులు మళ్లీ ప్రాచుర్యంలోకి వస్తుండటం గమనార్హం.

3డీ నమూనాలతో 19 అంతస్తుల వరకు పరీక్ష
పరిశోధకులు గోడ మూలలు, తలుపుల నిర్మాణం తదితర ఆధారాలను సేకరించి 3డీ నమూనాలను రూపొందించారు. ఆ నమూనాలపై వివిధ నిర్మాణ పరిస్థితుల్లో భవనం ఎంత బరువును తట్టుకోగలదో పరీక్షించారు. భవనం కూలిపోయే స్థాయికి చేరుకునే వరకు అంతస్తుల సంఖ్యను పెంచుతూ అనేక సిమ్యులేషన్లు నిర్వహించారు. వాటిలో ఒక నమూనాలో 19 అంతస్తుల భవనం కూడా నిలబడే అవకాశం ఉన్నట్లు తేలింది. ఈ ఫలితాలు పురాతన లిఖిత ఆధారాలతో సరిపోలుతున్నాయని పరిశోధకులు తెలిపారు. అయితే అప్పటి నిర్మాణకారులు నిజంగానే 19 అంతస్తుల గరిష్ఠ స్థాయికి చేరుకున్నారా లేదా అన్నది మాత్రం స్పష్టంగా తెలియదని పేర్కొన్నారు.

ఇదీ చదవండి: సుప్రీం షాక్ దరిమిలా.. జ్ఞానేశ్‌ను ప్రభుత్వం ఏం చేయనుంది?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement