వాంకోవర్: కెనడాలోని వాంకోవర్‌లో పంజాబ్‌కు చెందిన 23 ఏళ్ల యువకుడు కాల్పుల్లో మృతి చెందాడు. లాంగ్లీ ప్రాంతంలోని 200 స్ట్రీట్, 60 అవెన్యూ సమీపంలోని ఓ వ్యాపార సముదాయం వద్ద అక్టోబర్ 5న ఈ ఘటన జరిగింది. రాత్రి 9:45 గంటల సమయంలో కాల్పుల సమాచారం అందడంతో లాంగ్లీ ఆర్‌సీఎంపీ పోలీసులు అక్కడికి చేరుకున్నారు. వ్యాపార సముదాయం పార్కింగ్ ప్రాంతంలో గాయాలతో ఉన్న యువకుడిని గుర్తించారు. ప్రాణాలు కాపాడేందుకు అత్యవసర సిబ్బంది ప్రయత్నించినప్పటికీ అతడు అక్కడికక్కడే మృతి చెందాడు.
ఈ ఘటన జరిగిన సుమారు 20 నిమిషాల తర్వాత 232 స్ట్రీట్, 75 అవెన్యూ ప్రాంతంలో ఓ వాహనానికి నిప్పంటించినట్లు పోలీసులకు సమాచారం అందింది. అక్కడ కాలిపోయిన సెడాన్ కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కాల్పుల ఘటనకు ఈ వాహనం ఉపయోగించి ఉండొచ్చని దర్యాప్తు అధికారులు భావిస్తున్నారు. రాయల్ కెనడియన్ మౌంటెడ్ పోలీస్‌కు చెందిన ఇంటిగ్రేటెడ్ హోమిసైడ్ ఇన్వెస్టిగేషన్ టీమ్ దర్యాప్తును చేపట్టింది. లాంగ్లీ ఆర్‌సీఎంపీ, ఫోరెన్సిక్ బృందం, బీసీ కరోనర్స్ సర్వీస్‌తో కలిసి అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.
ఘటనకు దారితీసిన పరిస్థితులు, హత్యకు గల కారణాలను తెలుసుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. అక్టోబర్ 5న రాత్రి 8:30 నుంచి 10:30 గంటల మధ్య 200 స్ట్రీట్, 60 అవెన్యూ పరిసరాల్లో ఉన్నవారు తమ వద్ద ఉన్న సమాచారం, వాహన డ్యాష్‌క్యామ్ దృశ్యాలను అందించాలని దర్యాప్తు అధికారులు కోరారు. మృతుడి గుర్తింపును ప్రాథమిక దర్యాప్తు పూర్తయ్యే వరకు పోలీసులు వెల్లడించలేదు. అయితే అతడు పంజాబ్‌కు చెందినవాడని అధికారులు తెలిపారు. ఈ హత్యకు ముఠాల మధ్య ఘర్షణలు కారణమై ఉండొచ్చనే అనుమానాన్ని కూడా దర్యాప్తు అధికారులు పరిశీలిస్తున్నారు.


