బర్త్‌డే పేరిట దోపిడీకి స్కెచ్‌ | - | Sakshi
Sakshi News home page

బర్త్‌డే పేరిట దోపిడీకి స్కెచ్‌

May 17 2026 11:29 AM | Updated on May 17 2026 11:29 AM

రిటైర్డ్‌ ప్రొఫెసర్‌ ఇంట్లో దోపిడీకి పాల్పడిన నలుగురి అరెస్ట్‌

పరారీలో అసలు సూత్రధారులు

పక్కా ప్లాన్‌తో వ్యవహరించిన నేపాలీ గ్యాంగ్‌

అల్వాల్‌: జవహర్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధి కౌకూర్‌లోని రిటైర్డ్‌ ప్రొఫెసర్‌ ఇంట్లో దోపిడీకి పాల్పడిన నేపాలీ గ్యాంగ్‌ను శనివారం పోలీసులు అరెస్ట్‌ చేశారు. నేరేడ్‌మెట్‌లోని కార్యాలయంలో మల్యాజిగిరి కమిషనర్‌ సుమతి శనివారం వివరాలు వెల్లడించారు. నేపాల్‌కు చెందిన మీనా అలియాస్‌ మమత, రాజేష్‌లు కొన్ని నెలల ముందు కౌకూర్‌లోని రిటైర్డ్‌ ప్రొఫెసర్‌ మురళీమోహన్‌, విజయలక్ష్మిల ఇంట్లో పని మనుషులుగా చేరారు. వారిద్దరు ఒంటరిగా ఉంటున్నారని, ఇంట్లో నగదు, బంగారం, వెండి ఉందని పసిగట్టారు. ఎలాగైనా సొత్తు దోచుకోవాలని భావించిన మమత నగరంలో మరోచోట పనిచేస్తున్న నేపాల్‌కు చెందిన రాజేష్‌, సబీనా, చాంగ్‌, సామ్రాట్‌, బిశ్వాల్‌, కమల్‌, శంకర్‌లతో కలిసి పథకం వేశారు.

ఈ నెల 11వ తేదీన తన పుట్టిన రోజని అబద్ధం చెప్పి మమత తన గ్యాంగ్‌తో కలిసి సర్వెంట్‌ క్వార్టర్స్‌లో వేడుకలను జరుపుకున్నారు. అనంతరం రాత్రి 8:30 గంటల సమయంలో ఈ గ్యాంగ్‌ ఇంట్లోకి ప్రవేశించి మురళీమోహన్‌, విజయలక్ష్మిలను బంధించి వారికి మత్తు పదార్థాలు ఇచ్చారు. అనంతరం ఇంట్లోని బీరువాలు పగులగొట్టి దాదాపు 60 తులాల బంగారం, 15 కేజీల వెండి, మూడు వేల డాలర్లను దోపిడీ చేశారు. తర్వాత ఆటోలో కొంతమంది, స్కూటర్‌పై మరికొంత మంది పరారై యాప్రాల్‌కు చేరుకున్నారు. అక్కడ స్కూటర్‌ విడిచిపెట్టి.. రెండు ట్యాక్సీలు మాట్లాడుకుని నేరుగా సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌కు చేరుకుని దేశం వదిలి నేపాల్‌ వెళ్లేందుకు ప్రయత్నించారు. ఈనేపథ్యంలో గతంలో మొయినాబాద్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో జరిగిన దొంగతనం కేసులో మీనా, రాజేష్‌లకు ప్రమేయం ఉన్నట్టు గుర్తించారు. ఘటన స్థలంలో జరిపిన వేలిముద్రల పరీక్షలో మీనా వేలిముద్రలు సరిపోలాయి. దీంతో దర్యాప్తు ముమ్మరం చేసిన పోలీసులు సునిత, బిశ్వాల్‌, కమల్‌ బహదూర్‌, శంకర్‌లు సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ వద్ద ఉన్నారని సమాచారం అందడంతో వారిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద దొంగిలించిన సొత్తును రికవరీ చేశారు. గ్యాంగ్‌ లీడర్‌ మమత, రాజేష్‌లతో పాటు మరికొంత మంది పరారీలో ఉన్నట్లు ఆమె తెలిపారు. వారిని త్వరలో అరెస్ట్‌ చేస్తామని పేర్కొన్నారు.

వందలకొద్దీ సీసీ కెమెరాల జల్లెడ

బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు ఆరు ప్రత్యేక బృందాలను ఏర్పాటుచేసి దేశంలోని సరిహద్దు ప్రాంతాలకు పంపించారు. దాదాపు 250కి పైగా సీసీటీవీ కెమెరాల ఫుటేజీలను పరిశీలించి, సాంకేతిక పరిజ్ఞానం, క్షేత్రస్థాయి సమాచారంతో ఐదు రోజుల పాటు నిరంతరాయంగా శ్రమించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement