ఒకేరోజు 3 అగ్నిప్రమాదాలు | - | Sakshi
Sakshi News home page

ఒకేరోజు 3 అగ్నిప్రమాదాలు

May 15 2026 12:25 PM | Updated on May 15 2026 12:25 PM

హైరైజ్‌ అపార్ట్‌మెంట్‌లో..

మన్సూరాబాద్‌: మన్సూరాబాద్‌ ఎంఈ రెడ్డి గార్డెన్స్‌ ఎదురుగా ఉన్న ట్రెడెంట్‌ నమశ్రీ హైరైజ్‌ అపార్ట్‌మెంట్‌లో గురువారం అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. 22 అంతస్తుల ఆపార్ట్‌మెంట్‌ 4వ అంతస్తులోని ఓ అపార్ట్‌మెంట్‌లో శ్రీకాంత్‌ కుటుంబంతో నివాసముంటున్నారు. సాయంత్రం నివాసితులు దేవుడి గదిలో దేవుడి దీపం పెట్టి బయటకు వెళ్లారు.అయితే దీపం అంటుకుని మంటలు ఎగిసిపడ్డాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక అధికారులు సంఘటన స్థలానికి చేరుకుని మంటలను ఆర్పారు.

హయత్‌నగర్‌లో..

హయత్‌నగర్‌: విద్యుదాఘాతం కారణంగా రెండు షాపులు దగ్ధమయ్యాయి. హయత్‌నగర్‌ పోలీసులు తెలిపిన మేరకు.. పోలీస్‌ స్టేషన్‌ పక్కన ఉన్న ఉగాది కాంప్లెక్స్‌ దుకాణాల సముదాయంలో జయశ్రీ ఎలక్ట్రికల్‌ అండ్‌ హార్డ్‌వేర్‌ షాపు, లక్ష్మీనర్సింహా కార్‌ డెకర్స్‌, ఒక ఫర్నిచర్‌ షాపులు ఉన్నాయి. విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగా ఎలక్ట్రిక్‌ షాపులో అగ్నిప్రమాదం సంభవించింది. దీంతో మంటలు పక్కనే ఉన్న రెండు షాపులతోపాటు ఫర్నిచర్‌ దుకాణానికి అంటున్నాయి. అగ్నిమాపక సిబ్బంది చేరుకుని మంటలను ఆర్పివేశారు.

కోకాపేటలో

మణికొండ: పూజకోసం వెలిగించిన దీపం అంటుకోవడంతో మంటలు ఇల్లంతా వ్యాపించాయి. కోకాపేట రాజీవ్‌ గృహకల్పలో గురువారం రాత్రి ఈ సంఘటన జరిగింది. ఇంట్లో వంట చేస్తున్న క్రమంలో మంటలు అధికంగా వచ్చి పక్కనే ఉన్న కర్టెన్‌లకు అంటుకుని ఇల్లంతా వ్యాపించాయి. యూపీకి చెందిన ప్రవీణ్‌ కుమార్‌సింగ్‌ కుటుంబం అందులో అద్దెకు ఉంటోంది. ఈ ప్రమాదంలో ఇంట్లో ఉన్న వస్తువులన్నీ కాలిపోయాయి. అగ్నిమాపక శాఖ సిబ్బందికి సమాచారం ఇవ్వటంతో వారు వచ్చి మంటలను అదుపుచేశారు.

మహానగరంలో మూడు ప్రాంతాల్లో అగ్నిప్రమాదాలు జరిగాయి. మన్సూరాబాద్‌, కోకాపేట్‌, హయత్‌నగర్‌ ప్రాంతాల్లో ఈ సంఘటనలు జరిగాయి. అదృష్టవశాత్తు ఎక్కడా ప్రాణనష్టం జరగలేదు.

Advertisement
 
Advertisement
Advertisement