డీజీపీకి పలువురి వినతిపత్రం
సాక్షి, హైదరాబాద్: కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్‌పై నమోదైన పొక్సో కేసులో వెంటనే అరెస్ట్ చేసి కస్టడీలోకి తీసుకోవాలని విద్యార్థి, మహిళా సంఘాల ప్రతినిధులు డీజీపీ సీవీ ఆనంద్‌ను గురువారం కలిసి వినతిపత్రం సమర్పించారు. పోలీసులు నోటీసులు జారీ చేసినప్పటికీ బండి భగీరథ్ విచారణకు హాజరు కాకుండా పరారీలో ఉన్నారని, ఆరు రోజులుగా అరెస్ట్ చేయకపోవడం అనుమానాలకు తావిస్తోందని నేతలు పేర్కొన్నారు. ఏఐఎస్‌ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కసిరెడ్డి మణికంఠ రెడ్డి, కార్యదర్శిపుట్ట లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.
ప్రజా సంఘాల ఆందోళన
కుత్బుల్లాపూర్: బాలికపై ఘాయిత్యానికి పాల్పడిన బండి భగీరథ్‌ను వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని, బండి సంజయ్‌ను భర్తరఫ్ చేయాలని ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి, డీవైఎఫ్‌ఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆనగంటి వెంకటేష్ డిమాండ్ చేశారు. గురువారం ఎస్‌ఎఫ్‌ఐ, డీవైఎఫ్‌ఐ, ఐద్వా ఆధ్వర్యంలో పేట్‌బషీరాబాద్ పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నా చేశారు. ప్రభుత్వం, పోలీసులుబండి సంజయ్ కుటుంబానికి కొమ్ముకాస్తున్నట్లు కనిపిస్తోందన్నారు. ఐద్వా రాష్ట్ర ఉపాధ్యక్షులు కె.ఎన్ అశాలత, ప్రజా సంఘాల నాయకులు ఐలాపురం రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.


