సైబర్ నేరగాళ్లకు అడ్డాగా మారిన ఆ దేశం
● టెలిగ్రాం గ్రూపుల ద్వారా నగరంలోని దళారులకు ఎర
● వీరి సాయంతో బ్యాంకుల్లో కరెంట్ ఖాతాలు
సాక్షి, సిటీబ్యూరో: రాష్ట్రంలో ప్రతి మూడు సైబర్‌నేరాల్లో రెండు.. కాంబోడియా కేంద్రంగానే సాగుతున్నాయి. హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ఈ ఏడాది ఫిబ్రవరి, గతవారం ఆక్టోపస్ పేరుతో చేపట్టిన ఆపరేషన్లతోపాటు రాష్ట్రవ్యాప్తంగా ఇటీవల కాలంలో నమోదైన సైబర్ నేరాల దర్యాప్తు సైతం ఇదే విషయాన్ని స్పష్టం చేస్తోంది. కీలక సూత్రధారులు అంతా ఆ దేశంతోపాటు మయన్మార్‌లో ఉంటుండగా.. టెలిగ్రాం గ్రూపుల ద్వారా పాత్రధారులను ఎంపిక చేసుకుని కథ నడిపిస్తున్నట్లు వెలుగులోకి వచ్చింది. బ్యాంకు అధికారుల నిర్లక్ష్యం, బ్యాంకింగ్ విధానాల్లో లోపాలు సైతం వీరికి కలిసివస్తున్నాయి. ‘ఆపరేషన్ ఆక్టోపస్–2.0’లో హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేసిన 52 మంది నిందితుల్లో 32 మంది బ్యాంకు అధికారులే ఉండటం గమనార్హం. ఈ అంశాలను వివరిస్తూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ)కు హైదరాబాద్ పోలీసులు లేఖ రాస్తున్నారు. బుధవారం వివిధ బ్యాంకుల రీజినల్ హెడ్స్‌తో సమావేశం నిర్వహించనున్నారు.
ఇక్కడి నుంచే కార్డులు, కాలర్లు...
కాంబోడియాలో ఉన్న సూత్రధారులు నగరం నుంచే సిమ్‌కార్డులు, కాల్ సెంటర్‌లో పనిచేసే టెలీకాలర్లను తీసుకువెళ్తున్నారు. ప్రీ యాక్టివేటెడ్ సిమ్‌కార్డుల ద్వారా వాట్సాప్ యాక్టివేట్ చేసుకుని, కాంబోడియా నుంచే టెలీకాలర్ల ద్వారా ఫోన్లు చేయించి బాధితుల నుంచి నగదు కాజేస్తున్నారు. వీరి నుంచి డబ్బు డిపాజిట్‌కు, ఆ మొత్తం విత్‌డ్రాకు, క్రిప్టో కరెన్సీగా మార్చడానికి వీరికి మ్యూల్ ఖాతాలు అనివార్యం. టెలిగ్రాం గ్రూపుల ద్వారా ప్రచారం చేస్తూ కమీషన్ ఆశ చూపి ఎంపిక చేసుకుంటున్నారు. బాధితులు ఈ ఖాతాల్లో డిపాజిట్ చేసే డబ్బు నుంచి ఖాతాదారుడు, దళారి తమ కమీషన్లు తీసుకుంటున్నారు. మిగిలిన మొత్తాన్ని క్రిప్టో కరెన్సీగా మార్చి విదేశాలకు తరలించేందుకు ప్రత్యేక నెట్‌వర్క్ పని చేస్తోందని పోలీసులు చెప్తున్నారు. సైబర్ నేరాలకు చెక్ చెప్పడానికి ఇటీవల కాంబోడియాలో అమలులోకి వచ్చిన కొత్త చట్టం ఉపకరిస్తుందని భావిస్తున్నారు. వ్యవస్థీకృతంగా ఈ దందా చేస్తే పదేళ్లు, అంతకంటే ఎక్కువ జైలు, 2.5 లక్షల డాలర్ల జరిమానా విధిస్తారు.
అరెస్టు అయిన బ్యాంకు అధికారులు..
హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేసిన బ్యాంకు అధికారుల్లో ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, బంధన్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఫెడరల్ బ్యాంక్, ఐడీఎఫ్‌సీ బ్యాంక్, ఇండస్ ఇండ్ బ్యాంక్, కర్ణాటక బ్యాంక్, కరూర్ వైశ్య బ్యాంక్, ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌లకు చెందిన మేనేజ ర్లు, కేవైసీ అప్రూవర్, క్లర్కులు, ఫీల్డ్ ఆఫీసర్లు ఉన్నారు. వీరి పాత్రను వివరిస్తూ ఆయా బ్యాంకులకు పోలీసు అధికారులు లేఖలు రాశారు.


