ఆర్టీఏ ఆఫీసులతో ట్రా‘ఫికర్‌’! | - | Sakshi
Sakshi News home page

ఆర్టీఏ ఆఫీసులతో ట్రా‘ఫికర్‌’!

Nov 7 2025 8:01 PM | Updated on Nov 7 2025 8:01 PM

ఆర్టీఏ ఆఫీసులతో ట్రా‘ఫికర్‌’!

ఆర్టీఏ ఆఫీసులతో ట్రా‘ఫికర్‌’!

సాక్షి, సిటీబ్యూరో: రహదారి భద్రతకు సంబంధించిన అంశాలను ట్రాఫిక్‌ పోలీసులతో పాటు రోడ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ అథారిటీ (ఆర్టీఏ) విభాగమూ పర్యవేక్షిస్తుంటుంది. నగరంలోని అనేక ఆర్టీఏ కార్యాలయాలు ట్రాఫిక్‌ జాంలకు కేరాఫ్‌ అడ్రస్‌గా మారాయి. అద్దె భవనాలతో పాటు సొంత భవనాల్లో నడుస్తున్న వాటి పరిస్థితీ ఇంతే. ప్రధాన రహదారులపై ఉన్న కొన్ని కార్యాలయాలకు వచ్చే వాహనాలకు సంబంధించి కొన్ని పరీక్షల్నీ రోడ్డుపై నిర్వహిస్తూ ఆ మార్గంలో ప్రయాణించే వాహన చోదకులకు నరకం చూపిస్తున్నారు. దీనిపై అటు ఆర్టీఏ విభాగం, ఇటు ట్రాఫిక్‌ పోలీసులు సైతం దృష్టి పెట్టట్లేదు.

స్థలం ఉన్నా దళారుల్ని అరికట్టే ఉద్దేశంతో..

నిత్యం ఆర్టీఏ కార్యాలయాలకు కొత్త వాహనాల రిజిస్ట్రేషన్‌, ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్‌, డ్రైవింగ్‌ లైసెన్సు తదితరాలతో పాటు రెన్యువల్స్‌ కోసం అనేక మంది వస్తుంటారు. రిజిస్ట్రేషన్‌ వంటి వాహనానికి సంబంధించిన పనులపై వచ్చే వాళ్లు వాహనాలు తీసుకువస్తారు. డ్రైవింగ్‌ లైసెన్సు సహా ఇతర పనులపై వచ్చే వారిలో కొందరు తమ వాహనాలపై, మరికొందరు ఇతరులతో కలిసి వస్తుంటారు. కొన్నాళ్లుగా దళారులను కట్టడి చేసే ఉద్దేశంతో ఆర్టీఏ విభాగం కేవలం దరఖాస్తుదారుడిని మాత్రమే లోపలికి అనుమతిస్తోంది. దీంతో వారితో వచ్చిన వాళ్లు అనివార్యంగా బయటే ఆగిపోతున్నారు. ఇలా వచ్చే వారి వాహనాలు పెట్టుకోవడానికి అనేక కార్యాలయాల్లో పార్కింగ్‌ లేదు. ఈ సౌకర్యం ఉన్న వాటిలోకీ సందర్శకులు, కొన్ని సందర్భాల్లో దరఖాస్తుదారుల వాహనాలూ రోడ్డు పక్కనే ఆపాల్సి వస్తోంది.

అక్రమ పార్కింగ్‌ పేరుతో బాదుడు..

ఆర్టీఏ కార్యాలయం వద్ద రోడ్డుపై వాహనాలు ఆపడంతో ఆయా చోట్ల తీవ్ర ట్రాఫిక్‌ జామ్స్‌ ఏర్పడుతున్నాయి. ప్రధానంగా పీక్‌ అవర్స్‌గా పిలిచే రద్దీ వేళల్లో ఈ ఇబ్బంది మరీ ఎక్కువగా ఉంటోంది. నగరంలోని ఇతర ఆర్టీఏ కార్యాలయాల కంటే టోలిచౌకి, మూసారాంబాగ్‌, మల్కాజిగిరి, కూకట్‌పల్లి, కొండాపూర్‌, మేడ్చల్‌ ప్రాంతాల్లో పరిస్థితులు మరీ దారుణంగా ఉంటున్నాయి. వీటిలో కొన్ని కార్యాలయాల వద్ద రహదారిపైనే వాహనాలకు సంబంధించిన ఫిట్‌నెట్‌ టెస్ట్‌లతో పాటు ఛాసిస్‌, ఇంజిన్‌ నెంబర్లను సరిచూసే ప్రక్రియలు సైతం నడుస్తుండటం గమనార్హం. అనుమతి లేక, స్థలాభావం వల్లో ఆయా ఆర్టీఏ కార్యాలయాలకు వచ్చే దరఖాస్తుదారులు, వారి సహాయకుల వాహనాలను రోడ్డు మీదే ఆపాల్సి వస్తోంది. ఆయా మార్గాల్లో ప్రత్యేక డ్రైవ్స్‌ నిర్వహించే ట్రాఫిక్‌ పోలీసులు ఈ వాహనాల ఫొటోలు తీస్తున్నారు. ఆపై అక్రమ పార్కింగ్‌ అంటూ ఈ–చలాన్లు జారీ చేస్తున్నారు.

ఇప్పటికీ అనేకం అద్దె భవనాల్లోనే..

నగరంలో కాదు.. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆర్టీఏ కార్యాలయాల్లో అనేకం ఇప్పటికీ అద్దె భవనాల్లోనే కొనసాగుతున్నాయి. రాష్ట్రంలో మొత్తం 63 ఆర్టీఏ కార్యాలయాలు ఉండగా వీటిలో 31 అద్దె భవనాల నుంచే కార్యకలాపాలు సాగిస్తున్నాయి. అలాగే గ్రేటర్‌ పరిధిలో 17 కార్యాలయాలు ఉండగా.. వీటిలో ఐదు అద్దె భవనాల్లోనే ఉన్నాయి. నిత్యం ఆదాయం ఆర్జించే ఆర్టీఏ కార్యాలయాలకు సొంత భవనాల ఏర్పాటుకు ప్రాధాన్యం ఇవ్వాలనే డిమాండ్‌ వినిపిస్తోంది. ప్రతి భవనానికీ కచ్చితంగా పార్కింగ్‌తో పాటు వాహనాల పరీక్షలు నిర్వహించడానికి ప్రత్యేక ప్రదేశం ఉండేలా చర్యలు తీసుకోవాలి. రహదారులపై పార్క్‌ చేయించాల్సి వచ్చినప్పుడు ఆ మార్గంలో ప్రయాణించే వాహనచోదకులకు ఇబ్బందులు కలగకుండా ఆర్టీఏ అధికారులు స్థానిక ట్రాఫిక్‌ పోలీసులతో కలిసి చర్యలు తీసుకోవాలి. ఇలాంటి వాహనాలపై ఈ–చలాన్లు జారీ కాకుండా చూడాలి.

సరైన పార్కింగ్‌ వసతి లేక రోడ్డుపైనే వాహనాలు

ఫలితంగా సమీప రహదారుల్లో నిత్యం ట్రాఫిక్‌జాంలు

ప్రత్యామ్నాయ మార్గాలు పట్టని ప్రభుత్వ విభాగాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement