స్మార్ట్ కార్డుల్లేవ్
సాక్షి, సిటీబ్యూరో: ఆర్టీఏలో స్మార్ట్‌కార్డుల కొరత మళ్లీ మొదటికొచ్చింది. నగరంలోని పలు ప్రాంతీయ రవాణా కార్యాలయాల్లో రెండు నెలలుగా స్మార్ట్‌కార్డుల రూపంలో జారీ చేసే డ్రైవింగ్ లైసెన్సులు, ఆర్సీల పంపిణీ నిలిచిపోయింది. కార్డులను ముద్రించి వాహనదారులకు అందజేసేందుకు అవసరమైన రిబ్బర్ కొరత వల్లే కార్డుల ప్రింటింగ్ ఆగిపోయినట్లు అధికారులు తెలిపారు. 2 నెలల క్రితమే ఈ సమస్య తలెత్తినప్పటికీ.. ఇప్పటి వరకు పరిష్కారం దిశగా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దీంతో సాక్షాత్తు రవాణా కమిషనర్ కొలువుదీరే ఖైరతాబాద్ కేంద్ర కార్యాలయంతో పాటు నగరంలోని పలు ఆర్టీఓ కేంద్రాల్లో వేల సంఖ్యలో స్మార్ట్ కార్డుల పంపిణీ నిలిచిపోయినట్లు సమాచారం. మరోవైపు డ్రైవింగ్ పరీక్షలకు హాజరైన వాళ్లు, కొత్తగా వాహనాలను నమోదు చేసుకొన్న వాహనదారులు ఈ రెండు నెలలుగా తమ లైసెన్సులు, రిజిస్ట్రేషన్ కార్డు (ఆర్సీ)ల కోసం పడిగాపులు కాస్తున్నారు.
పదే పదే ఎందుకిలా?
● స్మార్ట్‌కార్డుల కోసం వినియోగించే రిబ్బన్, ప్రింటింగ్ పేపర్ తదితర సామగ్రిని రవాణా శాఖ ప్రైవేట్ సంస్థల నుంచి కొనుగోలు చేస్తోంది. ఇందుకోసం కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఎంపికై న సంస్థలు ఈ ముడిసరుకులను అందజేస్తున్నాయి. కానీ కాంట్రాక్ట్ సంస్థలకు సకాలంలో నిధులు చెల్లించకపోవడంతో కార్డులప్రింటింగ్‌కు అవసరమైన వస్తువులు దిగుమతి కావడం లేదు. దీంతో ఆకస్మాత్తుగా కొరత సమస్య తతెత్తుతోంది. గత ఐదేరాళ్లలో పలు సంస్థలతో రవాణాశాఖ ఒప్పందం ఏర్పాటు చేసుకుంది. నిధులు చెల్లించినప్పటికీ ప్రింటింగ్ వస్తువుల సరఫరాలో నిర్లక్ష్యం చూపిన సంస్థలతో ఒప్పందాన్ని రద్దు చేసుకుంది. అయినప్పటికీ స్మార్ట్‌కార్డుల కొరత సమస్య పదే పదే తలెత్తుతూనే ఉంది.
● గ్రేటర్ పరిధిలోని ఖైరతాబాద్, సికింద్రాబాద్, మలక్‌పేట్, నాగోల్, ఉప్పల్, మణికొండ, కొండాపూర్, మెహిదీపట్నం, ఇబ్రహీంపట్నం, మేడ్చల్, బండ్లగూడ తదితర ప్రాంతీయ కార్యాలయాల్లో ప్రతిరోజు సుమారు 2,500కుపైగా డ్రైవింగ్ లైసెన్సులు, ఆర్సీలు, ఇతర డాక్యుమెంట్స్ ప్రింట్ చేసి వాహనదారులకు పోస్టు ద్వారా అందజేయాల్సి ఉంటుంది. కానీ ప్రస్తుతం రిబ్బన్‌తో పాటు ఇతర వస్తువులు నిల్వ ఉన్న చోట కార్డుల ప్రింటింగ్, పంపిణీ కొనసాగుతోంది. ఇవి నిల్వలేని చోట కొరత కొనసాగుతోంది.
అడ్డగోలుగా అమ్మకాలు
ఒకవైపు స్మార్ట్‌కార్డుల కోసం డిమాండ్, కొరత సమస్య ఇలా ఉండగా.. కొన్ని ప్రాంతీయ రవాణా కార్యాలయాల్లో సిబ్బంది యథేచ్ఛగా చేతివాటం ప్రదర్శించడం గమనార్హం. నిబంధనల మేరకు వాహనదారులకు స్మార్ట్‌కార్డులను స్పీడ్‌పోస్టు ద్వారా అందజేయాల్సి ఉంటుంది. రికార్డుల్లో సదరు డాక్యుమెంట్‌లను పోస్టు చేసినట్లుగా నమోదు చేస్తున్నారు. తర్వాత దళారుల ద్వారా వాహనదారులకు విక్రయిస్తున్నారు. ఇబ్రహీంపట్నం, సికింద్రాబాద్, బండ్లగూడ తదితర కార్యాలయాల్లో స్మార్ట్‌కార్డుల దందా కొనసాగుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఒక్కో కార్డుకు రూ.200 నుంచి రూ.300 చొప్పున విక్రయిస్తున్నారు. ఇదో వ్యవస్థీకృత కార్యకలాపంగా జరుగుతున్నప్పటికీ రవాణాశాఖ ఉన్నతాధికారులు ఏ మాత్రం పట్టించుకోవడం లేదు.
రెండు నెలలుగా నిలిచిపోయిన డ్రైవింగ్ లైసెన్సులు, ఆర్సీలు
రిబ్బన్ కొరత కారణంగా కార్డుల ప్రింటింగ్‌కు కటకట
ఆర్టీఏ కార్యాలయాల చుట్టూ వాహనదారుల ప్రదక్షిణలు


