
నల్లా బిల్లులపై నజర్!
సాక్షి, సిటీబ్యూరో: మహా నగరానికి తాగునీరు, సీవరేజీ సేవలందిస్తున్న జలమండలి ఆర్థికంగా బలోపేతమయ్యేందుకు ఆదాయ వనరులపై దృష్టి సారించింది. పేరుకుపోతున్న పెండింగ్ బిల్లుల వసూలుకు సిద్ధమవుతోంది. రూ.1000 నుంచి ఆపై పెండింగ్ ఉన్న నల్లా కనెక్షన్లపై స్పెషల్ డ్రైవ్‌కు సిద్ధమైంది. బకాయిదారులు స్పందించని పక్షంలో నల్లా కనెక్షన్‌కు నీటి సరఫరా నిలిపివేయాలని యోచిస్తోంది. కాగా.. కనెక్షన్‌దారులకు ముందస్తుగా పెండింగ్ బకాయిలపై పూర్తి స్థాయి అవగాహన ఉండేలా బిల్లుల జారీకి సిద్ధమైంది.
జీఐఎస్‌తో పర్యవేక్షణ
నల్లా కనెక్షన్‌దారులకు మీటర్ బిల్లుల జారీ మిషన్లను జీఐఎస్‌తో అనుసంధానం చేసి డ్యాష్ బోర్డు ద్వారా జలమండలి పర్యవేక్షిస్తోంది. ప్రతి నెలా ఒకటి నుంచి పదో తేదీలోగా బిల్లులు జారీ చేసేవిధంగా చర్యలు చేపట్టనుంది. ప్రధానంగా పెండింగ్ బకాయిలపై దృషి సారించి బిల్లుల జారీని పర్యవేక్షించనుంది. సర్కిళ్లవారీగా బకాయి కనెక్షన్లకు బిల్లులు జారీ అయ్యాయా? లేదా? అని పరిశీలిస్తోంది. లేనిపక్షంలో బిల్లు జారీ చేసేలా ఆదేశాలు జారీ చేస్తోంది. కనెక్షన్ల దారులకు బకాయిలపై అవగాహన కల్పించిన తర్వాత నోటీసులు ఇవ్వడం.. ఆ తర్వాత కనెక్షన్ తొలగించే ప్రక్రియ కొనసాగించాలని యోచిస్తోంది.
బల్క్ కనెక్షన్ల బకాయిలే అధికం
జలమండలికి బల్క్ కనెక్షన్ల బకాయిలు అధికంగా ఉన్నట్లు తెలుస్తోంది. బల్క్ కనెక్షన్ల మొత్తం బకాయిలు రూ.1,310 కోట్లు, గృహ నల్లాల కనెక్షన్ల పెండింగ్ బిల్లులు రూ.828 కోట్లు, వాణిజ్య కనెక్షన్ల నుంచి రూ.336 కోట్లు, పరిశ్రమలు నుంచి రూ.282 కోట్ల వసూలు కావాల్సి ఉంది. కాలనీల కనెక్షన్ల నుంచి రూ.138 కోట్లు, మురికి వాడల కనెక్షన్ల నుంచి రూ.106 కోట్లు వసూలు కావాల్సి ఉంది.
నెలకు రూ.130 కోట్ల లోటు..
జలమండలికి నెలవారీగా నీటి బిల్లులు, నల్లా కనెక్షన్లు, వాటర్ ట్యాంకర్ల రూపంలో రూ.130 కోట్ల మేర ఆదాయం వస్తుండగా.. ఖర్చులు మాత్రం రెట్టింపు స్థాయిలో రూ.260 కోట్లు అవుతున్నట్లు తెలుస్తోంది. ప్రతి నెలా రూ.130 కోట్ల లోటుతో ఆర్థికంగా సతమతమవుతోంది. దీంతో పెండింగ్ బకాయిల వసూలుకు స్పెషల్ డ్రైవ్ చేపట్టనుంది.
వాటర్ ‘మీటర్ బిల్లింగ్’పై స్పెషల్ డ్రైవ్
రూ.1000 దాటిన బకాయిలపై దృష్టి
ఆర్థిక బలోపేతానికి జలమండలి యోచన