
సాక్షి, హైదరాబాద్: గత రెండు నెలలుగా యూరియా కోసం రైతులు ఇబ్బందులు పడుతున్నారని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. బుధవారం ఆయన నందినగర్‌లో మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వం తీరు వల్లే రైతులు ఇబ్బందులు పడుతున్నారని.. ముందస్తు చర్యలు తీసుకోలేదన్నారు. పోలీసులను పెట్టి ఎరువులను అమ్మే పరిస్థితి వచ్చిందంటూ ప్రభుత్వాన్ని కేటీఆర్ నిలదీశారు.
‘‘తెలంగాణలో మళ్లీ యూరియా కష్టాలు మొదలయ్యాయి. మా పాలనలో యూరియా కష్టాలు రాకుండా సరఫరా చేశాం. కాంగ్రెస్ ప్రభుత్వం అవగాహన రాహిత్యంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. కేసీఆర్ పదేళ్ల పాలనలో ఎరువుల కొరత లేదు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఈ పరిస్థితి ఎందుకొచ్చింది?. రేవంత్ ప్రభుత్వానికి పరిపాలనపై అవగాహన లేదు’’ అని కేటీఆర్ విమర్శలు గుప్పించారు.
‘‘వర్షంలో తడుచుకుంటూ ఎరువుల కోసం రైతులు లైన్లలో నిల్చుంటున్నారు. రైతులకు మాత్రం ఎరువుల కొరత లేదని సీఎం చెప్తున్నారు. కాంగ్రెస్ చేతకానితనంతో రైతులు ఇబ్బందిపడుతున్నారు. రేవంత్‌కు చిల్లర రాజకీయాలు చేయడం మాత్రమే తెలుసు’’ అంటూ కేటీఆర్ దుయ్యబట్టారు.