
కేటీఆర్ ఆరోపణ
సాక్షి, హైదరాబాద్: జంట నగరాల్లో సిటీ బస్సు కనీస చార్జీల పెంపు నిర్ణయం హైదరాబాద్ ప్రజలపై కాంగ్రెస్ కక్ష సాధింపు చర్య అని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.తారకరామారావు ఆరోపించారు. గత ఎన్నికల్లో జంట నగరాల్లో కాంగ్రెస్ పార్టీని తిరస్కరించారన్న కసితోనే ఈ చర్యలకు దిగుతున్నారని విమర్శించారు. పేద, మధ్యతరగతి ప్రయాణికుల జేబులను గుల్ల చేసేందుకే జంట నగరాల్లో సిటీ బస్సు కనీస చార్జీలను ఏకంగా రూ.10 పెంచాలని రేవంత్‌రెడ్డి సర్కారు నిర్ణయం తీసుకుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలతో ఇప్పటికే అల్లాడుతున్న ప్రజలపై ఈ చార్జీల పెంపు పిడుగులాంటిదని, ప్రతి ప్రయాణికుడిపై నెలకు కనీసం రూ.500 అదనపు భారం పడుతుందన్నారు. సిటీలో బస్సు చార్జీల పెంపు నిర్ణయాన్ని ఖండిస్తూ కేటీఆర్ ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. బస్సు చార్జీల పెంపు రేవంత్ అసమర్థ పాలనకు నిదర్శనమన్నారు. ఉచిత బస్సు పథకంతో ఆర్టీసీని దివాలా తీయించిన కాంగ్రెస్, ఇప్పుడు సామాన్యుల నడ్డి విరవాలని చూస్తోందని ఆయన ధ్వజమెత్తారు.