
ఢిల్లీలో అధికారులు, న్యాయవాదులతో భేటీ అయిన డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు పొన్నం, శ్రీహరి
స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లపై నేడు సుప్రీంకోర్టు విచారణ
సుప్రీం ఏం చెబుతుందోనన్న దానిపై చర్చోపచర్చలు
మొత్తం కోటా 50% మించకూడదని గతంలో సుప్రీం స్పష్టీకరణ
రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవోతో 42% కోటా కల్పన సాధ్యమవుతుందా? అనే సందేహం
సీఎం రేవంత్‌తో డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి పొన్నం, పీసీసీ చీఫ్ మహేశ్‌గౌడ్ భేటీ
ప్రభుత్వం తరఫున కోర్టులో బలమైన వాదనలు విన్పించాలని నిర్ణయం
న్యాయవాదులకు వివరించాల్సిన అంశాలపై ముఖ్యమంత్రి దిశానిర్దేశం
హుటాహుటిన ఢిల్లీకి భట్టి, పొన్నం, వాకిటి శ్రీహరి... అధికారులతో కలిసి న్యాయవాదులతో చర్చలు
సర్కారు తరఫున వాదనలు విన్పించనున్న సింఘ్వీ, సిద్ధార్ధ దవే
మరోవైపు బీసీ సంఘాల ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో అఖిలపక్షం భేటీ
తమ రిజర్వేషన్లు అడ్డుకుంటే సహించేది లేదంటున్న నేతలు
నేడు బీసీ సంఘాల జేఏసీ సమావేశం
సాక్షి, హైదరాబాద్/ సాక్షి, న్యూఢిల్లీ: స్థానిక సంస్థల ఎన్నికల్లో వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్ల అంశం రాజకీయంగా ఉత్కంఠ రేకెత్తిస్తోంది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో నంబర్ 9 జారీ చేయడం, అనంతరం స్థానిక ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ఇచ్చిన దరిమిలా హైకోర్టుతో పాటు సుప్రీంకోర్టులోనూ జీవో కొట్టివేయాలని కోరుతూ పిటిషన్లు దాఖలైన విషయం విదితమే. కాగా వాటిపై విచారణ జరగనుండటంతో కోర్టులు ఏం చెబుతాయోనన్న చర్చ పార్టీల్లో జరుగుతోంది.
ముఖ్యంగా రిజర్వేషన్లు 50 శాతం మించకూడదంటూ గతంలో సుప్రీంకోర్టు పరిమితి విధించగా..ఇప్పుడదే సర్వోన్నత న్యాయస్థానంలో సోమవారం బీసీ రిజర్వేషన్ల సంబంధిత పిటిషన్ విచారణకు రానుండడంతో.. న్యాయస్థానం ఏం తీర్పునిస్తుంది? ఆ తీర్పు భవిష్యత్తులో రిజర్వేషన్లపై ఎలాంటి ప్రభావం చూపుతుందనే ఆసక్తి నెలకొంది.
ఒకవేళ హైకోర్టులో కూడా కేసు ఉన్నందున తొలుత అక్కడ విచారణ కొనసాగనివ్వాలని సుప్రీంకోర్టు చెపితే ఈ నెల 8వ తేదీన విచారణ సందర్భంగా హైకోర్టులో ఏం జరుగుతుంది? బీసీలకు 42% రిజర్వేషన్ల కల్పన ఓకే అవుతుందా? అసలు స్థానిక సంస్థలకు ఎన్నికలు జరుగుతాయా..? వాయిదా పడతాయా..? అనే చర్చ రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జరుగుతోంది.
అటు ప్రభుత్వం.. ఇటు కాంగ్రెస్ బిజీ
బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లు ఎట్టి పరిస్థితుల్లోనూ అమలు చేయాలనే పట్టుదలతో ఉన్న రాష్ట్ర ప్రభుత్వం, అధికార కాంగ్రెస్ పార్టీ.. సుప్రీం విచారణ నేపథ్యంలో అప్రమత్తమయ్యాయి. ఆదివారం మధ్యాహ్నం దీనిపై రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి నివాసంలో కీలక భేటీ జరిగింది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్, టీపీసీసీ చీఫ్, ఎమ్మెల్సీ బి.మహేశ్‌కుమార్‌గౌడ్‌లు పాల్గొన్నారు. సుప్రీంకోర్టులో వాదనలకు సంబంధించిన కార్యాచరణపై సీఎం ఈ సందర్భంగా దిశానిర్దేశం చేసినట్టు సమాచారం. ప్రభుత్వం తరఫున బలమైన వాదనలు వినిపించేలా చూడాలని ఆయన సూచించినట్లు తెలిసింది.
రిజర్వేషన్ల పరిమితి విషయంలో గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలను ప్రభుత్వం అనుసరించిందనే విషయంతో పాటు రిజర్వేషన్లకు సంబంధించి రాష్ట్రపతి, గవర్నర్‌కు పంపిన ఆర్డినెన్సు, బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని, ప్రభుత్వ ఆలోచనకు రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలు అసెంబ్లీ సాక్షిగా మద్దతిచ్చాయని, ఈ విషయంలో రాజకీయ ఏకాభిప్రాయం ఉందనే విషయాన్ని స్పష్టంగా సుప్రీం దృష్టికి తీసుకెళ్లాలని చెప్పినట్టు తెలిసింది. మరోవైపు సుప్రీంకోర్టులో ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించనున్న సీనియర్ న్యాయవాదులు అభిషేక్ మను సంఘ్వీ, సిద్దార్ధ దవేలతో కూడా ముఖ్యమంత్రి ఫోన్‌లో మాట్లాడారు. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు హైకోర్టు గడువు విధించడాన్ని, ఇతర అంశాలను ఆయన వివరించినట్లు తెలిసింది.
కాంగ్రెస్ కార్యాచరణ
ఈ సమావేశం అనంతరం ప్రజాభవన్‌లో రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్‌తో భట్టి విక్రమార్క, పొన్నం ప్రభాకర్, మహేశ్‌గౌడ్‌తో పాటు మంత్రి వాకిటి శ్రీహరి సమావేశమయ్యారు. పార్టీ పరంగా ఏం చేయాలన్న దానిపై చర్చించారు. సుప్రీంకోర్టులో తమ వాదనలు కూడా గట్టిగా వినిపించాలని నిర్ణయించారు. ఈ మేరకు ఢిల్లీలో సమన్వయం చేసుకునే బాధ్యతలను డిప్యూటీ సీఎంకు అప్పగించారు. ఈ నేపథ్యంలో ఆయనతో పాటు ఇద్దరు మంత్రులు ఆదివారం రాత్రికే హస్తినకు చేరుకున్నారు.
సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైన వెంటనే ఢిల్లీకి చేరుకున్న బీసీ సంక్షేమ శాఖకు చెందిన అధికారుల బృందంతో కలిసి న్యాయవాదులతో కూలకషంగా చర్చించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీవోను సవాల్ చేస్తూ వంగా గోపాల్‌రెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఈ నెల 4న ఆయన ఈ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై సోమవారం జస్టిస్ విక్రమ్‌నాథ్, జస్టిస్ సందీప్ మెహతాలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారణ జరపనుంది.
అఖిల పక్షం భేటీ
బీసీల రిజర్వేషన్లపై హైదరాబాద్ వేదికగా బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎంపీ ఆర్.కృష్ణయ్య ఆధ్వర్యంలో అఖిలపక్ష సమావేశం జరిగింది. అధికార కాంగ్రెస్‌తో పాటు బీఆర్‌ఎస్, బీజేపీ, ప్రజా సంఘాల ప్రతినిధులు హాజరై బీసీల రిజర్వేషన్లకు మరోమారు మద్దతు ప్రకటించారు. బీసీలకు రిజర్వేషన్ల కల్పనను వ్యతిరేకిస్తూ హైకోర్టులో దాఖలైన పిటిషన్‌లో ఇంప్లీడ్ కావాలని ఇప్పటికే నిర్ణయించిన బీసీ సంఘాలు.. సుప్రీంకోర్టులో జరిగే విచారణకు కూడా హాజరు కానున్నాయి.
మరోవైపు బీసీల రిజర్వేషన్లను అడ్డుకుంటే రాష్ట్రంలో అగ్గిరాజేస్తామని ఆ సంఘాలు హెచ్చరిస్తున్నాయి. తమకు అందివచ్చిన రిజర్వేషన్లను అడ్డుకుంటే సహించేది లేదని, ఈ నెల 7వ తేదీన పూలే విగ్రహాల వద్ద నిరసనలు తెలియజేస్తామని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు. ఇలావుండగా సుప్రీంకోర్టు తీర్పును బట్టి కార్యాచరణ రూపొందించుకునేందుకు బీసీ సంఘాల జేఏసీ సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో సమావేశం కావాలని నిర్ణయించింది.
అందరి దృష్టీ దీనిపైనే..
కోర్టులు ఇచ్చే తీర్పులకు అనుగుణంగా రాజకీయంగా ఎలా ముందుకెళ్లాలనే కార్యాచరణ రూపొందించుకునేందుకు బీఆర్‌ఎస్, బీజేపీలు సిద్ధమవుతున్నాయి. ఒకవేళ బీసీ రిజర్వేషన్లను సాధించలేని పక్షంలో రాష్ట్ర ప్రభుత్వంపై మూకుమ్మడి దాడికి ప్రణాళిక రూపొందించుకుంటున్నాయి. మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్న ఆశావహుల్లో కూడా టెన్షన్ నెలకొంది.
ఇంకోవైపు కోర్టుల తీర్పుల అనంతరం రాష్ట్ర ప్రభుత్వ సూచనల మేరకు ఎలా ముందుకెళ్లాలన్న దానిపై ఎన్నికల సంఘం కూడా ఇప్పటికే కార్యాచరణ రూపొందించుకోవడం గమనార్హం. మొత్తం మీద స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ విషయంలో సోమవారం సుప్రీంకోర్టు విచారణ అనంతరం స్పష్టత వస్తుందా? ఈ నెల 8న హైకోర్టు విచారణ వరకు వేచి ఉండాల్సి వస్తుందా? అనే దానిపై సందిగ్ధత నెలకొంది.
రిజర్వేషన్లు అడ్డుకునే ప్రయత్నాలు విరమించుకోవాలి: మంత్రి పొన్నం
ఢిల్లీ వెళ్లడానికి ముందు శంషాబాద్ విమానాశ్రయంలో మంత్రి పొన్నం మీడియాతో మాట్లాడారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను అడ్డుకునే ప్రయత్నాలను విరమించుకోవాలని కోరారు. సుప్రీంకోర్టు కేసులో రాష్ట్రంలోని రాజకీయ పార్టీలు కూడా ఇంప్లీడ్ కావాలని, అసెంబ్లీలో చెప్పిన అభిప్రాయాలను కోర్టుకు వెల్లడించాలని విజ్ఞప్తి చేశారు. తాము కూడా అన్ని రాజకీయ పార్టీల మద్దతుతో రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో రిజర్వేషన్ల పెంపు బిల్లును ఆమోదించిందన్న విషయాన్ని కోర్టుకు తెలియజేస్తామని చెప్పారు. సామాజిక న్యాయానికి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంటుందని అన్నారు.