
ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తర్వాతే అభ్యర్థి ప్రకటన
పోలింగ్ బూత్‌లవారీగా నేతలకు మీనాక్షి మార్గదర్శనం
ఉప ఎన్నికల్లో గెలిచి తీరాలని స్పష్టీకరణ
సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అభ్యర్థి ఎంపిక కోసం కాంగ్రెస్ పార్టీ షార్ట్‌లిస్ట్‌ను సిద్ధం చేసినట్టు తెలిసింది. ఆదివారం ప్రజా భవన్‌లో టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ అధ్యక్షతన జరిగిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సన్నాహక సమావేశంలో నలుగురి పేర్లతో కూడిన జాబితాను ఖరారు చేసినట్లు సమాచారం. పోటీ రేసులో దానం నాగేందర్, గడ్డం రంజిత్‌రెడ్డి, బొంతు రామ్మోహన్, అంజన్‌కుమార్ యాదవ్, నవీన్ యాదవ్, కంజర్ల విజయలక్ష్మి యాదవ్, సీఎన్‌రెడ్డి, మురళీగౌడ్‌ల పేర్లు వినిపించాయి. వాటి నుంచి మూడు పేర్లతోపాటు మరో కొత్తపేరును జోడించి నలుగురి పేర్లతో జాబితాను ఏఐసీసీకి పంపినట్లు సమాచారం.
అయితే, ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాతే అభ్యర్థి ప్రకటన ఉంటుందని గాంధీభవన్ వర్గాలు చెబుతున్నాయి. కాగా, గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ పదవికి ఎంపికైన మాజీ క్రికెటర్ అజారుద్దీన్ మనస్సు మార్చుకుని తనకు జూబ్లీహిల్స్ టికెట్ ఇవ్వాలని పట్టుబడుతున్నట్లు తెలిసింది. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కూడా ఇక్కడ పోటీ చేసేందుకు తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధపడినట్లు ప్రచారం జరిగింది. అయితే, తాను రాజీనామా చేయట్లేదు ఆయన ప్రకటించారు.
గెలిచి తీరాలన్న పట్టుదలతో..
బీఆర్‌ఎస్ సిట్టింగ్ సీటు అయిన జూబ్లీహిల్స్ స్థానంలో కచ్చితంగా గెలిచి తీరాలని అధికార కాంగ్రెస్ వ్యూహాలు రచిస్తోంది. త్వరలో వెలువడే బిహార్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌తోనే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక షెడ్యూల్ కూడా వస్తుందనే అంచనాల నేపథ్యంలో ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఇప్పటికే మంత్రులు, రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్లను రంగంలోకి దింపి పెద్ద ఎత్తున ప్రచారం ప్రారంభించింది. ఆదివారం జరిగిన కీలక సమావేశానికి ఏఐసీసీ ఇన్‌చార్జి మీనాక్షీ నటరాజన్, పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ హాజరై 22 మంది పరిశీలకులకు మార్గదర్శనం చేశారు.
టికెట్ ఎవరికి వచ్చినా కలిసి పని చేయాలని స్పష్టంచేశారు.పోలింగ్ బూత్ స్థాయి ఇన్‌చార్జీలకు కూడా మీనాక్షి దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వరరావు, ఏఐసీసీ కార్యదర్శి విశ్వనాథన్ తదితరులు కూడా పాల్గొన్నారు. పోలింగ్ బూత్‌లవారీగా పార్టీ పరిస్థితిని సమీక్షించారు. సర్వేలు సానుకూలంగా ఉన్నాయని, అభ్యర్థి ఎంపిక తర్వాత ఎక్కడా ఇబ్బందులు రాకుండా చూసుకోవాలని మీనాక్షి సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ఓటర్లకు వివరించి పార్టీని గెలిపించాలని కోరారు.