
మాట్లాడుతున్న హరీశ్‌రావు. చిత్రంలో ప్రశాంత్‌రెడ్డి
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మొదటి నుంచి దక్షిణాది రాష్ట్రాలపై వివక్ష చూపుతోందని, మనం పండించే వడ్ల కన్నా, ఉత్తర భారతంలో పండించే గోధు మలకు ధర ఎక్కువ ఉండడమే ఇందుకు నిదర్శనమని మాజీమంత్రి టి హరీశ్‌రావు అన్నారు. కామారెడ్డి జిల్లా లోని నాగిరెడ్డిపేట, గాంధారి మండలాల్లో ఆదివారం ఆయన పర్యటించారు. నాగిరెడ్డిపేట మండలం బంజర శివారులో మంజీర ప్రవాహంతో మునిగిన పంటలను పరిశీలించారు.
అనంతరం గాంధారి మండల కేంద్రంలో బీఆర్‌ఎస్‌లో బీజేపీ నేతల చేరిక కార్యక్రమంలో హరీశ్‌రావు పాల్గొని మాట్లా డారు. 2014లో కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం, రాష్ట్రంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఒకేసారి అధికారంలోకి వచ్చాయని, అప్పుడు వడ్లు క్వింటాల్‌కు మద్దతు ధర రూ.1,400, గోధుమలు క్వింటాల్‌కు మద్దతు ధర రూ.1,400 ఉండేవని, ఇప్పుడు వడ్ల ధర రూ.2,369 ఉంటే, గోధుమల ధర రూ.2,585 కు చేరిందన్నారు. ఉత్తర భారతంలో గోధుమలు పండించడం వల్లే ధర ఎక్కువగా ఇస్తూ, దక్షిణాన ముఖ్యంగా తెలంగాణలో పండించే వడ్లకు తక్కువ ధర ఉండడం కేంద్రం వివక్ష కాదా అని ప్రశ్నించారు.
వరద బాధితులకు సాయం ఏదీ..
ఇటీవల కామారెడ్డి జిల్లాలో వరదలు సంభవిస్తే, స్వయంగా వచ్చి చూసిన సీఎం పదిహేను రోజుల్లో రివ్యూ చేస్తానని చెప్పి నెల రోజులు గడిచినా రివ్యూ లేదని, మొహం చాటేశాడన్నారు. కాంగ్రెస్ పాలనపై తెలంగాణ ప్రజలు విసిగిపోయారని, కేసీఆర్ రావాలని ఊరూరా కోరుకుంటున్నారని చెప్పారు.