ఇదేనా మీ 40 ఏళ్ల రాజకీయ అనుభవం బాబూ?: తాటిపర్తి | Ysrcp Mla Tatiparthi Chandrasekhar Fires On Chandrababu | Sakshi
Sakshi News home page

ఇదేనా మీ 40 ఏళ్ల రాజకీయ అనుభవం బాబూ?: తాటిపర్తి

Jan 28 2026 7:29 PM | Updated on Jan 28 2026 8:21 PM

Ysrcp Mla Tatiparthi Chandrasekhar Fires On Chandrababu

సాక్షి, తాడేప‌ల్లి: రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలపై సీఎం చంద్రబాబు నిర్లక్ష్య వైఖరి ప్రదర్శిస్తున్నారని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్‌ తీవ్రంగా మండిపడ్డారు. రైల్వే కోడూరు నియోజకవర్గానికి చెందిన మహిళకు జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ చేతిలో జరిగిన అన్యాయంపై స్వయంగా బాధితురాలే చంద్రబాబుకు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడం దుర్మార్గమని విమర్శించారు. తాడేప‌ల్లిలోని పార్టీ కేంద్ర కార్యాల‌యంలో బుధ‌వారం ఆయన మీడియాతో మాట్లాడారు.

మహిళా లోకానికి మీ దృష్టిలో విలువ లేదా బాబూ?
ఒక మహిళ మీ వద్దకు వచ్చి.. మీ ఎమ్మెల్యే నన్ను వేధిస్తున్నాడు, న్యాయం చేయండి అని మొరపెట్టుకుంటే కూడా స్పందించరా చంద్ర‌బాబు? ఇదేనా మీ 40 సంవత్సరాల అనుభవం? ఇదేనా మహిళా లోకానికి మీ దృష్టిలో ఉన్న విలువ?. రాష్ట్రంలో చంద్రబాబు పాలన కీచక పర్వంగా మారింది.  అరవ శ్రీధర్ పేరుకు జనసేన ఎమ్మెల్యే అయినా, వచ్చినది టీడీపీ నుంచే. ఆదిమూలం నుంచి అరవ శ్రీధర్ వరకు కీచకత్వం కొనసాగుతూనే ఉంది.

3 హత్యలు, 6 మానభంగాలు.. ఇదేనా మీ పాల‌న‌?
రాష్ట్రంలో పరిపాలన పక్కదారి ప‌ట్టింది. 10 విహారయాత్రలు, 3 హత్యలు, 6 మానభంగాలు… ఇదే ఈ రోజు రాష్ట్ర పాలన పరిస్థితి. రైల్వే కోడురు బాధిత మహిళ చేసిన ఆరోపణలు జుగుప్సాకరం. హోంశాఖను ‘వర్క్ ఫ్రమ్ హోం’ శాఖగా మార్చేశారు, హోం మంత్రి పోలీస్ వ్యవస్థను పాతాళానికి తొక్కేశారు.

మీ ఇంట్లో మ‌హిళ అయితే ఇలాగే మౌనంగా ఉంటారా?
సంక్రాంతి సందర్భంగా నారావారి పల్లెలో ముఖ్యమంత్రికి బాధిత మహిళ స్వయంగా వెళ్లి జ‌న‌సేన ఎమ్మెల్యే అర‌వ శ్రీ‌ధ‌ర్‌పై ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. ఒక వివాహిత మహిళ జీవితానికి సంబంధించిన వ్యవహారంలో ముఖ్యమంత్రి ఇలాగేనా వ్య‌వ‌హ‌రించేది. అదే మీ ఇంట్లో మహిళ గురించి ఏమీ అనకపోయినా రాద్ధాంతం చేసే మీరు… రైల్వే కోడూరులో బాధిత మహిళపై ఎందుకు మౌనం వహిస్తున్నారు?

ఇది ద‌ద్ద‌మ్మ ప్ర‌భుత్వం
కుప్పంలో మహిళను చెట్టుకు కట్టేసి కొట్టిన ఘటనను పంచాయితీ చేసి పక్కదారి పట్టించారు. అమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్ కేసులోనూ చర్యలు లేవు. ఇదే టీడీపీ పాలన. ముఖ్య‌మంత్రిగా, టీడీపీ అధినేత‌గా ఉన్న చంద్ర‌బాబు త‌న పాల‌న చూసి సిగ్గుపడాలి. బాధిత మహిళ గోడు వెళ్లబోసుకుంటే మాటల దాడులు చేయిస్తారా? ప్రెస్‌ మీట్లు పెట్టి తిట్టిస్తారా? అరవ శ్రీధర్‌పై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? చిన్నపిల్లలపై అఘాయిత్యాలు జరిగినా పట్టించుకోని దద్దమ్మ ప్రభుత్వం ఇది.

శాంతిభద్రతలు కాపాడలేకపోతే ఈ ప్రభుత్వం ఎందుకు? దేశంలోనే ఏపీ పోలీస్ శాఖ 36వ స్థానానికి పడిపోయింది. అయినా గొప్ప ప్రభుత్వం అని స్టిక్కర్లు వేసుకుంటున్నారు.  త‌నకు  జ‌రిగిన అన్యాయంపై ముఖ్యమంత్రి స్పందించకపోతే బాధిత మహిళ స్వయంగా బయటకు వచ్చి మాట్లాడుతుంది. సుగాలి ప్రీతికి జరిగిన ఘోరం, ఇవాళ రైల్వే కోడూరులో మహిళకు జరిగింది. బాధితురాలికి న్యాయం చేయాల్సిందే. బాధిత మహిళకు వైఎస్సార్‌సీపీ అండగా ఉంటుంది. ముఖ్యమంత్రి ఆదుకోకపోతే ప్రతిపక్షంగా మేమే ఆమెకు అండగా నిలుస్తాం” అని తాటిపర్తి చంద్రశేఖర్ స్పష్టం చేశారు. రైల్వే కోడూరు ఘటనపై తక్షణమే చర్యలు తీసుకుని బాధిత మహిళకు న్యాయం చేయాలని ఆయ‌న‌ డిమాండ్ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement