సాక్షి,తెలంగాణ భవన్: వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ సొంత గూటికి చేరారు. కేటీఆర్ ఆధ్వర్యంలో బీఆర్‌ఎస్‌లో చేరారు. తెలంగాణ భవన్‌లో కార్యకర్తల సమక్షంలో కేటీఆర్ బీఆర్‌ఎస్ కండువా కప్పి ఆరూరిని పార్టీలోకి ఆహ్వానించారు.
గత సోమవారం బీజేపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసిన రమేష్.. బీఆర్‌ఎస్ అధిష్టానం ఆహ్వనం మేరకు త్వరలోనే పలువురు నాయకులు, అనుచరులు, అభిమానులతో కలిసి గులాబీ పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించారు. చెప్పినట్లుగా ఇవాళ బీఆర్‌ఎస్‌లో చేరారు. వర్ధన్నపేట మున్సిపల్ ఎన్నికల వేళ అరూరి రమేశ్ తిరిగి బీఆర్‌ఎస్ పార్టీలో చేరనుండటంతో రాజకీయ ప్రాధాన్యం సంతరించుకుంది.
2024, మార్చిలో బీఆర్‌ఎస్‌ను వీడి బీజేపీలో చేరిన రమేష్ అదే ఏడాది జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత రాజకీయంగా ఆశించిన స్థాయి ప్రాధాన్యం లభించకపోవటం, పార్టీలో క్రియాశీలక ప్రాధాన్యం తగ్గిపోవడం ఆయన అసంతృప్తికి కారణమైనట్టు తెలుస్తోంది.


