విద్యారణ్యపురి: పదో తరగతి వార్షిక పరీక్షలు శని వారం ప్రారంభమయ్యాయి. జిల్లాలో 64 కేంద్రాల్లో తొలిరోజు తెలుగు పరీక్షను నిర్వహించారు. 12,049 మంది విద్యార్థుల్లో 12,033 మంది (99.87 శాతం) హాజరయ్యారు. కాగా, హనుమకొండ లష్కర్‌బజార్‌లోని ప్రభుత్వ ప్రాక్టీసింగ్ హైస్కూల్, ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలోని పరీక్ష కేంద్రాలను కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ తనిఖీ చేశారు. విద్యార్థులకు కల్పిస్తున్న వసతులను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. ఆమె వెంట డీఈఓ ఎల్వీ గిరిరాజ్‌గౌడ్ ఉన్నారు. అదేవిధంగా జిల్లాలోని మరో ఐదు పరీక్ష కేంద్రాలను రాష్ట్రస్థాయి అబ్జర్వర్, రాష్ట్ర మోడల్ స్కూల్స్ అడిషనల్ డైరెక్టర్ ఎస్.శ్రీనివాసాచారి, 21 పరీక్ష కేంద్రాలను నాలుగు ఫ్లయింగ్ స్క్వాడ్‌లు తనిఖీ చేశాయి.
జిల్లాలో 99.87 శాతం మంది హాజరు


