
వరదతో వణుకు!
సాక్షి, సిటీబ్యూరో/బండ్లగూడ
జంట జలాశయాల్లోకి భారీ వరద నీరు వచ్చి చేరుతోంది. ఎగువ ప్రాంతాల్లో ఎడతెరిపిలేని వర్షాలతో వరద ప్రవాహం పెరిగింది. గురువారం హిమాయత్ సాగర్ రిజర్వాయర్ 9 గేట్లను నాలుగు అడుగుల మేర ఎత్తి వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం ఎగువ ప్రాంతాల నుంచి 9,000 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో కొనసాగుతుండగా, దిగువకు 12,046 క్యూసెక్కుల నీరు విడుదలవుతోంది. అంతకు ముందు 11 గేట్లు ఎత్తి క్రమంగా రెండు గేట్లు మూసి వేశారు. మరోవైపు ఉస్మాన్ సాగర్ (గండిపేట్) రిజర్వాయర్‌కు 2,800 క్యూసెక్కుల వదర నీరు వస్తోంది. పూర్తిస్థాయి నీటి మట్టం 1,790 అడుగులు కాగా.. ప్రస్తుతం 1785.50 అడుగులు చేరింది. హిమాయత్ సాగర్ గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేయడంతో జలమండలి ఎండీ అశోక్ రెడ్డి అధికారులను అప్రమత్తం చేశారు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల యంత్రాంగాలు, హైడ్రా, జీహెచ్‌ఎంసీ, పోలీసు అధికారులతో సమన్వయంతో వ్యహరించాలని ఆయన సూచించారు.
సర్వీస్ రోడ్డుపై..
హిమాయత్‌సాగర్ వరద గేట్లను ఎత్తిన ప్రతిసారి సర్వీస్ రోడ్డును మూసివేయాల్సిన పరిస్థితి నెలకొంది. వరద ప్రవాహం అధికంగా ఉండడంతో ప్రతిసారి ఈ రోడ్డు పూర్తిగా కొట్టుకుపోతోంది. ప్రవాహం తగ్గిన తర్వాత కొత్త రోడ్డు నిర్మాణం తప్పం లేదు. వరద ప్రవాహానికి సంబంధం లేకుండా రోడ్డును కొంతపైకి లేని నిర్మించాలని స్థానికుల నుంచి డిమాండ్ వ్యక్తమవుతోంది.
అప్రమత్తం చేసిన అధికారులు..
వరద నీరు భారీగా వచ్చి చేరుతుండడంతో అధికారులు మూసీ, ఈసీ పరీవాహక ప్రాంతాల్లోని ప్రజ లను అప్రమత్తం చేశారు. ప్రజలు ఎవరు పరీవాహక ప్రాంతాల్లో ఉండవద్దని హెచ్చరికలు జారీ చేశా రు. మైక్‌ల ద్వారా, వాట్సప్ గ్రూప్‌లు తదితర వాటి ని ఉపయోగించి ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. వరద ముప్పు దృష్ట్యా సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని సూచించారు. కొంత మంది స్వచ్ఛందంగా ఇళ్లను ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లారు.
ఇళ్లల్లోకి వరద నీరు..
హిమాయత్‌సాగర్ గేట్లు ఎత్తడంతో మూసీ, ఈసీ నదుల నుంచి వరద నీరు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. దీంతో పరీవాహక ప్రాంతాల్లోని ఇళ్లల్లోకి వరద నీరు భారీగా వచ్చి చేరింది. దీంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అధికారులు లోత ట్టు ప్రాంతాలలోని ప్రజలను కాపాడేందుకు సహా య చర్యలు చేపట్టారు. వరద నీరు భారీగా చేరడంతో రోడ్లు పూర్తిగా చెరువులను తలపిస్తున్నాయి.
రెవెన్యూ అధికారుల పర్యటన
ఈసీ, మూసీ నది పరీవాహక ప్రాంతాల్లో ఆర్‌డీఓ వెంకట్‌రెడ్డి, తహసీల్దార్ రాములు, మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ బి.శరత్‌చంద్ర పర్యటించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయడంలో భాగంగా ముంపు ప్రాంతాలలో నివసిస్తున్న 40 మంది బాధితులను బండ్లగూడ జాగీరు మున్సిపల్ కార్యాలయం పరిధిలో ఏర్పాటు చేసిన రెండు పునరావాస కేంద్రాలకు తరలించారు. కొందరు దగ్గరలోని వారి బంధువుల ఇళ్లలోకి వెళ్లారు. వారికి భోజనాలు, ఇతర వసతులు కల్పిస్తామని అధికారులు తెలిపారు.
నీటి ఉద్ధృతితో కూలిన వాకింగ్ ట్రాక్
ఉప్పల్: ఉస్మాన్ సాగర్ గేట్లు ఎత్తడంతో గురువారం మూసీ ఉగ్రరూపం దాల్చింది. ఉప్పల్ నాగోల్ వంతెన వద్ద పరవళ్లు తొక్కుతూ ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. ఉప్పల్ మినీ శిల్పారామం అభివృద్ధిలో భాగంగా మూసీకి సమాంతరంగా నిర్మించిన వాకింగ్ ట్రాక్ వరద ధాటికి పూర్తిగా మునిగిపోయింది. కొన్ని చోట్ల మూసీలోకి కూలి పోయింది. ఈ వాకింగ్ ట్రాక్ కూలిపోవడం ఇది రెండోసారి.
వరద నీటితో మునిగిపోయిన ఇళ్లు
జంట జలాశయాలకు ఎగువ నుంచి భారీ ప్రవాహం
హిమాయత్ సాగర్ 9 గేట్లు ఎత్తివేత
మూసీలోకి 12,046 క్యూసెక్కుల నీటి విడుదల
అధికారులను అప్రమత్తం చేసిన జలమండలి ఎండీ
పూర్తి స్థాయి నీటి మట్టం : 1,763.50 అడుగులు
ప్రస్తుత నీటి స్థాయి : 1,763.20 అడుగులు
రిజర్వాయర్ పూర్తి సామర్థ్యం : 2.970 టీఎంసీలు
ప్రస్తుత సామర్థ్యం : 2.855 టీఎంసీలు
ఇన్ ఫ్లో : 9000 క్యూసెక్కులు
అవుట్ ఫ్లో : 12046 క్యూసెక్కులు
మొత్తం గేట్ల సంఖ్య : 17
ఎత్తిన గేట్ల సంఖ్య : 9 (నాలుగు అడుగుల మేరకు)
హిమాయత్ సాగర్ రిజర్వాయర్ వివరాలు