సాక్షి, సిటీబ్యూరో: రాజధానిలో ఏమాత్రం వర్షం కురిసినా రహదారులన్నీ జలమయం అవుతాయి. అమీర్‌పేట చుట్టుపక్కల ప్రాంతాల విషయం విడిగా చెప్పక్కర్లేదు. ఇక్కడి సమస్యల్ని అధ్యయనం చేసిన హైడ్రా నాలాల పూడిక తీతే తొలి పరిష్కారంగా గుర్తించింది. జీహెచ్‌ఎంసీ, జలమండలి, ఇరిగేషన్ అధికారులతో కలిసి ముందుకు వెళ్లింది. ఫలితంగా మైత్రీవనంతో పాటు గాయత్రినగర్ చుట్టపక్కల ప్రాంతాల్లో ముంపు సమస్య తప్పింది. కమిషనర్ ఏవీ రంగనాథ్ గురువారం ఆయా ప్రాంతాల్లో పర్యటించి పనులను పర్యవేక్షించారు. జూబ్లీహిల్స్, గాయత్రీ హిల్స్, యూసుఫ్‌గూడ, కృష్ణానగర్, మధురానగర్, శ్రీనివాసనగర్ ప్రాంతాల నుంచి వచ్చే వరద నీరు అమీర్‌పేట నుంచి ముందుకు వెళ్లడానికి అనేక అడ్డంకులు ఉండేవి. దీంతో ఆ ప్రాంతంతో పాటు చుట్టుపక్కల రహదారిపై భారీగా నిలిచిపోయేవి.
అమీర్‌పేట జంక్షన్‌లో సారథీ స్టూడియోస్, మధురానగర్ వైపు నుంచి వచ్చే పైపులైన్లు కలుస్తాయి. దీంతో ఎగువ నుంచి వరదతో పాటు భారీ మొత్తంలో చెత్త కూడా వాటి ద్వారా అక్కడకు చేరుతోంది. అలా దశాబ్దాలుగా చేరిన చెత్తతో అమీర్‌పేట జంక్షన్‌లో ఆరు పైపులైన్లు పూడుకుపోయాయి. దీంతో కొంత మొత్తంలోనే వరద నీరు ముందుకు సాగేది. శ్రీనివాస నగర్ వైపు వరద కాలువ పైన కాంక్రీట్‌తో వేసిన పైకప్పు తెరచి పూడిక తీత పనులను హైడ్రా చేపట్టింది. పరుపులు, దిండ్లు ఇలా చెత్తతో మూసుకుపోయిన పైపులైన్లను తెరచింది. ఇప్పటి వరకూ దాదాపు 45 ట్రక్కుల మట్టిని తొలగించింది. దీంతో ఇటీవల అక్కడ 10 సెంటీమీటర్ల వర్షం పడినా ఇబ్బంది కలగలేదు. మరో మూడు పైపు లైన్లలో కూడా పూడికను తొలగిస్తే 15 సెంటీమీటర్ల వర్షం పడినా అమీర్‌పేటలో వరద ముంచెత్తదని అధికారులు చెప్తున్నారు. ఇదే మాదిరి నగరంలోని ముంపు సమస్యను ఎదుర్కొంటున్న ప్రాంతాల్లో కల్వర్టులు, అండర్‌గ్రౌండ్ పైపు లైన్లలో పూడికను తొలగించి పరిష్కారం చూపాలని రంగనాథ్ సూచించారు. అమీర్‌పేటలో వరద ముప్పు తప్పించేందుకు అనుసరించిన విధానం నగరంలోని అనేక ప్రాంతాలకు అనుసరణీయమని తెలిపారు. పూడుకుపోయిన నాలాలను ఇదే మాదిరి తెరిస్తే చాలావరకు వరద సమస్యకు పరిష్కారం అవుతుందని అన్నారు.
పనులు పర్యవేక్షిస్తున్న రంగనాథ్
నాలాల్లోని పూడిక తొలగించడంతో తీరిన ఇబ్బంది
ఊపిరి పీల్చుకున్న మైత్రీవనం, గాయత్రి నగర్...