
జూబ్లీహిల్స్‌లో గెలుపే లక్ష్యం
తెలంగాణకు కేసీఆర్ కుటుంబం ద్రోహం చేసింది
● తెలంగాణ ఇచ్చింది సోనియానే..
● ఏఐసీసీ తెలంగాణ ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్
వెంగళరావునగర్: రాష్ట్రం కోసం ఎంతో మంది బలిదానాలు చేశారని, వాటిని గుర్తించిన సోనియా గాంధీ చివరకు ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చారని ఏఐసీసీ తెలంగాణ ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్ అన్నారు. యూసుఫ్‌గూడ డివిజన్ పరిధిలోని మహమ్మద్ ఫంక్షన్‌హాల్, సోమాజిగూడ డివిజన్ పరిధిలోని శాలివాహననగర్ ఫంక్షన్‌హాల్‌లో గురువారం జరిగిన బూత్‌కమిటీ సమావేశాలకు ముఖ్యఅతిథిగా హాజరైన ఆమె మాట్లాడారు. తెలంగాణను అభివృద్ధి చేస్తారని నమ్మి ప్రత్యేక రాష్ట్రం ఇస్తే..కేసీఆర్ కుటుంబం ఏ మాత్రం అభివృద్ధి చేయలేదని విమర్శించారు. సన్నబియ్యం ఇచ్చింది, కేవలం మన రాష్ట్రంలో మాత్రమేనని, ఈ ఘనత కాంగ్రెస్‌కే దక్కుతుందన్నారు. ముఖ్యంగా జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో చివరి ఓటరు ఓటు వేసే వరకు బూత్ కమిటీ ఇన్‌చార్జిలు అత్యంత జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఈవీఎంలకు తాళాలు వేసిన తర్వాతనే రిలాక్స్ కావాలని సూచించారు. జూబ్లీహిల్స్ గెలుపే లక్ష్యంగా ప్రతి కార్యకర్త పనిచేయాలని చెప్పారు.
బీసీ రిజర్వేషన్లపై చిత్తశుద్ధి ఉంది..
పీసీసీ అధ్యక్షులు మహేష్‌కుమార్ గౌడ్ మాట్లాడుతూ జనాభా నిష్పత్తిని బట్టి తెలంగాణాలో బీసీలకు 42 రిజర్వేషన్లు ఇవ్వడానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని అన్నారు. చివరి వరకు కూడా తాము ఇచ్చిన మాటకు నిలబడి ఉంటామని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ చేపట్టిన అభివృద్ధిని చూసి తట్టుకోలేకనే బీఆర్‌ఎస్ తప్పుడు ప్రచారాలు చేస్తుందని అన్నారు. మంత్రులు పొన్నం ప్రభాకర్, వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్‌యాదవ్‌కు లక్ష మెజార్టీ రావాలంటే కనీసం 70 శాతం ఓటింగ్ జరిగేలా చూడాలని, ప్రతి ఇంటికి వెళ్లి తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ప్రచారం చేయాలన్నారు. బీఆర్‌ఎస్, బీజేపీ రెండూ ఒకటేనని ఆయా పార్టీలను నమ్మవద్దన్నారు. బీజేపీ, బీఆర్‌ఎస్ నేతలు ఓట్లు అడగానికి వస్తే తమకేమి చేశారని, ఎందుకు మీకు ఓటు వేయాలని ప్రశ్నించాలని మంత్రులు సూచించారు. జూబ్లీహిల్స్ అభ్యర్థి నవీన్‌యాదవ్ మాట్లాడుతూ అధిష్టానం తనపై నమ్మకం ఉంచి టికెట్ ఇచ్చిందని, అధిస్టానం గౌరవం నిలబెట్టాలంటే ఇక్కడ హస్తం గుర్తుకు ఓటేసి గెలిపించుకోవాలని చెప్పారు. గత పదేళ్ళలో జూబ్లీహిల్స్‌లో అభివృద్ధి మాట దేవుడెరుగు నేతలు, కార్యకర్తలకు, ప్రజలకు అన్యాయమే ఎక్కువగా జరిగిందన్నారు. శుక్రవారం జరగనున్న నామినేషన్ కార్యక్రమానికి భారీగా తరలి రావాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు అనిల్‌కుమార్ యాదవ్, పార్టీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ అజారుద్దీన్, కార్పొరేటర్లు సి.ఎన్.రెడ్డి, విజయారెడ్డి, మాజీ కార్పొరేటర్ సంజయ్‌గౌడ్, సీనియర్ నాయకులు భవానీశంకర్, నాగార్జునరెడ్డి తదితరులు పాల్గొన్నారు. అనంతరం మీనాక్షి నటరాజన్ ఆధ్వర్యంలో ఓట్‌చోర్ సంతకాల సేకరణ పత్రాలను పంపిణీ చేశారు.